కార్పొరేషన్ ఎన్నికల విధులకు గైర్హాజరైన 443మందికి షోకాజ్ నోటీసులు
ABN , First Publish Date - 2021-05-20T06:19:15+05:30 IST
కార్పొరేషన్ ఎన్నికల విధులకు గైర్హాజరైన 443మందికి షోకాజ్ నోటీసులు

వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచన
చనిపోయిన వారికి, రిటైరైన ఉపాధ్యాయులకూ జారీ
ఖమ్మం, మే 19 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): గత నెల 29, 30తేదీల్లో జరిగిన కార్పొరేషన్ ఎన్ని కల విధులకు గైర్హాజరైన 443మంది ఉపాధ్యాయులకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ షోకాజ్ నోటీసులు జారీచేశారు. విధులకు హాజరు కాకపోవడంపై ఏడురోజుల్లోగా వివరణ ఇవ్వాలని గడువు విధించారు. కొందరు తమకు పాజిటివ్ వచ్చి, కొందరు తమ కుటుంబసభ్యులు, బంధువులకు కొవిడ్ సోకి.. ఎన్నికల విధులకు హాజరుకాలేదు. అయితే కరోనాతో బాధపడుతున్న ఉపాధ్యాయులు ఎన్నికల సమయంలోనే జిల్లా విద్యాశాఖ అధి కారికి సమాచారం అందించారు. కార్పొరేషన్ ఎన్నికల తర్వాత ఐదుగురు ఉపాధ్యాయులు కరోనాతో మృతిచెందారు. అందులో ఎర్రుపాలెం మండలానికి చెందిన శ్రీలక్ష్మి, వేంసూరు మండలానికి చెందిన నిర్మల, తిరుమలాయపాలెం మండలానికి చెందిన బాస్కరరావు తదితరులున్నారు. కొందరు ఉపాధ్యాయులు గత నెలాఖరులో పదవీ విరమణ చేశారు. వీరికి కూడా షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వారంరోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరడంతో.. తాము ఎలా వివరణ ఇవ్వాలో అర్థకం కావడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మానవతా దృక్ఫథంతో నోటీసులు ఉపసంహరించుకోవాలి :పీఆర్టీయూ
కరోనా కారణంగా కార్పొరేషన్ ఎన్నికల విధులకు హాజరుకాని ఉపాధ్యాయులకు ఇచ్చిన షోకాజ్‌నోటీసులను మానవతాదృక్పథంతో ఉపసహరించుకోవాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మోతుకూరి మధు, రంగారావు ఓ ప్రకటనలో కలెక్టర్‌ను కోరారు. షోకాజ్ నోటీ సులు జారీ అయిన వారిలో కొందరు కరోనా బారినపడ్డారని, కొందరు వారిదగ్గర బంధు వులకు కరోనా సోకడం వల్ల విధలకు హాజరుకాలేదని, అందుకు ప్రత్యామ్నాయంగా వేరే వారినిఎన్నికల విధుల్లో నియమించడం జరిగిందని, కిందిస్థాయిలో అధికారుల అనుమతి తీసుకున్నారని కలెక్టర్‌కు విరవించారు. అధికారులకు ముందే సమాచారం తెలి యచేసినా ఎన్నికల షోకాజ్ నోటీసులు ఇవ్వడం బాధాకరమని, ఇప్పటికే కొందరు ఉపాధ్యాయులు కరోనాతో మృతిచెందారని, ఉద్దేశపూర్వకంగా ఎవరూ గైర్హాజరుకాలేదని విన్నవించారు.