ఓటమి భయంతోనే నాపై దాడి.. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-03-15T05:29:21+05:30 IST

పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమని, ఆ ఓటమి భయంతోనే తనపై దాడిచేశారని బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు.

ఓటమి భయంతోనే నాపై దాడి.. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి
ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రేమేందర్‌రెడ్డి

 నిందితులను కఠినంగా శిక్షించాలి

 ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స 

ఖమ్మం, మార్చి 14 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమని, ఆ ఓటమి భయంతోనే తనపై దాడిచేశారని బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం పార్వతమ్మగూడెంలో దాడి జరిగిన అనంతరం ఆయన ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎన్నడూలేని విధంగా యువత, పట్టభద్రులు, ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, అన్ని వర్గాల పట్టభద్రులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే లక్ష్యంతో చైతన్యవంతులై పోలింగ్‌లో పాల్గొన్నారన్నారు. అధికశాతం పోలింగ్‌ కావడమే టీఆర్‌ఎస్‌ ఓటమికి చిహ్నమని, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పట్టభద్రులు ఓటురూపంలో చూపారన్నారు. ఓటమి ఖాయమన్న అక్కసుతోనే తనపై మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు వెనుకనుంచి దాడిచేసి గాయపరిచారని, ఇది సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ ప్రోత్సాహంతో జరిగిన దాడి అని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలను అణిచివేస్తామంటూ టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు చేసిన ప్రకటనలతోనే ఈ దాడి జరిగిందన్నారు. నెల్లికుదురు మండలం పార్వతమ్మగూడెం వద్ద ఓ ఫంక్షన్‌హాల్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు డబ్బులు పంచుతున్నారని ఓ కార్యకర్త ఫోన్‌చేశారని, వెంటనే పోలీసులకు ఈ సమాచారం అందించామని, పోలీసులు వారిని పట్టుకున్నారని, దాంతో వారిని తాము పోలీసులకు పట్టించామన్న ఆగ్రహంతో తనపైనా, బీజేపీ గిరిజనమోర్చా నాయకులపైనా దాడిచేశారని ఆరోపించారు. అయితే వెనుకనుంచి దాడిచేయడం వల్ల నొప్పి అధికంగా ఉందని, దాంతో ఖమ్మం ఆసుపత్రిలో చేరడం జరిగిందని వివరించారు. తనపై దాడిచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రేమేందర్‌రెడ్డిని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, తదితరులు పరామర్శించారు.. 

Updated Date - 2021-03-15T05:29:21+05:30 IST