అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయండి: మంత్రి పువ్వాడ
ABN , First Publish Date - 2021-05-20T06:15:30+05:30 IST
అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయండి: మంత్రి పువ్వాడ

అధికారులకు మంత్రి పువ్వాడ ఆదేశం
ఖమ్మం, రఘునాథపాలెం మండలంలో పర్యటన
మున్నేరుపై రూ.7కోట్లతో నిర్మిస్తున్న చెక్‌డ్యాం పనుల పరిశీలన
ఖమ్మం, మే 19 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఖమ్మం నగరంతోపాటు రఘునాఽథపాలెం మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలని సంబంధిత శాఖ అధికారులకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశాలిచ్చారు. కలెక్టర్ ఆర్వీకర్ణన్, నగర కార్పొరేషన్ కమిషనర్ అనురాగజయంతి, సుడాచైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, పలువురు అధికారులతో కలిసి ఆయన ఖమ్మం, రఘునాథపాలెం మండలంలో జరుగుతున్న పనులను బుధవారం పరిశీలించారు. రఘునాధపాలెం మండలం వీవీపాలెంలో రూ.2కోట్లతో, మంచుకొండలో రూ.2కోట్లతో నిర్మిస్తున్న సెంట్రల్ లైటింగ్ పనులను పరిశీలించి వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. ఆ తర్వాత కొవిడ్‌కారణంగా మృతిచెందిన వీవీపాలెం మాజీసర్పంచ్ ఎ.కోదండరామ్ నివాసానికి వెళ్లిన మంత్రి ఆయన కుటుంబాన్ని పరామర్శించి.. కోదండరామ్ మృతికి సంతాపం తెలిపారు. అనంతరం మంత్రి పువ్వాడ మంచుకొండ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసి.. అక్కడ పరీక్షలకు వస్తున్న వారి అవస్థలు చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పరీక్షల కోసం వచ్చిన వారిని ఎందుకు వేచిచూసేలా చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటవెంటనే పరీక్షలు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఖమ్మం నగరంలోనిగోళ్లపాడు చానల్ ఆధునికీకరణ పనులు, ప్రకాష్‌నగర్ వద్ద మున్నేరుపై రూ.7.45కోట్లతో నిర్మిస్తున్న చెక్‌డ్యాం పనులను పరిశీలించి పనులను నిర్ణీత గడువులోపు పూర్తిచేయాలని కోరారు. నాణ్యత విషయంలో రాజీవద్దని, చెక్‌డ్యాం అందరినీ ఆకర్షించేలా ఉండాలని, ఒక పిక్నిక్‌స్పాట్‌లా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.