నగర ఓట్ల లెక్కింపు నేడు

ABN , First Publish Date - 2021-05-02T05:30:00+05:30 IST

ఖమ్మం, మే 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడబోతున్నాయి.

నగర ఓట్ల లెక్కింపు నేడు
కౌంటింగ్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

ఖమ్మం కార్పొరేషన్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌

ఎస్సార్‌అండ్‌బీజీఎన్నార్‌ కళాశాలలో ఏర్పాట్లు

పది హాళ్లు.. ఆరు రౌండ్లలో ప్రక్రియ

ఖమ్మం, మే 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడబోతున్నాయి. నగరంలోని ఎస్సాఆర్‌అండ్‌బీజీఎన్నార్‌ కళాశాలలో యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యే ఈ లెక్కింపు మొత్తం పది హాళ్లలో.. పది రౌండ్లలో జరగనుంది. ఖమ్మం కార్పొరేషన్‌లో 60డివిజన్లు ఉండగా పదో డివిజన్‌ ఏకగ్రీవం కావడంతో 59 డివిజన్లకు పోలింగ్‌ జరిగింది. కార్పొరేషన్‌లో మొత్తం 2,83,302 ఓటర్లకు గాను 1,69,404ఓట్లు పోలవగా.. 59.80శాతం పోలింగ్‌ నమోదైంది. 59డివిజన్ల ఓట్ల లెక్కింపును మొత్తం ఆరు రౌండ్లలో నిర్వహిస్తున్నారు. ఒక్కో రౌండ్‌లో ఒక్కో డివిజన్‌కు ఒక్కో టేబుల్‌ ఏర్పాటు చేయగా.. మొత్తంగా ఐదు రౌండ్లలో 50డివిజన్లు, ఒక రౌండ్‌లో తొమ్మిది మొత్తం 59డివిజన్ల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రతీ డివిజన్‌ ఓట్ల లెక్కింపులో రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారి, కంప్యూటర్‌ ఆపరేటర్‌, కౌంటింగ్‌, అసిస్టెంట్‌ సూపర్‌వైజర్లతో పాటు కౌంటింగ్‌ సిబ్బంది విధులు నిర్వహించబోతున్నారు. మొత్తం 780 మంది ఈ విధుల్లో పాల్గొంటున్నారు. తొలుత పోస్టల్‌ ఓట్లను తెక్కించి.. అనంతరం డివిజన్ల వారీగా బ్యాలెట్‌ బాక్సులను తీసుకొచ్చి, పోలింగ్‌ నమోదు సమయంలో బ్యాలెట్‌ పత్రాలు, ఇతర వివరాలను సరిచూసుకుంటారు. ఆతర్వాత పార్టీల వారీగా అభ్యర్థులకు పడిన బ్యాలెట్లను వేరుచేసి కట్టలు కట్టి ఒక డివిజన్‌లో నాలుగైదు పోలింగ్‌ కేంద్రాలుంటే ఆ ఓట్ల కట్టలను జంబ్లింగ్‌ చేసి లెక్కిస్తారు. ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌, సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌ కౌంటింగ్‌ హాళ్లను సందర్శించి కౌంటింగ్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

అందరికీ కొవిడ్‌ పరీక్షలు

కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో కౌంటింగ్‌ విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి, అభ్యర్థులు, ఏజెంట్లకు కరోనా పరీక్షలను నిర్వహించారు. శని, ఆదివారాల్లో మొత్తం 2వేలమందికి పరీక్షలు నిర్వహించగా 247మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో నెగెటివ్‌ వచ్చిన వారిని మాత్రమే కౌంటింగ్‌కు అనుమతిచ్చారు. 

అభ్యర్థితో పాటు ఇద్దరే.. 

పోటిచేసిన అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే పోలీసులు కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతిచ్చారు. గుంపులుగా చేరినా, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు నగరంలోని డివిజన్లలో పోటీచేసిన అభ్యర్థులకు వారివారి పరిధిలోని పోలిస్‌స్టేషన్ల అఽధికారులు ఆదివారం నోటీసులు కూడా జారీ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 30 పోలీస్‌యాక్ట్‌ను అమల్లో ఉంచారు. అలాగే విజయం సాధించిన వారు ఎలాంటి ర్యాలీలు తీయొద్దని ఆదేశాలిచ్చిన అధికారులు.. కౌంటింగ్‌ సందర్భంగా 144 సెక్షన్‌ను విధించారు. 

 తగ్గిన ఓటింగ్‌ శాతంపై అభ్యర్థుల్లో గుబులు

ఖమ్మం కార్పొరేషన్‌, మే 2: విద్యావంతులు ఓటింగ్‌కు రాలేదు, నిరక్షరాస్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫలితంగా పలు డివిజన్లలో ఓటింగ్‌శాతం తక్కువగా నమోదయింది. దీంతో అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. తక్కువ ఓటింగ్‌ తమ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్‌ పేపర్లు వినియోగించారు. దీంతో ఓటర్లు స్వస్తిక్‌ గుర్తును సరిగా వేశారా? ఓట్లు చెల్లుతాయా? అన్న ఆందోళన కూడా నెలకొంది. ఎంతో చైతన్యవంతమైన విద్యాధికులైన ఓటర్లు ఉన్న డివిజన్లలో కూడా ఓటింగ్‌ తక్కువగా జరిగింది. కరోనా భయం, అలాగే అధికారులు ఇచ్చిన ఓటరుస్లిప్పులు తీసుకువెళితే అక్కడ తమ ఓటు లేకపోవటంతో పలువురు ఓటు వేయకుండానే వెళ్లిపోయారు. దీంతో పోటింగ్‌ తక్కువగా జరిగిందని పరిశీలకులు చెబుతున్నారు. అంతే కాకుండా ఓటరు స్లిప్పు, ఓటర్‌కార్డు తీసుకువచ్చినా, ఆధార్‌కార్డు కావాలని, పాన్‌కార్డు కావాలని కొంతమంది పోలింగ్‌ అధికారులు ఇబ్బంది పెట్టడంతో పలువురు ఓటు వేయకుండానే వెళ్లిపోయారు. ఇక పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే 11వ డివిజన్‌ పరిధిలో కవిరాజ్‌నగర్‌, వరదయ్యనగర్‌ ప్రాంతాలు ఉన్నాయి. అక్కడి 5 పోలింగ్‌స్టేషన్ల పరిధిలో 34నుంచి 37 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. ఇక 13వ డివిజన్‌ శ్రీనగర్‌కాలనీలోని కొన్ని పోలింగ్‌కేంద్రాల్లో 31శాతం నుండి 33శాతం మాత్రమే ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. అలాగే 18వ డివిజన్‌లోని ఒక పోలింగ్‌కేంద్రంలో 35శాతం ఓటింగ్‌ నమోదైంది. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సతీమణి వసంతలక్ష్మి తొలుత నామినేషన్‌ వేసిన 20వ డివిజన్‌లో అత్యధికంగా విద్యావంతులు ఉన్నారు. మమత ఆసుపత్రి ప్రాంతం, హార్వెస్ట్‌ పాఠశాల ప్రాంతం ఈ డివిజన్‌లో ఉన్నాయి. ఇక్కడ జరిగిన పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే ఆశ్యర్యం కలిగించక మానదు. ఈ డివిజన్‌ పరిధిలో 4 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మూడు పోలింగ్‌స్టేషన్లలో 26 శాతం పోలింగ్‌ నమోదైంది. కాగా 122 నెంబర్‌ పోలింగ్‌ కేంద్రం పరిధిలో 846 మంది ఓటర్లు ఉంటే కేవలం 152 మంది మాత్రమే ఓటు వేశారు. అంటే కేవలం 17శాతం మాత్రమే ఓటు వేశారు. ఇది ఓటర్ల నిరాసక్తతకు అద్దం పడుతోంది. ఇలా పలు డివిజన్లలో 30 నుంచి 40శాతం పోలింగ్‌ మాత్రమే నమోదు కావటంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-05-02T05:30:00+05:30 IST