తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్‌ కుటుంబం కోసమా?: సీఎల్పీ నేత భట్టి

ABN , First Publish Date - 2021-02-07T04:48:57+05:30 IST

ప్రత్యేక తెలంగాణ తెచ్చుకుంది ప్రజల సమస్యలు తీర్చడానికా...కేసీఆర్‌ కుటుంబసభ్యుల సమస్యలు తీర్చుకోవడానికా అని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్‌ కుటుంబం కోసమా?:  సీఎల్పీ నేత భట్టి
కల్లుగీత కార్మికుడితో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క

ముదిగొండ, ఫిబ్రవరి 6: ప్రత్యేక తెలంగాణ తెచ్చుకుంది ప్రజల సమస్యలు తీర్చడానికా...కేసీఆర్‌ కుటుంబసభ్యుల సమస్యలు తీర్చుకోవడానికా అని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో మార్నింగ్‌ వాక్‌ కార్యక్రమంలో పాల్గొని పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించారు. ప్రజలు, నిరుద్యోగులు, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణలో ప్రజల సమస్యలను పక్కనపెట్టి కేసీఆర్‌ కుటుంబ సమస్యలను తీర్చుకోవడంలోనే తలమునకలవుతున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలోని రైతులు మద్దతు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని, కొత్తగా వ్యవసాయ చట్టాలతో రాష్ట్రప్రభుత్వం పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పటంతో రైతులు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించాలని, నిరుద్యోగులకు నిరుద్యోగభృతి కల్పించాలన్నారు. అనంతరం పాఠశాలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు బులెట్‌బాబు, పసుపులేటి దేవేంద్రం, సర్పంచ్‌ ఆవుల రమ, నాయకులు వట్టికూటి వెంకటేశ్వర్లు, వనం ప్రదీప్త, పూర్ణచంద్రరావు, మరికంటి వెంకటేశ్వర్లు, బాబూరావు, పళ్లపాటి కృష్ణ, రాఘవ, అంజయ్య, బెందు వెంకటేశ్వర్లు, ధర్మా పాల్గొన్నారు.


Updated Date - 2021-02-07T04:48:57+05:30 IST