‘మిస్సింగ్‌’ మిస్టరీ.. ఖమ్మం జిల్లాలో ఏటికేడు పెరుగుతున్న అదృశ్యం కేసులు

ABN , First Publish Date - 2021-01-21T05:06:44+05:30 IST

‘బాలిక కిడ్నాప్‌.. యువతి అదృశ్యం.. మహిళ కనబడట్లేదు’ ఇలాంటి వార్తలు నిత్యం వినిపిస్తూ, కనిపిస్తూనే ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న క్రమంలోనూ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఆయా కేసుల్లో చాలావాటిని పోలీసులు చేధిస్తుండగా కొన్ని కేసులు మాత్రం మిస్టరీలుగానే మిగిలిపోతున్నాయి.

‘మిస్సింగ్‌’ మిస్టరీ.. ఖమ్మం జిల్లాలో ఏటికేడు పెరుగుతున్న అదృశ్యం కేసులు

కనిపించకుండాపోతున్న వారిలో అత్యధికులు మహిళలే

కేసుల చేదనకు ‘ఏహెచ్‌టీయూ’ స్థాపన అవసరమంటున్న ప్రజలు 

ఖమ్మం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ‘బాలిక కిడ్నాప్‌.. యువతి అదృశ్యం.. మహిళ కనబడట్లేదు’ ఇలాంటి వార్తలు నిత్యం వినిపిస్తూ, కనిపిస్తూనే ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న క్రమంలోనూ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఆయా కేసుల్లో చాలావాటిని పోలీసులు చేధిస్తుండగా కొన్ని కేసులు మాత్రం మిస్టరీలుగానే మిగిలిపోతున్నాయి. ఈ ఏడాది నమోదైన కేసుల్లో సగానికి పైగా కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్లు పోలీసుశాఖ వార్షిక నివేదిక చెబుతోంది. అయితే మిస్టరీలుగా మిగులుతున్న కేసుల పరిస్థితి ఏంటి..? ఆయా కేసులను పోలీసులు ఎందుకు చేధించలేకపోతున్నారు? తప్పిపోయినవారు ఎక్కడికి చేరుతున్నారు ? కొన్నేళ్ల తర్వాత వారు ఎక్కడ దొరుకుతున్నారు లాంటి అంశాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఏటికేడు పెరుగుతున్న మిస్సింగ్‌ కేసులు 

ఖమ్మం జిల్లాలో చోరీలు, హత్యలు, ప్రమాదాలు లాంటి కేసులు స్వల్పంగా తగ్గుతున్నా మిస్సింగ్‌ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఏటా 30 శాతానికి పైగా కేసులు పెరుగుతుండడం గమనార్హం. ఆయా అంశాలను పోలీసు శాఖ నివేదికలే స్పష్టం చేస్తుండగా.. వాటిల్లో చాలా కేసులను పోలీసులు చేధిస్తున్నారు. కానీ ఇంకా ఏటా 20శాతం కేసులు మిస్టరీలుగానే మిగిలిపోతున్నాయి. 2019లో 444 మిస్సింగ్‌ కేసులు నమోదుకాగా వాటిలో 242 మహిళలు, 105 మంది పురుషులు, 77 మంది బాలికలు, 20 మంది బాలురు ఉన్నారు. 2020లో ఆ సంఖ్య 482కి చేరింది. అందులో 271 మంది మహిళలు, 108 మంది పురుషులు, 89 బాలికలు, 14 మంది బాలురు ఉన్నారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఏటా నమోదయ్యే కేసుల్లో మహిళలు, బాలికలే అధికంగా అదృశ్యమవుతున్నట్లు స్పష్టమవుతోంది. 2019లో 242మంది మహిళలు అదృశ్యమవ్వగా 202కేసులను పోలీసులు చేధించారు. 77మంది బాలికలు కిడ్నాప్‌, మిస్సింగ్‌ ఫిర్యాదులు రాగా 67మంది బాలికల కేసులను చేధించారు. 2020లో 271 మహిళల కేసులు నమోదైతే 245, 89 బాలికల కేసులు నమోదైతే 42 కేసులను పోలీసులు పరిష్కరించారు. 

ప్రేమ వ్యవహారాల్లో టీనేజ్‌ అమ్మాయిలు 

మిస్సింగ్‌ కేసుల్లో పోలీసులు అత్యధికంగా చేధించిన కేసుల్లో ప్రేమ వ్యవహారాలకు సంబంధించినవే అధికంగా ఉన్నాయి. ఏటా నమోదయ్యే కేసుల్లో 50 శాతం కేసులు ఈ కోవలోనే ఉంటున్నాయి. పెరుగుతున్న టెక్నాలజీ కావొచ్చు, పెరిగే వాతావరణం కావొచ్చు, కారణాలు ఏమైనా టీనేజ్‌లో ఉన్న కొందరు అమ్మాయిలు ప్రేమ వ్యవహారాలతో ఇంటి నుంచి వెళ్లిపోవడం ప్రస్తుత కాలంలో సాధారణమైపోయింది. అలాంటి చాలా కేసుల్లో అమ్మాయిలు మైనర్‌లుగా ఉండటం.. అబ్బాయిలు మేజర్‌లు కావడం గమనార్హం. అలాంటి కేసుల్లో వారిని గుర్తిస్తున్న పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్‌ ఇచ్చి మైనర్‌లను వారి ఇళ్లకు తరలించి అబ్బాయిలపై కేసులు నమోదు చేస్తున్నారు. కొన్ని మైనర్ల మిస్సింగ్‌ కేసుల్లో పోక్సో యాక్ట్‌ కింద కూడా కేసులు నమోదవుతున్నాయి. మరో 20 శాతం కేసుల్లో మహిళలు కుటుంబ కలహాలతో ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నారు. మరో 10శాతంలో 60ఏళ్ల పైబడిన వృద్ధులు, మతిస్థిమితం లేనివారు, మరొకొందరు ఆర్థికపరమైన కారణాలతో, కొందరు పిల్లలు సరిగా చూడటంలేదన్న భావనతో ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. అయితే మిగిలిన 20 శాతం మందికి సంబంధించిన కేసులు మాత్రం మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. 

తప్పిపోయినవారు వ్యభిచార కూపాల్లో ?

మిస్టరీలుగా మిగులుతున్న 20శాతం కేసుల్లో పసిపిల్లలు, అమాయకమైన ఆడపిల్లలు, ఆదరణ కోరుకునే ఒంటరి మహిళలు.. ఇలా వయసుతో సంబంధం లేకుండా ఉంటున్నాయి. ప్రేమ, పెళ్లిళ్ల పేరుతో కొందరు, ఉపాధి పేరుతో మరికొందరినీ మోసం చేస్తూ జనజీవనం నుంచి తప్పించేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు మానవ అక్రమరవాణా మూల కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఇలాంటి కేసుల్లో ఆయా మహిళలు, బాలికలను లైంగికపరమైన, వెట్టిచాకిరీ, అవయవాల మార్పిడికి సంబంధించి ఉపయోగిస్తున్నట్టు పలు రాష్ట్రస్థాయి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కాగా గతంలో ‘ఫ్రీడం ఫర్మ్‌’ అనే ఓ స్వచ్ఛంద సంస్థ పలు పెద్ద నగరాల్లోని వ్యభిచార గృహాలపై దాడుల సందర్భంగా పట్టుబడిన కొందరు మహిళలను రక్షించగా.. అందులో ఖమ్మం నగరానికి సమీపంలోని కొన్ని ప్రాంతాలతోపాటుగా, ఖమ్మం జిల్లా సరిహద్దులోని కొన్ని మండలాలు, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కొందరు అమాయక మహిళలను గుర్తించి వారిని తిరిగి తమ సొంత ప్రాంతాలకు పంపిన ఘటనలు ఉన్నాయి. అమాయకమైన మహిళలు, బాలికలకు వల పన్నుతున్న మానవ అక్రమరవాణ ముఠా వారిని హైదరాబాద్‌, విజయవాడ, బెంగుళూరు వంటి ప్రాంతాలకు తరలించి వారి గుర్తింపునే మార్చి ఇతర ప్రాంతాల్లోని వ్యభిచార కూపాల్లోకి నెడుతున్నట్టు సమాచారం. అలా వ్యభిచార కూపంలోకి వెళ్లిన వారిలో కొందరు కొద్ది రోజుల తర్వాత తిరిగి వెనక్కు వెళ్లలేక అదే వృత్తిలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాలకులు, అధికారులు ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ఖమ్మం జిల్లాలో యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌(ఏహెచ్‌టీయూ)ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో ఏహెచ్‌టీయును వెంటనే ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-01-21T05:06:44+05:30 IST