విన్నవించాం.. కనికరించండి

ABN , First Publish Date - 2021-08-10T06:20:06+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణికి సోమవారం వినతులు వెల్లువగా వచ్చాయి.

విన్నవించాం.. కనికరించండి
ప్రజావాణి కార్యక్రమంలో ధరణి వెబ్‌సైట్‌లో భూ సమస్యలపై పరిశీలిస్తున్న అధికారులు

ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ

భూ సమస్యలపై ప్రత్యేక కౌంటర్‌ 

ఖమ్మం కలెక్టరేట్‌, ఆగస్టు 9: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణికి సోమవారం వినతులు వెల్లువగా వచ్చాయి. జిల్లా కలెక్టర్‌గా గౌతమ్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజావాణిపై ప్రత్యేక దృష్టిసారించడం, భూ మస్యలపై కలెక్టర్‌ ప్రత్యేక దృష్టిసారిస్తున్నారన్న విషయంపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోమవారం నాటి ప్రజావాణికి పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. 130 దరఖాస్తులు ఆనలైనలో నమోదవ్వగా మరో 100 దరఖాస్తులు వ్యక్తిగతంగా అందించారు. వీటిల్లో 95 దరఖాస్తులు భూ సమస్యలపైనే అధికారులకు అందాయి.  భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్‌ గౌతమ్‌ ప్రజావాణిలోనే ఎనఐసీ సిబ్బంది శ్రీనివాస్‌ అధికారులతో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడే ఫిర్యాదుదారులు ముందస్తుగా తమ భూ సమస్యను ధరణి సైట్‌లో ప్రాథమికంగా పరిశీలించిన తర్వాతే ఆ దరఖాస్తు పరిస్థితిని ఫిర్యాదుదారునికి చెబుతున్నారు. ఇలా భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో ఒక కదలిక వచ్చినట్లైంది. ఈ ప్రజావాణి కార్యక్రమంలో నిరుపేదలు, సామాన్యులు తమ సమస్యలపై ఏకరువుపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎన మధుసూదన, స్నేహలత మెగిలి, శిక్షణ కలెక్టర్‌ బి. రాహుల్‌, డీఆర్వో ఆర్‌ శిరీష, కలెక్టరేట్‌ ఏవో మదనగోపాల్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

డయాలసిస్‌ చేసి బతికించడయ్యా

అయిల వెంకటరత్నం, రఘునాధపాలెం

ఆరోగ్యశ్రీ ద్వారా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డయాలసిస్‌ చేస్తూ మధ్యలో ఆపేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో డబ్బులు ఇవ్వడంలేదని,  డబ్బులు ఇస్తేనే డయాలసిస్‌ చేస్తామంటూ పంపించారు. దిక్కులేక ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే.. అక్కడ సగం ఇక్కడ సగం చేయడం కుదరదని అంటున్నారు. నాకు డయాలసిస్‌ చేసి బతికించండి.

నిబంధనలకు విరుద్ధంగా సభ్యుల చేరిక

ఉప్పుగండ్ల వెంకటనారాయణ, ఆరెకోడు సర్పంచ

ఆరెకోడు గ్రామం రెవెన్యూ పరిధిలో ఉన్న ధంసలమ్మ చెరువుకి ఎస్సారెస్పీ కాలువ నీళ్లు వస్తున్నాయని మఽత్స్యశాఖ ఏడీ కొంతమందితో చేతులు కలిపి అక్రమంగా హరిజన మత్య్సశాఖ సహాకార సంఘంలో కొత్తగా సభ్యులను చేర్పిస్తున్నారు. ఈ చెరువుకు కేవలం వర్షాధారంగానే నీళ్లు వస్తున్నాయి. ఎలాంటి కాలువ నీళ్లు రావడం లేదని తప్పుడుగా లేఖలు అందించి కొత్త సభ్యులను అక్రమంగా చేర్చుకుంటున్నారు. దీనిపై విచారణ నిర్వహించి కొత్త సభ్యులను తొలగించాలి.

20 గుంటల భూమిని నమోదు చేయాలి

వాసిరెడ్డి హిమబిందు, వెంకటాపురం గ్రామం మధిర

మధిర మండలం కృష్ణాపురం గ్రామపంచాయతీ పరిధిలో మునగాల రెవెన్యూలో నాకు మొత్తం 2ఎకరాల 36 గుంటల భూమి ఉంది. పాస్‌ బుక్‌లో ఎకరం 35 గుంటల భూమి మాత్రమే నమోదైంది. ఆ తర్వాత సవరణలో కొంత భూమి న మోదైనా, ఇంకా 20 గుంటల భూమి నమోదు కావాల్సి ఉంది. విచారణ చేపట్టి మిగిలిన భూమిని నమోదు చేయాలి. 

Updated Date - 2021-08-10T06:20:06+05:30 IST