భారీ విస్ఫోటం

ABN , First Publish Date - 2021-07-09T04:50:55+05:30 IST

ఓ గ్రామంలో నిల్వ ఉంచగా.. పోలీసులు స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే క్రమంలో భారీ విస్ఫోటం సంభవించింది.

భారీ విస్ఫోటం
పేలుడు ధాటికి ధ్వంసమైన ఎక్స్‌కవేటర్‌

పేలుడు పదార్థాలను ధ్వంసం చేస్తుండగా మంగళగూడెంలో ఘటన

తీవ్రతకు తెగిపడిన ఎక్స్‌కవేటర్‌ బొక్కెన భాగం

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

 రూరల్‌ మండలం మంగళగూడెంలో ఘటన

ఉలిక్కిపడ్డ సమీప గ్రామాలప్రజలు

12కిలోమీటర్ల మేర శబ్ధం, ప్రకంపనలు

మంగళగూడెంలో కాలిన గృహోపకరణలు, ఊడిన ఇళ్ల సీలింగ్‌లు..

ఖమ్మం రూరల్‌, జూలై 8 : ఓ గ్రామంలో నిల్వ ఉంచగా.. పోలీసులు స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే క్రమంలో భారీ విస్ఫోటం సంభవించింది. ఏకంగా ఎక్స్‌కవేటర్‌ బొక్కెన ఊడిపడిన ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సుమారు 12కిలోమీటర్ల మేర పేలుడు శబ్ధం వినపడగా.. సమీప గ్రామాల వారు ప్రకంపనలకు భయంతో వణికిపోయారు. ఈ ఘటన గురువారం సాయంత్రం ఖమ్మం జిల్లా ఖమ్మంరూరల్‌ మండలం మంగళగూడెంలో జరిగింది. ఖమ్మం రూరల్‌ మండలంలోని పిట్టలవారిగూడెం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 1600జిలిటెన్‌ స్టిక్స్‌, 36 బస్తాల్లోని సుమారు 900కిలోల గన్‌ఫౌడర్‌, తదితర మందుగుండు సామగ్రిని నెలరోజుల క్రితం ఖమ్మం రూరల్‌ పోలీసులు సీజ్‌ చేశారు. అయితే కోర్టు ఆదేశాల నేపథ్యంలో వాటిని నిర్వీర్యం చేయాలని నిర్ణయించిన సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఐ శంకర్‌రావు.. హైదరాబాద్‌ నుంచి వచ్చిన మందుగుండు సామగ్రిని నిర్వీర్యం చేసే బృందం సభ్యులు, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి గురువారం సాయంత్రం మంగళగూడెం గ్రామశివారు ప్రాంతంలో పాత గ్రానైట్‌క్వారీ వద్దకు తీసుకెళ్లారు. ఎక్స్‌కవేటర్‌ సాయంతో ఓ గుంత తీసి అందులో మందుగుండు సామగ్రిని వేసి పూడ్చుతుండగా.. ఎక్స్‌కవేటర్‌ దిగబడటం అదే సమయంలో ఎక్స్‌కవేటర్‌ బొక్కెన ఆ మందుగుండు సామగ్రి తగిలి రాపిడికి గురై మంటలు చెలరేగాయి. దాంతో వెంటనే ఎక్స్‌కవేటర్‌ ఆపరేటర్‌, అక్కడ ఉన్న పోలీసులు, నిర్వీర్యం చేసే బృందం దూరంగా పరిగెత్తారు. ఆ తర్వాత క్షణాల్లోనే భారీ పేలుడు సంభవించింది. ఈ ఈ క్రమంలో ఎక్స్‌కవేటర్‌ బొక్కెన భాగం మొత్తం ముక్కలై ఎగిరి 20అడుగుల దూరంలో పడింది. అయితే అప్పటి వరకు అక్కడే ఉన్న పోలీసులు, నిర్వీర్యం చేసే బృందం, ఎక్స్‌కవేటర్‌ ఆపరేటర్‌ అప్రమత్తమై పరిగెత్తడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అంతా ఊపరిపీల్చుకున్నారు. 

ఉలిక్కి పడిన గ్రామం..

పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేస్తుండగా జరిగిన విస్ఫోటం ధాటికి భారీ శబ్ధం రావడంతో మంగళగూడెంతో పాటు పక్కనున్న పలు గ్రామాల వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సుమారు 12కిలోమీటర్ల దూరం వరకు ఈ శబ్ధం వినిపించడం, ప్రకంపనలు రావడంతో జనం భయాందోళన చెందారు. ప్రకంపనలకు మంగళగూడెంలోని పలు ఇళ్లలో సామగ్రి కిందపడిపోయాయి. సీలింగ్‌లు పగిలిపోయాయి, ప్రిజ్‌లు, టీవీలు ఇతర గృహోపకరణలు కాలిపోయాయి. 

నిపుణుల సమక్షంలోనే నిర్వీర్యం చేశాం

సత్యనారాయణరెడ్డి, ఖమ్మం రూరల్‌ సీఐ 

కొద్ది రోజుల క్రితం ఓగ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన మందుగుండు సామగ్రిని సీజ్‌ చేశాం. కోర్టు ఆదేశాల మేరకు నిబంధనల ప్రకారమే హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా వచ్చిన మందు గుండు సామగ్రిని నిర్వీర్యం చేసే బృందం సమక్షంలో వాటిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించాం. అయితే అనుకోకుండా ఎక్స్‌కవేటర్‌ దిగబడటంతో దాని బొక్కెన గుంతలో ఉన్న మందుగుండు సామగ్రికి తగిలి రాపిడికి గురై ఈ ప్రమాదం జరిగింది. అంతా అప్రమత్తంగా ఉండటంతో ఎవరికీ ఎలాంటి  ప్రమాదం జరగలేదు.

అంతా షాక్‌కు గురయ్యాం..

యండపల్లి వరప్రసాద్‌, ఖమ్మం రూరల్‌ జడ్పీటీసీ

ఒక్కసారిగా భారీ శబ్ధం, ప్రకంపనలు రావడంతో షాక్‌కు గురయ్యాం. సుమారు రెండు గంటల వరకు మంగళగూడెంతో పాటు సమీప గ్రామాల వారు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందారు. అయితే గ్రామశివారులో పోలీసులు మందుగుండు సామగ్రిని ధ్వంసం చేసే క్రమంలో జరిగిందని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ గ్రామంలోని పలువురి ఇళ్ల సీలింగ్‌లు పగిలిపోగా, టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి. 


Updated Date - 2021-07-09T04:50:55+05:30 IST