ఉసురుతీస్తున్న అత్యాశ

ABN , First Publish Date - 2021-11-26T06:13:10+05:30 IST

ఉసురుతీస్తున్న అత్యాశ

ఉసురుతీస్తున్న అత్యాశ
రామలింగస్వామి (ఫైల్‌)

ఆన్‌లైన్‌ కరెన్సీ వ్యాపారాల వలలో చిక్కుకుంటున్న యువత 

సూర్యాపేటలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఖమ్మం యువకుడు

ఖమ్మం (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/ ఖమ్మం క్రైం, నవంబరు 25 : అత్యాశ ఉసురు తీస్తోంది. తక్కువ పెట్టుబడి.. ఎలాంటి శ్రమ లేకుండా ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆలోచనలో యువత ఆన్‌లైన్‌ కరెన్సీ వ్యాపారాల వలలో చిక్కుకుంటోంది. ఆన్‌లైన్‌ కరెన్సీ యాప్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టి చివరకు మోసపోయి ఉసురుతీసుకునే పరిస్థితికి చేరుకుంటోంది. ఇటీవల ఉమ్మడి జిల్లాలోనూ ఈ తరహా ఆన్‌లైన్‌ కరెన్సీ వ్యాపారంలో దిగుతున్న యువత సంఖ్య పెరుగుతోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఖమ్మం నగరానికి చెందిన  గుండెమెడ రామలింగస్వామి(36) క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టి నష్టపోయి.. ఒత్తిళ్లు తట్టుకోలేక బుధవారం సూర్యాపేటలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర సంచలనం రేపింది. రామలింగస్వామి విషాదగాధ చూసిన వారందరికి షేర్‌మార్కెట్‌, ఆన్‌లైన్‌ వ్యాపారంలో పెట్టుబడులు ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం క్రిప్టోకరెన్సీపై నిషేధం విధించబోతున్నట్టు వచ్చిన వార్తలతో ఆ వ్యాపారం ఒక్కసారిగా పడిపోయింది. పెట్టుబడిదారుల ఆశలు ఆవిరికావడం, పెట్టిన సొమ్ములు తిరిగి వస్తాయోరావోనన్న బెంగతో చిక్కుల్లో చిక్కుకుంటున్నారు. తాము పెట్టుబడి పెట్టడమే కాకుండా పరిచయం ఉన్న వారితో కూడా పెట్టుబడులు పెట్టించడంతో వారి నుంచి వచ్చే వత్తిళ్లు, బెదిరింపులు తమ ప్రాణాలమీదకే వచ్చిందన్న ఆవేదనలో ఉన్నారని తెలుస్తోంది. 

రామలింగస్వామి విషాదాంతమిదీ.. 

నగరానికి చెందిన రామలింగస్వామి క్రిప్టోకరెన్సీ పేరుతో జరుగుతున్న ఆన్‌లైన్‌ వ్యాపారంలో తాను పెట్టుబడి పెట్టడంతో పాటు తనకు పరిచయం ఉన్నవారితో కూడా సుమారు రూ.70లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టించాడు. ఈ క్రమంలోనే సదరు ఆన్‌లైన్‌ వ్యాపారం కుదేలవడంతో అసలుకే మోసం వచ్చింది. దీంతో తనను నమ్మి పెట్టుబడులు పెట్టినవారి ఒత్తిళ్లు, వారికి తన వద్ద ఉన్న డబ్బులు చెల్లించి చివరకు ఇంకా బకాయి ఉందని బెదిరించడంతో మానసిక ఒత్తిడికి గురై సూర్యాపేటలోని ఓ లాడ్జిలో బుధవారం ఆత్మహత్యచేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం క్రిప్టోకరెన్సీపై నిషేధ చట్టం తేబోతున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ కరెన్సీ వ్యాపారం ఒక్కసారిగా పడిపోయింది. ఖమ్మానికి చెందిన రామలింగస్వామి తాను పెట్టుబడిపెట్టడమే కాకుండా కృష్ణా జిల్లాలోని ఇద్దరు వ్యక్తుల చేతకూడా పెట్టుబడులు పెట్టంచగా ఆన్‌లైన్‌ కరెన్సీ వ్యాపారం పడిపోవడంతో రామలింగస్వామి నష్టపోయాడు. తనద్వారా చెల్లించిన కృష్ణాజిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు తాము చెల్లించిన సొమ్ములు ఇవ్వాలని వత్తిళ్లకు గురిచేయడంతో పాటు రామలింగస్వామిని కృష్ణాజిల్లాకు తీసుకెళ్లి అతనిపై బెదిరింపులకు పాల్పడ్డారని, చెక్కులు తీసుకోవడంతోపాటు కార్లు ఇతర ఆస్తులు స్వాధీనం చేసుకున్నారని రామలింగస్వామి బంధువులు పేర్కొన్నారు. కాగా ఇంకా రూ.10లక్షలు ఇవ్వాలని కృష్ణాజిల్లా పోలీసులతో బెదిరించారని, దీంతో మనస్తాపం చెందిన రామలింగస్వామి సోమవారం హైదరాబాదు వెళుతున్నానని, ఖమ్మంనుంచి ద్విచక్రవాహనంపై వెళ్లాడని అతడి భార్య స్వాతి, బావమరిది నర్సింహారావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కాగా హైదరాబాదు వెళతానన్నా రామలింగస్వామి సూర్యాపేటలోని ఒక లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకు గల కారణల గురించి వివరిస్తూ లేఖ రాశాడు. లాడ్జి గదిలోనుంచి దుర్వాసన రావడంతో  అనుమానం వచ్చి సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తలుపులు తెరవగా పురుగుమందుతోపాటు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. అయితే సోమవారం ఇంటి నుంచి వెళ్లిన రామలింగస్వామి ఫోన్‌ ఆ రోజు రాత్రి నుంచి స్విచ్చాఫ్‌ రావడంతో మంగళవారం ఉదయం అతడి కుటుంబసభ్యులు ఖమ్మం అర్బన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం సూర్యాపేటలో అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందింది. దీంతో అతడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రామలింగస్వామికి ఇద్దరు పిల్లలు ఉండగా బుధవారం రాత్రి ఖమ్మంలో అతడి అంత్యక్రియలను నిర్వహించారు. 

సూసైడ్‌ నోట్‌ సారాంశం 

‘నేను ఆన్‌లైన్‌లో కరెన్సీ వ్యాపారంతోపాటు, ఖమ్మంలో పెట్టిన స్కూల్‌ కారణంగా నష్టపోయాను. నాతోపాటు మరికొందరు కూడా నష్టపోయారు. నేను ఎవరికి డబ్బులు చెల్లించేదిలేదు. శివాపురం సర్పంచ్‌ బలవంతంగా నాతో సంతకాలు పెట్టించుకుని కారుకూడా లాక్కున్నాడు. ఈవిషయాలన్ని బాబి, ఆనంద్‌కిషోర్‌, నరేష్‌లకు తెలుసు. నేను ఎవరికివ్వాల్సిన డబ్బును వారికి చెల్లించాను. స్వాతి.. పిల్లలు జాగ్రత్త. నాన్న నాగు, బామ్మర్ది నీకు సపోర్టుగా ఉంటారు. వత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా. దయచేసి అర్థం చేసుకో’ అంటూ రామలింగస్వామి తన భార్య స్వాతికి రాసిన లేఖ పోలీసులకు లభించింది. 

Updated Date - 2021-11-26T06:13:10+05:30 IST