ఉత్కంఠ పోరులో విజేత పల్లా

ABN , First Publish Date - 2021-03-21T06:28:58+05:30 IST

ఉత్కంఠ పోరులో విజేత పల్లా

ఉత్కంఠ పోరులో విజేత పల్లా

రెండో ప్రాధాన్య ఓటుతో రాజేశ్వరరెడ్డి విజయం

పోరాడి ఓడిన తీన్మార్‌ మల్లన్న

మూడోస్థానంలో నిలిచిన కోదండరాం

86గంటలపాటు సాగిన కౌంటింగ్‌ ప్రక్రియ

టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో విజయోత్సాహం

నల్లగొండ/ఖమ్మం, మార్చి20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉత్కంఠగా, సుదీర్ఘంగా సాగిన నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజేతగా నిలిచారు. ఈ నెల 14న పోలింగ్‌ నిర్వహించగా, ఉమ్మడి నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాల పరిధిలో మొత్తం 5,05,565 ఓట్లకు, 3,86,320 ఓట్లు(76.41శాతం) పోలయ్యాయి. 1691 పోస్టల్‌ బ్యాలెట్లను కలిపి మొత్తం 3,87,969 ఓట్ల లెక్కింపును ఈ నెల 17న ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. తొలుత 48గంటల్లో కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు అంచనా వేయగా, లెక్కింపు పూర్తి, విజేత ప్రకటన వరకు మొత్తం 86గంటల సమయం పట్టింది. మొత్తం 56 టేబుళ్లపై, టేబుల్‌కు 1000 ఓట్ల చొప్పున రౌండుకు 56వేల ఓట్ల చొప్పున లెక్కింపు నిర్వహించారు. మొత్తం ఏడు రౌండ్లలో మొదటి ప్రాధాన్య ఓట్లను లెక్కించగా, అందుకు 19వ తేదీ ఉదయం వరకు సమయం పట్టింది. అనంతరం ఎలిమినేషన్‌ ప్రక్రియను ప్రారంభించి రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టి శనివారం రాత్రి 10గంటలకు విజేతను ప్రకటించారు.

రెండో ప్రాధాన్య ఓటుతో ఫలితం..

ఎమ్మెల్సీ ఎన్నికలో మొత్తం 3,87,969 ఓట్లు పోలవ్వగా, 21,636 ఓట్లు చెల్లుబాటు కాలేదు. మొదటి ప్రాధాన్య లెక్కింపులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 1,10,840 ఓట్లతో మొదటి స్థానంలో, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న 83,290 ఓట్లతో రెండో స్థానంలో, తెలంగాణ జనసమితి అభ్యర్థి ప్రొఫెసర్‌ కోదండరాం 70,072 ఓట్లతో మూడో స్థానంలో, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి 39,107 ఓట్లతో నాలుగో స్థానంలో, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములునాయక్‌ 27,588 ఓట్లతో ఐదో స్థానంలో, సీపీఐ అభ్యర్థి జయసారధిరెడ్డి 9,577 ఓట్లతో ఆరో స్థానంలో, తెలంగాణ ఇంటిపార్టీ అభ్యర్థి 8,631 ఓట్లతో ఏడో స్థానంలో, యువతెలంగాణ అభ్యర్థి రాణిరుద్రమరెడ్డి 7,756 ఓట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. మిగిలిన ఓట్లు 9,472 ఇతరులకు, స్వతంత్రులకు వచ్చాయి. విజేతగా నిలవాలంటే కోటా ఓట్లు 1,83,167 ఏ అభ్యర్థికీ రాకపోవడంతో 19వతేదీ ఉదయం 7గంటలకు ఎలిమినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. రెండో ప్రాధాన్యంలో పల్లా, కోదండరాం, తీన్మార్‌ మల్లన్న మధ్య ఓట్ల బదలాయింపుతో స్థానాలు మారుతూ రావడంతో గంట గంటకూ ఉత్కంఠ నెలకొంది. తొలి మూడు స్థానాల్లో ఉన్న అభ్యర్థులను ఉంచి మిగతా వారందరినీ ఎలిమినేట్‌ చేయగా పల్లాకు 1,32,683ఓట్లు, తీన్మార్‌ మల్లన్నకు 1,08,104, కోదండరామ్‌కు 1,02,884 ఓట్లు లభించాయి. దీంతో చివరి స్థానంలో నిలిచిన కోదండరామ్‌ను ఎలిమినేట్‌ చేసి, రెండో ప్రాధాన్య ఓట్లను మిగతా ఇద్దరు అభ్యర్థులకు పంచి లెక్కించగా 1,61,811 ఓట్లతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మొదటి స్థానంలో, చివరికంటూ పోరాటం చేసిన తీన్మార్‌ మల్లన్న 1,49,005 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో కోదండరాం నిలిచారు. పల్లాకు 12,806 ఓట్ల ఆధిక్యత లభించింది. అయితే కోటాకు పల్లాకు సరిపడా ఓట్లు లేకపోవడంతో, తీన్మార్‌ మల్లన్నకు వచ్చిన మొదటి ప్రాధాన్యంలో పల్లాకు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. దీంతో పల్లాకు కోటా పూర్తికావడంతో విజేతగా ప్రకటించారు. 

అడుగడుగునా ఉత్కంఠ

సుదీర్ఘంగా కొనసాగిన లెక్కింపు.. అడుగడుగునా ఉత్కంఠ పరిణామాలు.. వీటి మధ్య పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించి రెండోసారి శాసనమండలిలో అడుగుపెడుతున్నారు. ఈ ఎన్నికల్లో సామాన్యుడిగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన జర్నలిస్టు తీన్మార్‌ మల్లన్న(నవీన్‌కుమార్‌) సోషల్‌మీడియాతో పాటు తనదైన శైలిలో ఆర్భాటాలకు దూరంగా క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించి అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అధికార టీఆర్‌ఎస్‌కు ముచ్చెమటలు పట్టించడం గమనార్హం. మల్లన్న అనూహ్యంగా రెండోస్థానంలో నిలవడమే కాకుండా ఫలితంలో నువ్వానేనా అన్నట్టు అధికారపార్టీకి పోటీనిచ్చారు. ఒక దశలో తీన్మార్‌మల్లన్నదే విజయం అన్నట్టుగా కనిపించడగా.. చివరకు విజయం పల్లాను విజయం వరించింది. ఇదిలా ఉంటే ఈ సారి అధికార పార్టీకి గట్టి పోటీనిస్తారని భావించిన టీజేఎస్‌ నేత ప్రొఫెసర్‌ కోదండరామ్‌ రెండో ప్రాధాన్యత ఓటుతో విజయంసాధిస్తారన్న చర్చ జరిగింది. కానీ రెండో ప్రాధాన్యత ఓటులో కోదండరామ్‌ ముందున్నా.. మొదటి ప్రాధాన్యతలో అధికంగా ఓట్లు సాధించి పల్లా రాజేశ్వరరెడ్డి, మల్లన్న తనకంటే మందుండటంతో మూడోస్థానంతో ఎలిమినేట్‌అయ్యారు. ఇక బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి నాలుగోస్థానంలో నిలిచారు. గత ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లారాజేశ్వరరెడ్డికి, బీజేపీ అభ్యర్థి యర్రబెల్లి రాంమోహన్‌రావు గట్టి పోటీ ఇచ్చారు. అప్పుడు టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య పోటీ ఉండగా.. ఈ సారి బీజేపీ నాలుగో స్థానంలో ఉండిపోయింది. కాంగ్రెస్‌ అభ్యర్థి రాములునాయక్‌ ఐదోస్థానంతో సరిపుచ్చుకున్నారు. ఆయనకు సరైన ప్రచారం లేకపోవడం, కాంగ్రెస్‌ ముఖ్యనాయకులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోకపోవడంతో కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు అనుకున్న విధంగా ఓట్లు రాని పరిస్థితి ఏర్పడింది. 

టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు..

పల్లాకు పల్లా విజయంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. నాలుగు రోజులు పాటు సాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గతంలో ఎన్నడూలేని విధంగా ఉత్కంఠగా సాగగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి విజయంతో గులాబీ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నాయి. ఖమ్మం నగరంలో నాయకులు బాణసంచా కాల్చారు. 

పల్లా విజయం.. ప్రజల విజయం 

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వరెడ్డి సాధించిన విజయం ప్రజలదే. జాతీయ పార్టీలను పట్టభద్రులు తిరస్కరించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ఈ ఎన్నికల ద్వారా చాటి చెప్పారు. ప్రశ్నించే గొంతుకల కంటే పరిష్కరించే గొంతుక ముఖ్యమని భావించిన పట్టభద్రులు పల్లాకు ఈ విజయాన్ని కట్టబెట్టారు. కీలక సమయంలో టీఆర్‌ఎస్‌ వెంట నిలిచిన పట్టభద్రులకు నా కృతజ్ఞతలు. తెలంగాణ ఉద్యమంతో పాటు రాష్ట్ర అభివృద్థిలో పట్టభద్రులు ఇచ్చిన సహకారం మరవలేనిది. 


Updated Date - 2021-03-21T06:28:58+05:30 IST