చోరీలకు అడ్డుకట్ట వేసేందుకు

ABN , First Publish Date - 2021-11-10T04:46:44+05:30 IST

రక్షణ ముసుగులో పాల్వంచ కేటీపీఎస్‌లో కొందరు సాగిస్తున్న దందాకు అడ్డుకట్ట వేసేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది.

చోరీలకు అడ్డుకట్ట వేసేందుకు
పాల్వంచలోని కేటీపీఎస్‌ కర్మాగారం

పాల్వంచ కేటీపీఎస్‌ ఎస్‌పీఎఫ్‌లో భారీగా బదిలీలు 

ఆరోపణలు ఎదుర్కొంటున్న 85 మంది సిబ్బందికి స్థానచలనం

కొత్తవారిలోనూ కొందరిపై కళంకిత ముద్ర

పాల్వంచ, నవంబరు 9: రక్షణ ముసుగులో పాల్వంచ కేటీపీఎస్‌లో కొందరు సాగిస్తున్న దందాకు అడ్డుకట్ట వేసేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. చోరీ కేసుల్లో తమదైన శైలిలో అక్రమార్జనకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్న పలువురు ప్రత్యేక భద్రతా దళం(ఎస్‌పీఎఫ్‌) సిబ్బందిని రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు బదిలీ చేయటంతో కేటీపీఎస్‌లో చోరులకు అంటకాగేవారి బెడద తప్పుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పాల్వంచలోని కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం, 5, 6, 7 దశల్లోని వివిధ విభాగాల్లో సుమారు 350మంది కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లు పనిచేస్తుండగా వారిలో సుమారు 85మందిని ఎస్‌పీఎఫ్‌ కేంద్ర నాయకత్వం బదిలీలు చేసింది. అయితే కర్మాగారాల్లో గతంలో పలు చోరీకేసుల్లో నిందితులుగా ఉన్న పలువురిని హైదరాబాద్‌ హైకోర్టు, శ్రీశైలం డ్యాంసైట్‌, సీబీసీసీ వరంగల్‌, తెలంగాణ సెక్రెటేరియట్‌, యాదగిరిగుట్ట నరసింహాలయం, ఎస్‌పీఎఫ్‌ కేంద్ర కార్యాలయం, ఆర్‌బీఐ హైదరాబాద్‌, సెంట్రల్‌ యూనిట్‌, జీహెచ్‌ఎంసీ, వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి, మహబూబ్‌నగర్‌, ఆర్‌టీఎస్‌ రామగుండం, ట్రైనింగ్‌ అకాడమీ తదితర విభాగాలకు బదిలీ చేశారు. అయితే వీరిలో అధికంగా స్పెషల్‌ రిక్వెస్ట్‌ పేరిట తమకు ఇష్టమైన ప్రాంతాలకు వెళుతున్నట్టు సమాచారం. వీరు బదిలీ అయిన ప్రాంతాలకే చెందిన మరికొంత మంది నేరచరిత కలిగిన కానిస్టేబుళ్లు కేటీపీఎస్‌కు వస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరిలో అధికంగా బెట్టింగ్‌ అలవాట్లు, ఆన్‌లైన్‌ పేకాట, అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని మోసం చేసిన వారు ఈ జాబితాలో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 85మంది సిబ్బంది కేటీపీఎస్‌ నుంచి బదిలీ కావటం చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో కేటీపీఎస్‌లో విధులు నిర్వర్తించి ఇక్కడి వారితో పరిచయాలు ఉన్న కొందరు కానిస్టేబుళ్లు ఏరికోరి ప్రత్యేకంగా కేటీపీఎస్‌కు బదిలీపై రావటం గమనార్హం. గతంలో కేటీపీఎస్‌లో రూ.కోట్ల విలువచేసే సామగ్రి చోరీ ఘటనల్లో దొంగలకు సహకరించారనే కారణంతో నలుగురు కానిస్టేబుళ్లను గతంలోనే బదిలీ చేయగా వారి వాసనే కలిగిన కొందరు కానిస్టేబుళ్లు కేటీపీఎస్‌కు రావటం వెనుక మతలబు ఏంటనే  కోణంలో చర్చ సాగుతోంది. కేటీపీఎస్‌ పాతప్లాంటు మూసి వేసి రెండు సంవత్సరాలు పూర్తయింది. కర్మాగారంలోని పాతయూనిట్లను తొలగించే ప్రక్రియ త్వరలో మొదలు కాబోతుంది. ఈ నేపధ్యంలో తొలగించిన ఇనుమును మూడో కంటికి తెలియకుండా బయటకు తరలించే కుట్ర ఏమైనా సాగుతుందా? అనే కోణంలో యాజమాన్యం దృష్టి సారించాల్సి ఉంది. గతంలో కొందరు కానిస్టేబుళ్లు కేటీపీఎస్‌లో పోస్టింగ్‌కు రూ.3లక్షల వరకు ముట్టచెప్పి వచ్చినట్టు ప్రచారం జరిగింది. గతంలో కేటీపీఎస్‌లో పనిచేసిన కాలంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్న కానిస్టేబుళ్లు మరోసారి కేటీపీఎస్‌కు రావటం వెనుక మతలబును యాజమాన్యం పసిగట్టాల్సి ఉంది. కేటీపీఎస్‌ పాతప్లాంట్‌ తొలగిస్తే లక్షల టన్నుల ఇనుము బయటకు తరలించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జెన్‌కో యాజమాన్యం ఇప్పటి నుంచే ఇక్కడికి వచ్చిన సిబ్బందిపై దృష్టి సారించాల్సి ఉంది. ఇంకా కొంత మంది ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్లకు బదిలీ అయినా వారంతా అధికారుల కాళ్లావేళ్లా పడి తమ బదిలీని నిలుపుదల చేయించుకున్నట్టు తెలుస్తోంది.

ఎస్‌పీఎఫ్‌ ఏసీ బదిలీ

ఇదిలా ఉండగా కేటీపీఎస్‌ ఎస్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ పసుమర్తి కోటేశ్వరావు కూడా బదిలీ అయ్యారు. ఆయన హైదరాబాద్‌ హైకోర్టుకు బదిలీకాగా ఒకటి, రెండు రోజుల్లో విధుల్లో చేరే అవకాశముంది. అయితే తనకు స్పౌస్‌ కేసుకింద బదిలీ అయిందని కర్మాగారాల ఇంచార్జ్‌ ఏసీగా సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వరావు ఉండే అవకాశం ఉందని, తాను సోమవారం రిలీవ్‌ అయ్యే అవకాశం ఉందని ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

కేటీపీఎస్‌ నుంచి 30మంది రిలీవ్‌ 

బదిలీల నేపఽథ్యంలో కేటీపీఎస్‌ నుంచి 30మంది కానిస్టేబుళ్లను రిలీవ్‌ చేసినట్టు అసిస్టెంట్‌ కమాండెంట్‌ తెలిపారు. బదిలీ అయిన కానిస్టేబుళ్లను విడతలవారీగా రిలీవ్‌ చేస్తామని, వచ్చిన వారిని వెంటనే జాయిన్‌ చేసుకుంటామని పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-10T04:46:44+05:30 IST