పెరుగుతున్న మిర్చి ధర

ABN , First Publish Date - 2021-03-06T05:15:37+05:30 IST

పెరుగుతున్న మిర్చి ధర

పెరుగుతున్న మిర్చి ధర
ఖమ్మం మార్కెట్‌కు శుక్రవారం అమ్మకానికి వచ్చిన మిర్చి

ఖమ్మం మార్కెట్‌లో క్వింటాలు రూ.15,000

ఖమ్మం మార్కెట్‌ , మార్చి 5: ఎర్ర బంగారానికి (తేజా రకం మిర్చి) ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతుండటంతో రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి. శుక్రవారం క్వింటాలు రూ.15,000గా జెండాపాట ధర నిర్ణయించగా వ్యాపారులు క్వింటాలు రూ.14,000 నుంచి రూ 15,000 వరకు కొనుగోలు చేశారు. ఐదు రోజుల క్రితం క్వింటాలు రూ. 14,000 నుంచి రూ. 14,350 వరకు పలికగా.. ఆ తరువాత రోజురోజుకూ ధర పెంచుతూ క్వింటాలుకు రూ.1,000 చొప్పున పెంచి వ్యాపారులు ఖరీదు చేస్తున్నారు. తేజారకం మిర్చికి దేశీయంగా, అంతర్జాతీయంగా చైనా, సిగపూర్‌, మలేషియా, బంగ్లాదేశ్‌, శ్రీలంక తదితర దేశాలలో డిమాండ్‌ పెరగడంతో ధరలు ఊపందుకున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. సీజన్‌ ప్రారంభం నుంచి మిర్చికి  లభిస్తున్న ధరలతో పోల్చుకుంటే ప్రస్తుతం దక్కుతున్న ధరలు కొంత ఆశాజనకంగానే ఉన్నాయని రైతులు చెబుతున్నారు. క్వింటాలుకు రూ.15వేలకు తగ్గకుండా కొనుగోలు చేస్తేనే అప్పుల ఊబి నుంచి గట్టెక్కుతామని మిర్చి రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా మార్కెట్‌కు బుధవారం 40వేలకు పైగా మిర్చి బస్తాలు అమ్మకానికి రాగా.. కొనుగోళ్లను మార్కెట్‌ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, వైస్‌ చైర్మన్‌ పిన్ని కోటేశ్వరరావు, సెక్రెటరీ రుద్రాక్షి మల్లేశం, గ్రేడ్‌టూ సెక్రెటరీ బజారు, అసిస్టెంట్‌ సెక్రెటరీ నిర్మల తదితరులు పర్యవేక్షించారు.

Updated Date - 2021-03-06T05:15:37+05:30 IST