వలసతోనే బతుకు!

ABN , First Publish Date - 2021-02-09T04:12:06+05:30 IST

వలసతోనే బతుకు!

వలసతోనే బతుకు!
వలస వస్తున్న ఆదివాసీలు, మిర్చి తోటల్లో పనులు

పొట్టకూటికోసం ఉపాధిబాట పట్టిన ఛత్తీస్‌గఢ్‌ ఆదివాసీలు

జిల్లాకు కొందరు.. ఇతర ప్రాంతాలకు మరికొందరు 

గోదావరి తీరమే వారికి ఆవాసం

చర్ల, ఫిబ్రవరి 8: ఛత్తీస్‌గఢ్‌లో నెలకొన్న దుర్భర పరిస్థితుల కారణంగా అక్కడి ఆదివాసీలకు పూటగడవటం కష్టంగా మారింది. దీంతో బతుకు దెరువు కోసం పట్టణాలకు పయనమవుతున్నారు. పిల్లా పాపలతో కలిసి పరుగులు పెడుతూ సరిహద్దులోని భద్రాద్రి జిల్లాలో మిర్చి తోటల్లో పనులు చేస్తున్నారు. భద్రాచలం, పినపాక, మణుగూరు, అశ్వారావుపేట, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో పపులు చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

అడవుల్లో ఆకలి కేకలు 

ఛత్తీస్‌గఢ్‌లో వర్షాలు ఆశించిన మేర కురిసినప్పటికీ పంటలు సరిగా పండలేదు. ఆదివాసీలు సాగుచేసిన పంటలు దిగుబడి రాలేదు. కాస్తోకూస్తో పండినా ఎండుతెగులు, దోమపోటు దాడి చేసింది. దీంతో ఎకరాకు 10 బస్తాల ధాన్యం కూడా చేతికి అందని పరిస్థితి ఏర్పడింది. జొన్న కుడా దిగుబడి రాలేదు. ఫలితంగా ప్రతీ ఇంట్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. రెండు పూటలా అన్నం లేక అనేక మంది అవస్థలు పడుతున్నారు. గత్యంతరం లేక పనుల కోసం పరుగులు పెడుతున్నారు.  


తెలంగాణపైనే ఆధారం 

ఛత్తీస్‌గఢ్‌ ఆదివాసీలు బతుకుదెరువుకోసం తెలంగాణపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా సరిహద్దున ఉన్న భద్రాద్రి జిల్లా వారికి ఉపాధి ప్రాంతంగా మారింది.  వలస బాట పట్టిన అనేక మంది ఆదివాసీలు జిల్లాలోని చర్ల మండలం చేరుకుంటున్నారు. అనంతరం మండలంలోని వీరాపురం, తేగడ, కొత్తపల్లి, జీపీపల్లి, గొంపల్లి, కొత్తూరు గ్రామాల్లోని  గోదావరి ఒడ్డును ఆవాసంగా చేసుకుంటున్నారు. అక్కడే వంటా వార్పు చేసుకుంటున్నారు. తెల్లవారు జామున పనుల్లోకి వెళ్లి, తరువాత గుడారాల్లోకి చేరుకుంటున్నారు. సాయ్రంతం వేలల్లో అక్కడే వంటావార్పు చేసుకుని, గోదావరి తిన్నెలపై పాటలు పాడుతూ కష్టాలను మర్చి పోతున్నారు. కాగా వీరితో చిన్నారులు ఉన్నారు. వారు తల్లి, దండ్రుల కష్టాల్లో పాలు పంచుకుంటున్నారు. అలాగే మరికొంత మంది పట్టణ ప్రాంతాలకు వెళ్లి అక్కడ జీవనం సాగిస్తున్నారు.

నాలుగు నెలల పాటు పనులు 

ఇలా ప్రతీ ఏడాది వలస వచ్చిన ఆదివాసీలు పిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే నెలల వరకు పనులు చేస్తున్నారు. నగదు సంపాధించుకుని తిరిగి సొంత ప్రాంతాలకు పయనమవుతారు. ఈ సమయంలో వారికి కావాల్సిన సామగ్రి, దుస్తులు కొనుగోలు చేసి వెళతారు. మే నెల వరకు పనులు చేసుకుని నగదు సంపాదించుకుంటారు. 

Updated Date - 2021-02-09T04:12:06+05:30 IST