సేవలకు గుర్తింపు
ABN , First Publish Date - 2021-07-05T05:10:18+05:30 IST
సేవలకు గుర్తింపు
కూసుమంచి, శ్రీనివాసనగర్ అర్బన్ పీహెచ్‌సీలకు కాయకల్ప అవార్డులు
జిల్లా ప్రధాన ఆసుపత్రికి ఈ సారి ప్రోత్సాహకమే..
ఖమ్మం కలెక్టరేట్, జూలై 4: పరిశుభ్రతను పాటిస్తూ రోగులకు మెరుగైన సేవలను అందించిన కూసుమంచి, ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్ అర్బన్ పీహెచ్‌సీలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల విభాగంలో కాయకల్ప అవార్డలకు ఎంపికయ్యాయి. 2020-21ఏడాదికి గాను శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డులనుప్రకటించింది. జిల్లాలో పర్యటించిన ప్రత్యేక బృందాలు.. మెరుగైన సేవలు, నాణ్యతా ప్రమాణాల పరిశీలించి ఇచ్చిన మార్కుల ఆధారంగా కాయకల్ప అవార్డుకు ఎంపికయ్యాయి. అయితే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి బృందాల పరిశీలనలో కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల జాబితాలో, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల విభాగంలో ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్ అర్బన పీహెచ్‌సీకి అవార్డు దక్కింది. అవార్డుకు ఎంపికైన ఆస్పత్రికి రూ 2లక్షల చొప్పున ప్రత్యేక నిధులు విడుదలవుతాయి. వీటితో ఆస్పత్రిలో వసతులను పెంపొందించుకోవాల్సి ఉంటుంది.
ఖమ్మం ప్రధాన ఆస్పత్రికి ప్రోత్సాహకం..
జిల్లా కేంద్రంలోని ఖమ్మం ప్రధాన ఆస్పత్రికి ఈ సారి కాయకల్ప ప్రోత్సాహక అవార్డు లోనే స్థానం దక్కింది. రాష్ట్రంలోని 33 ప్రాంతీయ ఆస్పత్రుల విభాగంలో ఈసారి 72.45శాతం మార్కులతో రాష్ట్రవ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచింది. దీంతో కేవలం ప్రోత్సాహకమే లభించింది. అయితే ఇక్కడి ఆస్పత్రిలో సేవలు, పరిశుభ్రత అన్ని బాగానే ఉన్నా గత 2018-19 కాయకల్పకు ఎంపికవడంతో ఈసారి ఇతర ఆస్ప త్రులకు ప్రాధాన్యం కల్పించాలన్న ఉద్దేశ్యంతో దీనికి కేవలం ప్రోత్సాహకానికే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రోత్సాహకం కింది రూ.3లక్షలు విడుదల కానున్నాయి. జిల్లాలో తొమ్మిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, మరో మూడు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కూడా ప్రోత్సాహకాలను విడుదల చేసింది. ప్రోత్సాహకం కింద రూ.50వేలను అందిస్తోంది. జిల్లాలో పెద్దగోపతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాయకల్ప అవార్డుకు ప్రమాణాలు సాధించింది. మొత్తంగా 84.20శాతం మార్కులను లభించింనా ఆ ఆస్పత్రిని ఇప్పటికే జాతీయ నాణ్యతా ప్రమాణాలతో ఎన్‌క్యూఎస్ సర్టిఫికెట్‌ను సాధించింది. ఈ పీహెచ్‌సీకి ఇప్పటికే ఏటా రూ.6లక్షల ప్రోత్సాహకం అందుతోంది. దీంతో కాయకల్ప అవార్డుకు నగదును మినహాయించారు.
అవార్డుల వివరాలు ఇలా...
పీహెచ్‌సీ మార్కుల శాతం స్థానం ప్రోత్సాహకం(రూ)
కూసుమంచి 81.21 ఉత్తమం 2,00,000
సుబ్లేడు 75.00 ప్రోత్సాహకం 50,000
గంగారం 71.30 ప్రోత్సాహకం 50,000
పెద్దగోపతి 84.20 ప్రోత్సాహకం 50,000
బోనకల్ 80.00 ప్రోత్సాహకం 50,000
చింతకాని 79.00 ప్రోత్సాహకం 50,000
ఏన్కూరు 80.00 ప్రోత్సాహకం 50,000
తిరుమలాయపాలెం 72.00 ప్రోత్సాహకం 50,000
సింగరేణి 72.00 ప్రోత్సాహకం 50,000
కల్లూరు 71.00 ప్రోత్సాహకం 50,000
అర్బన్ విభాగంలో (యూపీహెచ్‌సీలు)
శ్రీనివాసనగర్ 80.80 ఉత్తమం 2,00,000
ముస్తాఫానగర్ 80.00 ప్రోత్సాహకం 50,000
మామిళ్లగూడెం 75.00 ప్రోత్సాహకం 50,000
వెంకటేశ్వరనగర్ 72.00 ప్రోత్సాహకం 50,000