ఐబీ కార్యాలయానికి మునిసిపల్‌ ముప్పు!

ABN , First Publish Date - 2021-11-22T05:23:29+05:30 IST

వైరా ప్రాంత రైతుల ప్రయోజనాలు, మనోభావాలను దెబ్బతీసే ప్రక్రియ లోపాయికారీగా జరుగుతుందనే విమర్శలు విన్పిస్తున్నాయి.

ఐబీ కార్యాలయానికి మునిసిపల్‌ ముప్పు!
వైరాలోని నీటిపారుదలశాఖ ఉపకార్యనిర్వాహక ఇంజనీర్‌ కార్యాలయం

 చేపల మార్కెట్‌కు ఇవ్వాలని  వైరా మునిసిపాలిటీ నిర్ణయం?

 కబ్జా కోరల్లో ఎన్నెస్పీ స్థలాలు?

 పట్టించుకోని అధికారులు

వైరా, నవంబరు 21: వైరా ప్రాంత రైతుల ప్రయోజనాలు, మనోభావాలను దెబ్బతీసే ప్రక్రియ లోపాయికారీగా జరుగుతుందనే విమర్శలు విన్పిస్తున్నాయి. దాదాపు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన నీటిపారుదలశాఖ ఉపకార్యనిర్వాహక ఇంజనీర్‌, సహాయక ఇంజనీర్‌, ప్రాజెక్టు కమిటీ పాలకవర్గం కార్యాలయాలకు మరో ప్రభుత్వ శాఖే ఎసరుపెట్టిందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్ల కిందట ఏర్పడిన వైరా మునిసిపాలిటీ వారు ఈ కార్యాలయాన్ని తొలగించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైరాకు తలమానికం మధ్యతరహాకు చెందిన రిజర్వాయర్‌. ఈ రిజర్వాయర్‌ పరిధిలో అధికారికంగా 17,300ఎకరాలు, అనధికారికంగా 25వేల ఎకరాల ఆయకట్టు ఉంది. గతంలో ఈ కార్యాలయం మీడియం ప్రాజెక్టుగా ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పుడు నీటిపారుదల వ్యవస్థను ప్రక్షాళన చేసి భారీ, మధ్య, చిన్నతరహా శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చింది. దాంతో ఇప్పటివరకు రిజర్వాయర్‌ ఆయకట్టు రైతులకు మాత్రమే ఉపయోగపడిన ఈ ఆఫీసు ఇప్పుడు ఎన్నెస్పీ, ఇతర అన్ని సాగునీటి వనరుల రైతులకు అందుబాటులోకి వచ్చింది. ఒక డీఈఈ, 3నుంచి 4గురు ఏఈఈలు ఇక్కడ పనిచేస్తున్నారు. అలాంటి ఈ కార్యాలయాన్ని తొలగించేందుకు మునిసిపల్‌శాఖ సిద్ధమవుతుందనే ప్రచారం జరుగుతుంది. 

కేవలం చేపల మార్కెట్‌ నిర్మాణం కోసం ఈ కార్యాలయంతోపాటు 1998లో పక్కనే నిర్మించిన ఆర్‌అండ్‌బీ డీఈ కార్యాలయాన్ని తొలగించాలని వైరా మునిసిపాలిటీ వారు సంబంధిత అధికారులకు ప్రతిపాదించినట్లు తెలిసింది. వాస్తవంగా వైరాలోని నీటిపారుదలశాఖకు చెందిన అనేక ఎకరాల్లోని స్థలాన్ని ఇప్పటికే మునిసిపల్‌ కార్యాలయం, హరితారెస్టారెంట్‌, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, రైతుల గోదాముకు ఉపయోగించారు. కొంత స్థలాన్ని కూరగాయల మార్కెట్‌కు, ఇండోర్‌ స్టేడియానికి వాడారు. అంతేకాకుండా ఈ శాఖ స్థలంలోనే మునిసిపాలిటీవారు వెజ్‌నాన్‌వెజ్‌ సమీకృత మార్కెట్‌ను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు చేపల మార్కెట్‌కు స్థలం లేదనే కారణంతో ఏకంగా నీటిపారుదలశాఖ, ఆర్‌అండ్‌బీ డీఈ కార్యాలయాలను తొలగించేందుకు మునిసిపాలిటీవారు ప్రతిపాదించి చర్యలు చేపట్టారనే ప్రచారం జోరుగా సాగుతుంది.


ఎన్నెస్పీ స్థలాలు అన్యక్రాంతం?


 కోట్లాదిరూపాయల విలువైన నీటిపారుదలశాఖ స్థలాన్ని ప్రైవేట్‌ వ్యక్తులు ఆక్రమించారు. అలాగే పాత తహసీల్దార్‌ కార్యాలయానికి చెందిన గోదాములను ఇతరులు తమ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. కనీసం ఈ స్థలాలను స్వాధీనం చేసుకొని వినియోగించుకోవాలనే విషయాన్ని విస్మరించిన మునిసిపాలిటీ వారు వంద సంవత్సరాలనాటి నీటిపారుదలశాఖ కార్యాలయాన్ని అలాగే ఆర్‌అండ్‌బీ డీఈ కార్యాలయాన్ని వేరేచోటకు తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను స్థానికులు నిరసిస్తున్నారు. ఈ కార్యాలయాల తరలింపు ద్వారా రైతుల మనోభావాలు దెబ్బతీసినట్లేననే విమర్శలు విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా మునిసిపాలిటీ వారు పునరాలోచన చేసి అనేకచోట్ల అన్యాక్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకొని వాటిలో చేపల మార్కెట్‌ను నిర్మించుకోవాలని లేకుంటే తాము ఉద్యమించాల్సి వస్తుందని పలువురు రైతులు స్పష్టం చేస్తున్నారు.


Updated Date - 2021-11-22T05:23:29+05:30 IST