ఓటెత్తారు.. ఇరుజిల్లాల్లో ప్రశాంతంగా ‘మండలి’ పోలింగ్‌

ABN , First Publish Date - 2021-03-15T05:23:26+05:30 IST

శాసనమండలి స్థానానికి ఆదివారం జరిగిన పోలింగ్‌కు ఇరుజిల్లాల్లో పట్టభద్రులు ఓటెత్తారు. ఊహించని విధంగా ఇరుజిల్లాల్లో పోలింగ్‌ శాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో 76శాతం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 73.37శాతం మంది ఓటేశారు. పలు చోట్ల పోలింగ్‌ సమయం ముగిసే వరకు ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరడంతో.. గేట్లు మూసేసి రాత్రి వరకు పోలింగ్‌ నిర్వహించారు.

ఓటెత్తారు..  ఇరుజిల్లాల్లో ప్రశాంతంగా ‘మండలి’ పోలింగ్‌

కేంద్రాల వద్ద బారులు తీరిన పట్టభద్రులు

ఖమ్మం జిల్లాలో 76శాతం, భద్రాద్రిలో 73.37వాతం నమోదు 

నల్లగొండకు బాలెట్‌బాక్సుల తరలింపు

ఫలితాలపై అన్ని పార్టీల్లో ఉత్కంఠ

ఖమ్మం/కొత్తగూడెం, మార్చి 14 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : శాసనమండలి స్థానానికి ఆదివారం జరిగిన పోలింగ్‌కు ఇరుజిల్లాల్లో పట్టభద్రులు ఓటెత్తారు. ఊహించని విధంగా ఇరుజిల్లాల్లో పోలింగ్‌ శాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో 76శాతం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 73.37శాతం మంది ఓటేశారు. పలు చోట్ల పోలింగ్‌ సమయం ముగిసే వరకు ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరడంతో.. గేట్లు మూసేసి రాత్రి వరకు పోలింగ్‌ నిర్వహించారు. అయితే ఈ సారి అన్ని రాజకీయ పార్టీలు, స్వతంత్రులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ఎమ్మెల్సీ ఎన్నికలపై చేసిన ప్రచారంతో పట్టభద్రులు ఈసారి పోలింగ్‌ కేంద్రాలకు భారీగానే తరలివచ్చారు. దీంతో అనుకున్న దానికంటే ఎక్కువ పోలింగ్‌శాతం నమోదైంది. కొత్తగా ఓటు హక్కు పొందిన యువత పోలింగ్‌లో ఉత్సాహంగా పాల్గొనగా.. చాలా కేంద్రాల్లో యువతీయువకులు బారులు తీరి కనపించారు. సాయంత్రం 4గంటల వరకు మాత్రమే సమయం ఉండగా.. అప్పటి వరకు కేంద్రాలకు వచ్చిన ఓటర్లను మాత్రమే అనుమతించి గేట్లు మూసేసి రాత్రయ్యేంత వరకు పోలింగ్‌ నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 87,172 ఓటర్లుకు గాను 127 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేయగా 66,251మంది, భద్రాద్రి జిల్లాలో 42,679మందికి గాను 62పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా 31,313 మంది ఓటేశారు. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మందకొడిగా సాగి.. ఆ తర్వాత ఊపందుకుంది. శాసనమండలి పోలింగ్‌కు అధికార యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. ఖమ్మం నగరంతో పాటు, వైరా, పాలేరు, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయగా.. కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి ఎన్‌. మధుసూదన్‌ పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. జిల్లాలో పోలింగ్‌ సరళిని వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షించారు. సీపీ తఫ్సీర్‌ఇక్బాల్‌ చింతకాని, కొణిజర్ల మండలాల్లో పోలింగ్‌ సరళిని పరిశీలించి పోలీస్‌ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.   

ఓటేసిన మంత్రి పువ్వాడ, భట్టి, తుమ్మల, తదితరులు 

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఖమ్మంలోని శీలం సిద్దారెడ్డి కళాశాలలోని పోలింగ్‌ కేంద్రానికి వచ్చి వరుసలో నిల్చుని తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధిరలో, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు వైరాలో, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి కూసుమంచిలో, ఖమ్మంలో మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్సీలు పువ్వాడ నాగేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు ఓటుహక్కు వినియోగించుకున్నారు. కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ దంపతులు ఖమ్మంలోని తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. టీఆర్‌ఎస్‌ లోక్‌ సభాపక్ష నేత ఖమ్మం ఎంపీ నామానాగేశ్వరరావు మధిర నియోజకవర్గంలో, సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్‌ పోలింగ్‌ సరళిని పరిశీలించారు. భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ.రెడ్డి దంపతులు చుంచుపల్లి మండల కేంద్రంలోని బాబుక్యాంపు జేబీఎస్‌ హైస్కూల్‌లో ఓటు వేశారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దమ్మపేట మండల కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియ, మణుగూరులో రేగా కాంతారావు ఓటేయగా.. కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అశ్వారావుపేటలో టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఓటింగ్‌ సరళిని పరిశీలించారు. అయితే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు  పలు పోలింగ్‌ బూత్‌ల వద్ద కొందరు నాయకులు బహిరంగంగానే డబ్బులు పంచారన్న ప్రచారం జరిగింది. సత్తుపల్లిలో ఓ వ్యక్తి దొంగ ఓటువేస్తున్నాడంటూ పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన ఒగ్గు జయభారతిరెడ్డి అనే వ్యక్తి జర్మనీలో ఉండగా అతడి పేరుపై గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఓటువేసి వెళ్లాడు దీంతో పోలింగ్‌ అధికారులకు బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇల్లెందులో శనిగరం రాధ అనే మహిళ ఓటును గుర్తుతెలియని వారు ఓటేయడంతో ఆమె అధికారులను నిలదీశారు. దీంతో ఆమెకు అధికారులకు టెండర్‌ ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వడంతో ఆతమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోలింగ్‌ కేంద్రం వద్ద భట్టి ఆందోళన

పోలింగ్‌ కేంద్రం వద్దకు కాంగ్రెస్‌ నాయకులను అనుమతించడం లేదని, అధికారపార్టీ నాయకులు కావాలనే ఇదంతా చేస్తున్నారని సీఎల్పీనేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మంలోని ఎస్సార్‌బీజీఎన్నార్‌ కళాశాలలోని పోలింగ్‌ కేంద్రం వద్ద కాంగ్రెస్‌ నగర నాయకుడు మిక్కిలినేని నరేంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు టుటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించగా.. విషయం తెలుసుకున్న భట్టి పోలీస్‌స్టేషన్‌వద్దకు చేరుకున్నారు. ఆందోళనకు దిగిన ఆయన పోలీసు వ్యవస్థ ప్రైవేటు సైన్యంలా పనిచేస్తోందని, ఓ పార్టీకి, మంత్రికి తొత్తులా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత పోలీసులు నరేంద్రను విడుదల చేశారు. 

అభ్యర్థుల జాతకాలు బాక్సులో భద్రం

పోలింగ్‌ పూర్తికావడంతో ఇరుజిల్లాల యంత్రాంగం బ్యాలెట్‌ బాక్సులను నల్లగొండకు తరలించింది. 17న నల్లగొండలో ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. షెడ్యూలు ప్రకటనకు ముందు నుంచే విస్తృతంగా ప్రచారం చేస్తున్నా.. పోలింగ్‌ అనంతరం ఓటరు నాడి అంతుబట్టకపోవడంతో అభ్యర్థులు, నేతలు, వారి అనుయాయులు తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. ఎవరికివారు గెలుపుధీమా వ్యక్తం చేస్తున్నా లోలోపల మాత్రం ఒకింత భయపడుతూనే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పోలింగ్‌శాతం పెరగడంతో.. ఫలితాలు ఎలా ఉంటాయోనన్న చర్చ జరుగుతోంది. పోటీలో 72మంది అభ్యర్థులు ఉండడం... కలిసొస్తుందని ప్రధానపార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీజేఎస్‌, ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన ఎన్టీ, టీడీపీ నాయకులు మెదటి లేదంటే రెండో ప్రాధాన్య ఓటుపై ఆశలు పెట్టుకున్నారు. ఇక టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, వామపక్షాల అభ్యర్థులు, స్వతంత్య్ర అభ్యర్థులూ పోలింగ్‌ తమకే అనుకూలంగా నడిచిందన్న ధీమాలో ఉన్నారు. 

Updated Date - 2021-03-15T05:23:26+05:30 IST