కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ రసాభాస
ABN , First Publish Date - 2021-10-30T04:06:02+05:30 IST
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ రసాభాస

సీఎల్పీనేత భట్ట్టి, జడ్పీ చైర్మన్ కమల్‌రాజ్ మధ్య మాటలయుద్ధం
కాంగ్రెస్, టీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య తోపులాట
వాటర్‌బాటిళ్లు, చెప్పులు విసురుకున్న కార్యకర్తలు
మధిర, బోనకల్, ముదిగొండ కార్యక్రమాల్లో గందరగోళం
మధిర/బోనకల్/ముదిగొండ, అక్టోబరు 29: కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజుల మధ్య మాటల యుద్ధం జరగ్గా.. అది కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్ణణకు దారితీసింది. దీంతో లబ్ధిదారులు అసహనానికి గురయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్న భట్టి, లింగాల కమల్‌రాజ్ ఈ చెక్కులపంపిణీలో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం చర్చనీయాంశమైంది.
జరిగిందిదీ..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం మఽధిర నియోజకవర్గంలోని మధిర, బోనకల్, ముదిగొండ మండలాల్లో జరిగింది. తొలుత మధిరలో ఉదయం 11గంటలకు సభ ప్రారంభం కావాల్సి ఉండగా.. సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మధ్యాహ్నం 1గంటకు వచ్చారు. ఈ క్రమంలో సభకు ముందుగా వచ్చిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు తన ప్రసంగంలో సమయపాలన గురించి మాట్లాడారు. అంతేకాక ఎమ్మెల్యే సమయం ఇవ్వక కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఆలస్యమవుతోందని ఆరోపిం చారు. దీనిపై సీఎల్పీనేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ తాను రాష్ట్రానికి ప్రతిపక్షనేతనని అనేక కార్యక్రమాలు ఉంటాయని, అయినా చెక్కులు రాగానే వెంటనే తహసీల్దార్‌కు అప్పగించి.. లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పానన్నారు. వెంటనే కమల్‌రాజు కల్పించుకొని సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు లేకుండా అలా ఎలా ఇస్తారని అనడంతో ప్రసంగం మధ్యలో అడ్డు తగులుతున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు వేదిక వద్దకు దూసుకొచ్చారు. వెంటనే టీఆర్‌ఎస్ కార్యకర్తలు కూడా వేదిక వద్దకు రావడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వెంటనే పోలీసులు కలగజేసుకొని నాయకులకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత బోనకల్‌లో జరిగిన కార్యక్రమంలో కూడా ఇదే వివాదం రేగటంతో ఇరుపార్టీల కార్యకర్తలు వాటర్‌బాటిళ్లు, చెప్పులు విసురుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్మన్ కమల్‌రాజ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సకాలంలో చెక్కుల పంపిణీకి వస్తే లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, మండలాలకు వచ్చిన చెక్కులు సకాలంలో అందేలా చూడాలని సభలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు చెందిన బోనకల్ జడ్పీటీసీ మోదుగు సుధీర్‌బాబు మాట్లాడుతూ భట్టి వల్ల చెక్కులు ఎక్కడా ఆలస్యం కావడంలేదని, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి ఆలస్యమవుతుందని తెలిపారు. దీంతో టీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు జడ్పీటీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వర్గాలు చెప్పులు, వాటర్‌బాటిళ్లు విసురుకున్నారు. ఒక వాటర్ బాటిల్ వెళ్లి జడ్పీచైర్మన్‌కు తగిలింది. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రెండుగంటలపాటు గందరగోళ వాతావరణం కొనసాగింది. పోలీసులు అందరిని చెదరగొట్టారు. ఉదయం నుంచి చెక్కుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు, అసహనానికి గురయ్యారు. అలాగే ముదిగొండలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుండగా కాంగ్రెస్‌కు చెందిన ఓ నాయకుడు అధికారిక కార్యక్రమాలకు తమ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కను పిలవడం లేదని ప్రశ్నించగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గీయులను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. దీంతో అక్కడ కొద్దిసేపు గందరగోళవాతావరణం ఏర్పడింది.
