ఆయిల్‌ పామ్‌లో అంతర పంటలపై అధ్యయనం చేయాలి : మాజీమంత్రి తుమ్మల

ABN , First Publish Date - 2021-07-09T03:53:21+05:30 IST

ఆయిల్‌ పామ్‌లో అంతర పంటలపై అధ్యయనం చేయాలి : మాజీమంత్రి తుమ్మల

ఆయిల్‌ పామ్‌లో అంతర పంటలపై అధ్యయనం చేయాలి : మాజీమంత్రి తుమ్మల
మాట్లాడుతున్న తుమ్మల నాగేశ్వరరావు

దీర్ఘకాలిక ఫలాన్నిచ్చే పంటలపై దృష్టిసారించాలి

వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యదర్శికి మాజీమంత్రి తుమ్మల సూచన

అల్లిపల్లిలో ఆయిల్‌పాం రైతులతో సమావేశం

దమ్మపేట, జూలై 8: పామాయిల్‌ సాగులో రైతుకు మరింత ఆర్థిక బరోసా కల్పించే విధంగా పామాయిల్‌ తోటల్లో అంతర పంటలుగా దీర్ఘకాలం ఫలాన్నిచ్చే పంటలపై అధ్యయ్యనం చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యదర్శి రఘునందనరావుకు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. దమ్మపేట మండలం అల్లిపల్లిలోని ఆలపాటి రామచంద్రప్రసాద్‌ ఆయిల్‌ఫాం క్షేత్రంలో గురువారం ఆయిల్‌పాం రైతులతో రఘునందనరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం పామాయిల్‌ తోటల్లో అంతరపంటగా కోకో వేస్తున్నప్పటికీ కోతుల బెడదతో పాటు అనేక సమస్యలతో  రైతులకు ఉపయోగకరంగా ఉండడం లేదన్నారు. దాని స్థానంలో జాజి, వక్క, మిరియం తదితర పంటల సాగుపై అధ్యయనం చేయాలని కోరారు. ఇప్పటికే కొందరు రైతులు పామాయల్‌ సాగులో అంతర పంటగా వేసేందుకు రైతు ఆలపాటి రాంచంద్రప్రసాద్‌ చర్యలు చేపట్టారని తెలిపారు. అవసరమైతే వీటిని సాగు చేస్తున్న రాష్ట్రాలలో ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో రైతులు, అధికారులు వెళ్లి అధ్యయనం చేయాలన్నారు. ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో మొక్కలు పెంచి రైతులకు అందించాలని కోరారు. రైతులకు పండించే పామాయిల్‌ గెలలకు ఫిక్స్‌డ్‌ రేటు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆలపాటి రామచంద్రప్రసాద్‌ వినితిప్రతం అందజేశారు. అనంతరం వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేక కారదర్శి రఘుందనరావు జాజి మొక్కను నాటారు. అల్లిపల్లి ప్రకృతివనంలో కలెక్టర్‌, ఎమ్మెల్యేతో కలిసి మొక్కలు నాటారు. 

పామాయిల్‌ సాగుపై క్షేత్రపరిశీలన

దమ్మపేట మండలం మందలపల్లిగ్రామంలో కనపర్తి ధర్మారావుకు చెందిన పామాయిల్‌ తోటను వ్యవసాయశాఖ కార్యదర్శి పరిశీలించారు. పామాయిల్‌ సాగుపై రైతు ధర్మారావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం అప్పారావుపేటలో పామాయిల్‌ ప్యాక్టరిని రఘునందనరావు సందర్శించారు. పామాయిల్‌ క్రషింగ్‌ విధానాన్ని మేనేజర్‌ శ్రీకాంతరెడ్డి వివరించారు. కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, కలెక్టర్‌ అనుదీప్‌ ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి, ఎండీ సరేందర్‌, జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్‌, జిల్లా ఉద్యానశాఖాధికారి మరియన్న, ఏడీఏ అప్జల్‌బేగం వ్యవసాయాధికారులు, పామాయిల్‌సంఘం నాయకులు సీమకుర్తి వెంకటేశ్వరరావు, అంకత మహేశ్వరరావు, కందిమళ్ల కృష్ణారావు, కాసాని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-09T03:53:21+05:30 IST