ఆయిల్‌పామ్‌ రైతుల సంక్షేమానికే ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-08-21T05:13:01+05:30 IST

ఆయిల్‌పామ్‌ రైతుల సంక్షేమానికే ప్రాధాన్యం

ఆయిల్‌పామ్‌ రైతుల సంక్షేమానికే ప్రాధాన్యం
రైతులనుద్దేశించి మాట్లాడుతున్న ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి

వ్యాపార విస్తరణతో ఆదాయం మరింతపెంపు: ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ 

మొక్కల కొరతపై అన్నదాతల ఆందోళన 

ఎమ్మెల్యే మెచ్చాతో కలిసి మొక్కల పంపిణీని ప్రారంభించిన చైర్మన్‌

అశ్వారావుపేట, ఆగస్టు 20: రైతుల సంక్షేమానికే అధిక ప్రాధాన్యత ఇస్తుందని, రైతులు ఆందోళన చెందనవసరం లేదని ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నారంవారిగూడెం ఆయిల్‌పామ్‌ డివిజన్‌ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుతో కలిసి పామాయిల్‌ మొక్కల పంపిణీని చైర్మన్‌ ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు రైతులు మాట్లాడుతూ ఆయిల్‌ఫెడ్‌ మార్కెటింగ్‌, ఔట్‌లెట్స్‌, ఇతర రకాలైన వ్యాపారాల విస్తరణ సమయంలో నష్టాలు వస్తే దాని ప్రభావం రైతులపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలోని రైతుల అవసరాలు తీరాకే ఇతర ప్రాంతాలకు మొక్కలను సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. డీజిల్‌ ధరలు పెరిగినందు వల్ల రవాణా చార్జీలు పెంచాలని, ఎరువుల ధరలను సమీక్షించాలని కోరారు. అనంతరం చైర్మన్‌ మాట్లాడుతూ  రైతులు ఆందోళన చెందవద్దని భవిష్యత్‌లో ఆయిల్‌పామ్‌ గెలల ధర టన్ను రూ.20వేలు దాటవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా మార్కెట్‌లో వంట నూనెకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా తెలంగాణలో 20లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణకు సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్నారన్నారు. పామాయిల్‌ తోటల విస్తరణకు ఆయిల్‌ఫెడ్‌తో పాటు మరికొన్ని ప్రైవేటు కంపెనీలకు భాగస్వామ్యం కల్పించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆయిల్‌పామ్‌ సాగు ప్రోత్సాహానికి రూ.11,040 కోట్లు నిధులను కేటాయించిందన్నారు. ఏపీలో ప్రైవేటు కంపెనీలు ఆయిల్‌ఫెడ్‌ను తొక్కేశాయని, ఆ పరిస్థితి ఇక్కడ రాకూడదనే ఉద్దేశ్యంతో ప్రైవేటు కంపెనీల పెత్తనం పెరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఎరువులు, రాయితీలు, మొక్కల కేటాయింపుల సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని, విస్తరణ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని, అయినా ఏడాది చివరినాటికి ప్రతీ ఒక్కరికి మొక్కలను అందేలా ఆయిల్‌ఫెడ్‌ కృషి చేస్తుందని, రైతులు సంయమనంతో సహకరిస్తే అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయన్నారు. ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణకు సీఎం కేసీఆర్‌ ప్రోత్సహిస్తున్నారన్నారు. భవిష్యత్‌లో రాష్ట్రం ఆయిల్‌పామ్‌ హబ్‌గా మారనుందన్నారు. ప్రభుత్వం ఆయిల్‌పామ్‌కు పలు ప్రోత్సాహకాలు అందజేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఆయిల్‌పామ్‌ రైతు సంఘ నాయకులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్‌, శీమకుర్తి వెంకటేశ్వరరావు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జూపల్లి రమేష్‌, దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, రైతులు నండ్రు రమేష్‌, ఆలపాటి రామమోహనరావు, కె.పుల్లయ్య, నార్లపాటి రాములు తదితరులు పాల్లొన్నారు.Updated Date - 2021-08-21T05:13:01+05:30 IST