ఉరకలెత్తే ఉత్సాహంతో..
ABN , First Publish Date - 2021-12-31T05:49:34+05:30 IST
ఉరకలెత్తే ఉత్సాహంతో..

నూతన సంవత్సర వేడుకలకు ఏర్పాట్లు
ఖమ్మం ఖానాపురంహవేలీ, డిసెంబరు 30: విజయాలు, ఆనందాలు, అంతులేని విషాదాల మధ్య మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోతోంది. తీపి చేదు కలయికలా సాగిన ఈ ఏడాది శుక్రవారం ముగియనుండగా.. కోటి ఆశలు.. ఉరకలేసే ఉత్సాహంతో కొత్త ఏడాదికి ఆహ్వానం పలికేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా యువత అంబరాన్నంటేలా సంబరాలను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. తమ ఆత్మీయులతో వేడుకలను జరిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేకులు, బొకేలు, గిఫ్టులను కొనేందుకు షాపుల వద్ద క్యూ కడుతున్నారు. ఎంత ఖర్చయినా సరే కొత్త ఏడాదిలోకి కొంగొత్తగా అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇక గడిచిన ఏడాది కొందరి జీవితాల్లో ఆనందానికి చోటిస్తే.. మరికొందరిలో అంతులేని వేదనని, విషాదాన్ని మిగిల్చిఉంటుంది. కనీసం వచ్చే సంవత్సరం అయినా ఆ వేదనలు తొలగిపోయి.. తమకు ఆనందం పంచాలని 2021కి ప్రేమగా వీడ్కోలుపలికి.. 2022కి ఆనందం ఆహ్వానం పలకనున్నారు. గుంపు లుగా కాకుండా భౌతికదూరం పాటిస్తూ నూతన వేడుకలను జరుపుకోవా ల్సిన ఆవశ్యకత ఉంది. వీలైనంతవరకు కుటుంబ సభ్యుల మధ్యే వేడుకలు జరుపుకోవడం ఉత్తమమని అధికారులు, వైద్యులు పేర్కొంటున్నారు.
న్యూఇయర్ వేడుకలకు పోలీసు ఆంక్షలు
నిబంధనలు మీరినా, మద్యం తాగి వాహనాలు నడిపినా కేసులు..
జిల్లా ప్రజలు, యంత్రాంగానికి సీపీ సూచనలు
ఖమ్మం క్రైం, డిసెంబరు 30 : నూతన సంవత్సర వేడుకల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఆంక్షలు విధిం చారు. ఈ మేరకు ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ జిల్లా ప్రజలు, పోలీసు అధికారులకు ఓ ప్రకటనలో సూచనలు చేశారు. ఇతరులకు ఇబ్బందులు కలగకుండా న్యూఇయర్ వేడుకలను నిర్వహించుకోవాలని, కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలన్నారు. మాస్కులు ధరించకపోతే రూ.1000 జరిమానా విధిస్తామన్నారు. ఎవరైనా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, మద్యం తాగి వాహనాలు నడిపినా కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశించామన్నారు. మొత్తం 1300మంది పోలీసులో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, 63చెక్‌పోస్టులు, 120పోలీస్ పికెట్లు, 200 పెట్రోలింగ్ పార్టీతో నిరంతరం నిఘా పెడుతున్నామన్నారు. 31వతేదీరాత్రి నిర్ణీత సమయంలోనే మద్యం దుకాణాలు, దాబాలు, బార్లు, రెస్టారెంట్ల, హోటళ్లు మూసివేయాలన్నారు. ర్యాలీలు, డీజేలు, బాణసంచా పేలుళ్లు నిషేధమని తెలిపారు. ప్రత్యేక ఈవెంట్ల నిర్వాహకులు ముందుగానే అనుమతులు తీసుకోవాలని, వేడుకల్లో అశ్లీల నృత్యాలు, మాదకద్రవ్యాల వినియోగం నిషేధమని వెల్లడించారు. ఇక ఈవెంట్లకు వచ్చే వారిని పూర్తి స్థాయిలో థర్మామీటర్లు లేదంటే థర్మల్‌స్కానర్లతో పరీక్షించాకే అనుమతిం చాలని, లోపల కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనన్నారు.