కొవిడ్‌తో కీళ్లనొప్పులు

ABN , First Publish Date - 2021-08-21T05:06:30+05:30 IST

కొవిడ్‌తో కీళ్లనొప్పులు

కొవిడ్‌తో కీళ్లనొప్పులు

కరోనా అనంతరం కొత్త సమస్య

రోగులలో డ్రై అవుతున్న జాయింట్లు

సొంత వైద్యం, స్టెరాయిడ్స్‌ వాడకమే కారణం

పలువురిలో కీళ్ల మార్పిడికి దారితీసే అవకాశం

ఖమ్మం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): కరోనా.. కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. కరోనా సోకిన సమయంలోనే కాదు.. తగ్గిపోయిన తర్వాత కూడా బాధితులు పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరోనా బారిన పడి కోలుకున్న వారిలో చాలామందికి నిద్రపట్టకపోవడం, గ్రాస్ట్రైటిస్‌, మానసిక సమస్యలుండగా.. తాజాగా మరో కొత్త ఆరోగ్య సమస్య ఎదురవుతోంది. వైరస్‌ సోకి.. తగ్గిపోయి నెలలు గడుస్తున్న వారిలో చాలామంది ఎముకలు, కీళ్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలామందికి కాళ్లు, చేతుల, తొంటి నొప్పి లాంటి సమస్యలతో బాధపడుతూ వైద్యుల దగ్గరకు పరుగు పెడుతున్నారు. కొందరైతే కూర్చుంటే నిలుచులేని పరిస్థితిని కూడా ఎదుర్కొంటున్నారని వైద్యులు చెబుతున్నారు. అయితే ఆయా సమస్యలతో వచ్చే వారిలో 30ఏళ్ల యువతీ, యువకులు కూడా ఉంటుండటం గమనార్హం.

వేధిస్తున్న కీళ్ల సమస్య.. 

కరోనా వచ్చిపోయిన వారిని మిగతా సమస్యలకు భిన్నంగా కీళ్లనొప్పుల సమస్య మరింత వేధిస్తోంది. కొవిడ్‌ భాధితుల్లో వైరస్‌నుంచి బయటపడిన ఆరు నెలల తర్వా త ఇలాంటి సమస్యలు తలెత్తడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. శరీరం లోని జాయింట్లు డ్రై అవడం, ప్లూయిడ్స్‌ తగ్గిపోవడం లాంటి కారణాలతోపాటు కరోనా సమయంలో పౌష్టికా హారం అందక కండరాలు బలహీనంగా మారిపోతు న్నాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు కొవిడ్‌ సమయంలో నిత్యం ఇంట్లో ఒకేచోట కూర్చుని ఉండటం వల్ల పలువురిలో శరీర కదలికలు తగ్గి కండరాల కదలి కలు మందగిస్తున్నాయి. అంతేకాదు అదే సమయంలో విటమిన్‌ డి తగ్గి ఎముకలు బలహీన పడుతున్నాయి. ఫలితంగా మోకాళ్లు, ఒళ్లు నొప్పులు, తొంటి సమస్యలు నిత్యం వేధిస్తుండటంతో జనం వైద్యుల దగ్గరకు వెళుతు న్నారు. దీంతో ప్రస్తుతం ఆర్థోపెడిక్‌ ఆసుపత్రులు కిటకిట లాడుతున్నాయి. అయితే ఆయా నొప్పులకు ఇమ్యూనిటీ ఉన్న వారిలో కొన్ని రోజులకు వాటంతట అవే తగ్గిపోతుం డగా.. బీపీ, షుగర్‌ ఇతర వ్యాధులున్న వారికి అదో పెద్ద సమస్యగా మారుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారిలో సమస్యను త్వరగా గుర్తించి వైద్యుల దగ్గరకు వెళ్తే పోస్ట్‌ కోవిడ్‌ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు. లేకపోతే అది దీర్ఘకాలిక సమస్యగా మారే అవకాశం లేదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. 

మంచి ఆహారమే ముఖ్యం..

కరోనా వచ్చిన సమయంలో, తగ్గిన తర్వాత బాధితులు మంచి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కీళ్లు, కండరాలు, జాయింట్ల సమస్యల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. అత్యధికంగా కాల్షియం ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంది. పాలు, పెరుగు, అరటి, బచ్చటకూర, బీన్స్‌, యాపిల్స్‌, కొత్తిమీర, మెంతిఆకు, బెల్లం, నువ్వులు, పిస్తా, రాగులు, మినుములు, ఉలవలు, తోటకూర, క్యారెట్‌, కాలీఫ్లవర్‌, కరివేపాకు, పూదీనా, గుడ్లు, బాదం వంటి బలమైన ఆహారం తీసుకోవడం వల్ల అత్యధికశాతం ఆయా సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. దానితోపాటుగా ఇలాంటి సమస్యలను ఆరంభంలో గమనిస్తే, మందులు, వ్యాయామాలు, మంచి ఆహారంతో చెక్‌ పెటొచ్చని పలువురు డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. 

సొంత వైద్యం, స్టెరాయిడ్లతో సమస్యలు.. 

కరోనా లక్షణాలు ఉన్నవారు నిర్ధారణ పరీక్ష చేయించు కున్న అనంతరం మందుల కోసం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రా లకు వెళ్లడంలేదు. తమకు తెలిసిన వ్యక్తులు, కరోనా బారిన పడిన స్నేహితులు, బంధువులను సంప్రదించి ఆయా మందులను తెచ్చుకుని వాడుతున్నారు. అయి తే తమకు కరోనా పాజిటివ్‌వచ్చినా అది ఉన్న తీవ్రతను బట్టి మందులు వాడాల్సి ఉండగా.. సొంత నిర్ణయాలతో ఎవరికి వారు మెడికల్‌ షాపుల వద్దకు వెళ్లి మందులు తెచ్చుకుని వాడటం వల్లకూడా ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. ప్రస్తుతం ఉమ్మడిజిల్లాలో చాలామంది కరోనా రోగులు ప్రభుత్వం వారు ఇచ్చిన మందుల కిట్‌లను వాడుతూనే.. వాటికి అదనంగా మరికొన్ని మందులను జోడించుకుంటున్నారు. అది కూడా మెడికల్‌ దుకాణాల్లో సొంత నిర్ణయాలతో ఆయా మందులను వాడుతున్నారు. ఈ క్రమంలో అవ సరం లేని మందులు, యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా వాడుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆసుపత్రుల్లో చేరిన వారికి కూడా చాలామంది వైద్యులు ఎక్కువ మొత్తంలో స్టెరాయిడ్స్‌ని ఇవ్వడం కూడా ఎముకలపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఎముకల సమస్యలకు ఇదే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాంతో పాటు కరోనా వేళల్లో వర్క్‌ఫ్రం హోం చేస్తూ నీరసంతో గంటల తరబడి ఒకే చోట కూర్చున్న వారిలోనూ ఇలాంటి సమస్యలు ఎదురవడంతోపాటు.. ఆ సమయంలో బయటకు రాక ఎండ తగలకపోవడం వల్ల విటమిన్‌ డి తగ్గిపోవడం వల్ల కండరాలు, ఎముకలు బలహీనంగా మారుతున్నాయని వైద్యులు వివరిస్తున్నారు. 

మంచి ఆహారమే ముఖ్యం : డాక్టర్‌ డి.హనుమాన్‌, ఆర్థో సర్జన్‌, ఖమ్మం 

కరోనా అనే కాదు.. ఎలాంటి వైరస్‌ సోకినా ఆయా వ్యక్తుల్లో ఒళ్లు నొప్పులు వస్తుంటాయి. అవి కొవిడ్‌లో మరింతగా ఉండి కీళ్లు, ఎముకలు, కండరాల నొప్పులకు దారితీస్తున్నాయి. కరోనా సమయంలో అత్యధికంగా కాల్షియం ఉండే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అది ఇమ్యూనిటీ ఉన్న వారిలో త్వరగా కోలుకునే అవకాశం ఉండగా.. ఇతర వ్యాధులు ఉన్నవారికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కరోనా సమయంలో కూడా ఇతర మందులతోపాటు విటమిన్‌ డి-3కి సంబంధించిన మందులు కూడా అందించాలని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాలు జారీ చేసింది. 

Updated Date - 2021-08-21T05:06:30+05:30 IST