హైదరాబాద్‌కు ఒమైక్రాన్‌ బాధితురాలు

ABN , First Publish Date - 2021-12-28T06:45:34+05:30 IST

హైదరాబాద్‌కు ఒమైక్రాన్‌ బాధితురాలు

హైదరాబాద్‌కు ఒమైక్రాన్‌ బాధితురాలు

తల్లి శాంపిళ్ల సేకరణ, నివాస ప్రాంతంలోని వారికీ పరీక్షలు 

ఖమ్మం కలెక్టరేట్‌, డిసెంబరు 27: హైదరాబాద్‌లో ఉంటూ ఒమైక్రాన్‌ బారిన పడిన ఖమ్మానికి చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థినిని సోమవారం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. ఆమెకు ఈనెల 20న నిర్వహించిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలడంతో ఇంట్లో హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతోంది. ఈ క్రమంలోనే గాంధీ ఆసుపత్రిలో నిర్వహించిన జీనోమ్‌ సీక్వెన్సీ టెస్టులో ఒమైక్రాన్‌ అని తేలడంతో సమాచారాన్ని గోప్యంగా జిల్లా అధికారులకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదివారం రాత్రి అందించారు. దీంతో ఆదివారం రాత్రే డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.మాలతి, డీఎస్వో రాజేష్‌, ఇతర వైద్యసిబ్బంది వైరా రోడ్డులోని కోర్టు సమీపంలోని సదరు విద్యార్థిని ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమెతో మాట్లాడి, ఆమె కాంటాక్ట్స్‌ ఇతర సమాచారాన్ని సేకరించారు. ఆమె తల్లికి కూడా పాజిటివ్‌ రావడంతో వారిద్దరినీ సోమ వారం ఉదయం హైదరాబాద్‌కు తరలించారు. అయితే వైరారోడ్డులోని కోర్టు సమీపంలోని సదరు ఇంజనీరింగ్‌ విద్యార్థి ఉంటున్న నివాస ప్రాంతానికి సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యసిబ్బంది వెళ్లి పరిసరాల్లోని వారికి కూడా కొవిడ్‌ పరీక్షలను నిర్వహించారు. మొత్తం 19మందికి పరీక్షలను నిర్వహించగా.. అందరికీ నెగెటివ్‌ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ విద్యార్థిని తల్లి శాంపిళ్లను మాత్రం జీనోమ్‌ సీక్వెన్సీ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఖమ్మంలోనూ ఒమైక్రాన్‌ కేసు నమోదవడంతో జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు.

ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: డీఎంహెచ్‌వో మాలతి

ఒమైక్రాన్‌ పాజిటివ్‌ వచ్చిన విద్యార్థినిని హైదరాబాద్‌కు తరలించాం. ఆమె నివాసం ఉండే ప్రాంతంలో ఎవరికీ పాజిటివ్‌ రాలేదు. ఆందోళన అవసరం లేదు. అయినా అప్రమత్తంగా ఉంటూ, నిబంధనలు తప్పనిసరి గా పాటించాలి. ఒమైక్రాన్‌ సోకిన విద్యార్థిని రెండు డోసుల వాక్సిన్‌ వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. 

Updated Date - 2021-12-28T06:45:34+05:30 IST