నూరుశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-10-21T05:00:19+05:30 IST

జిల్లాలో నూరుశాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలని, ప్రత్యేక కార్యక్రమం ద్వారా మరింత ముమ్మరం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అదనపు సంచాలకుడు డాక్టర్‌ మోజీ రామ్‌ రాథోడ్‌ ఆదేశించారు.

నూరుశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి
మాట్లాడుతున్న డాక్టర్‌ మెజీరామ్‌ రాథోడ్‌

 వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ముమ్మరం చేయాలి

  రాష్ట్ర వైద్య అదనపు సంచాలకుడు 

డాక్టర్‌ మోజీ రామ్‌ రాథోడ్‌

ఖమ్మం కలెక్టరేట్‌, అక్టోబరు 20: జిల్లాలో నూరుశాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలని, ప్రత్యేక కార్యక్రమం ద్వారా మరింత ముమ్మరం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అదనపు సంచాలకుడు డాక్టర్‌ మోజీ రామ్‌ రాథోడ్‌ ఆదేశించారు. బుధవారం ఆయన ఖమ్మానికి వచ్చిన సందర్భంగా నగరంలోని వెంకటేశ్వరనగర్‌, ముస్తాఫానగర్‌, అర్భన్‌ ఆరోగ్య కేంద్రాలను శాంతినగర్‌ అంగన్వాడీ కేంద్రంలో జరగుతున్న కొవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలు విధిగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ను వేయించుకోవాలన్నారు. జిల్లాలో నూరుశాతం వ్యాక్సినేషన్‌కు ప్రణాళికాయుతంగా నిర్వహించాలన్నారు. ఇంటింటి సర్వే నిర్వహించి ప్రతి వ్యక్తికీ వ్యాక్సిన్‌ను వేయాలన్నారు. ఒక్కో పీహెచ్‌సీలో వ్యాక్సిన్‌ తీసుకోని వారిని గుర్తించి వారికి వ్యాక్సిన్‌ వేసేందుకు అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలన్నారు. రెవెన్యూ పోలీస్‌, పంచాయతీరాజ్‌, ఐడీసీఎస్‌, మునిసిపల్‌ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు రాజకీయ నాయకుల సహకారంతో టీకాలు వేయాలని ఆదేశించారు. ప్రోగ్రాం అధికారులు తమకు కేటాయించిన పీహెచ్‌సీలను ప్రతిరోజు సందర్శించి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌కు సమాచారాన్ని తీసుకుని అవగాహన కోసం నివేదికలను పంపించాలని ఆయన సూచించారు. పీహెచ్‌సీల పరిధిలో నూటికి నూరుశాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేసేందుకు సిబ్బంది కృషిచేయాలన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి. మాలతి మాట్లాడుతూ ఖమ్మం నగరంలో 30 కేంద్రాలను, పీహెచ్‌సీల పరిధిలోని గ్రామాల్లో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటి సర్వేనిర్వహిస్తూ వ్యాక్సిన్‌ తీసుకోని వారిని గుర్తించి టీకాలు వేస్తున్నామన్నారు. వైద్య ఆరోగ్య కార్యక్రమాలను కూడా యథావిధిగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ సీతారాం, డాక్టర్‌ అలివేలు, డాక్టర్‌ ప్రవీణ, డాక్టర్‌ సుబ్బారావు, డాక్టర్‌ లక్ష్మీనారాయణ, భాస్కర్‌నాయక్‌, డాక్టర్‌ సైదులు, డాక్టర్‌ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T05:00:19+05:30 IST