కొలువిక్కడ.. వేతనమక్కడ!

ABN , First Publish Date - 2021-12-19T06:08:47+05:30 IST

కొలువిక్కడ.. వేతనమక్కడ!

కొలువిక్కడ.. వేతనమక్కడ!

రాష్ట్ర మత్స్యశాఖలో ‘వర్క్‌ అరేంజ్‌ ఆర్డర్‌’ పేరుతో అడ్డగోలు బదిలీలు

జోన్ల వ్యవస్థను కూడా పట్టించుకోని అధికారులు

ఏడాదిగా కొనసాగుతున్న తంతు

వైరా, డిసెంబరు 18: మత్స్యశాఖలో దాదాపు ఏడాదికాలంగా ఉన్నతాధికారులు వింతపోకడలు అవలంభిస్తున్నారు. ఉద్యోగుల వెసులుబాటుకు సంబంధించిన జోన్ల వ్యవస్థను కూడా తోసిరాదని ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. స్వలాభం, స్వార్థప్రయోజనాల మాటున ఏలికల వత్తిళ్లను బూచిగా చూపుతూ ‘వర్క్‌   ఆర్డర్ల’ పేరుతో అడ్డగోలుగా బదిలీలు చేస్తున్నారు. ఒకరిద్దరు అధికారులను ఈ ఏడాదిలోనే మూడ్నాలుగు చోట్లకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ప్రస్తుతం వీరు ఉద్యోగాలు ఒక చోట చేస్తూ వేతనాలు మరోచోట తీసుకుంటున్నారు.

మల్టీజోన్లపై పట్టింపు శూన్యం

ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, నిజామాబాద్‌, హైదరాబాద్‌, సంగారెడ్డి, ఆసిఫాబాద్‌, వనపర్తి జిల్లాల్లో ఈ తంతు కొనసాగుతోంది. రాష్ట్రప్రభుత్వం ఇంతకుముందున్న జోన్లవ్యవస్థ స్థానంలో మల్టీజోన్ల వ్యవస్థను 2018లో తీసుకొచ్చినప్పటికీ ఏడాదిగా రాష్ట్ర మత్స్యశాఖ ఉన్నతాధికారులు వర్క్‌ అరేంజ్‌ ఆర్డర్లతో ఇష్టానుసారంగా పూర్వపు ఐదో జోన్‌ నుంచి ఆరో జోన్‌కు, ఆరో జోన్‌ నుంచి ఐదో జోన్‌కు అధికారులను బదిలీ చేశారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా ప్రస్తుతం 14ఏడీఎఫ్‌(అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌) పోస్టులు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 19 జిల్లాలకు ఎఫ్‌డీవో(ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు)ను డీఎఫ్‌వోలు(డిస్ట్రిక్ట్‌ ఫిషరీస్‌ అధికారులు)గా నియమించింది. 

బది‘లీలలు’ ఇలా..

వర్క్‌ అరేంజ్‌ ఆర్డర్లతో ఏడాది కాలంగా జరిగిన బదిలీలు ఇలా ఉన్నాయి. 

ఖమ్మం ఏడీఎఫ్‌ బి.నర్సింహారావును మొదట కరీంనగర్‌కు, కొంతకాలం తర్వాత జగిత్యాలకు బదిలీ చేశారు. ఆయన మాత్రం ఖమ్మంలోనే వేతనం తీసుకుంటున్నారు. ఆయన స్థానంలో ఆరోజోన్‌కు చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా డీఎఫ్‌వో(ఎఫ్‌డీవో)గా పనిచేస్తున్న షకీలాభానును ఐదో జోన్‌లోని ఖమ్మం డీఎఫ్‌వోగా నియమించారు. వాస్తవంగా ఇక్కడ ఎఫ్‌డీవోగా బుచ్చిబాబు ఉన్నారు. ఏడీఎఫ్‌ నర్సింహారావు స్థానంలో బుచ్చిబాబును ఇక్కడ డీఎఫ్‌వోగా నియమిస్తే సరిపోతుంది. అయితే బుచ్చిబాబును మహబూబాబాద్‌ డీఎఫ్‌వోగా బదిలీ చేశారు. బుచ్చిబాబు ఖమ్మం, షకీలాభాను యాదాద్రిలో వేతనాలు తీసుకుంటున్నారు.

వైరా ఎఫ్‌డీవోగా ఉన్న జి.శివప్రసాద్‌ను రాజన్న సిరిసిల్ల డీఎఫ్‌వోగా బదిలీ చేశారు. ఆయన ఇప్పటికీ వైరాలోనే వేతనం పొందుతున్నారు. వరంగల్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డి.కిరణ్‌కుమార్‌కు అసిస్టెంట్‌ ఫిషరీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగోన్నతి ఇచ్చి ఆసిఫాబాద్‌లో నియమించారు. ఆవెంటనే వైరా ఎఫ్‌డీవోగా బదిలీచేశారు. కిరణ్‌కుమార్‌ ఆసిఫాబాద్‌లోనే వేతనం తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆసిఫాబాద్‌ అసిస్టెంట్‌ పిషరీస్‌ ఇన్‌స్పెక్టర్‌ బాధ్యతలను అక్కడ డీఎఫ్‌వో నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌లో డీఎఫ్‌వోగా ఉన్న రాజారావును యాదాద్రి డీఎఫ్‌వోగా నియమించారు. ఆయన హైదరాబాద్‌లోనే వేతనం తీసుకుంటున్నారు. కరీంనగర్‌ ఏడీఎఫ్‌ టి.విజయభారతిని వరంగల్‌ అర్బన్‌ ఏడీఎఫ్‌గా నియమించారు. ఆమె కరీంనగర్‌లోనే వేతనం తీసుకుంటున్నారు. 

నల్లగొండ ఏడీఎఫ్‌ ఎం.చరితను హైదరాబాద్‌ ఏడీఎఫ్‌గా నియమించారు. ఆమె నల్లగొండలోనే వేతనం తీసుకుంటున్నారు. వనపర్తి ఏడీఎఫ్‌ ఎం.వెంకయ్యను నల్లగొండ ఏడీఎఫ్‌గా నియమించారు. ఆయన పోస్టు హైదరాబాద్‌లో ఉండటంతో అక్కడ వేతనం తీసుకుంటు న్నారు. 

ఐదోజోన్‌కు చెందిన వరంగల్‌లో అసిస్టెంట్‌ ఫిషరీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న టి.సాల్మాన్‌రాజ్‌కు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి(ఎఫ్‌డీవో)గా ఉద్యోగోన్నతి కల్పించి ఆరోజోన్‌ పరిధిలోని నల్లగొండకు బదిలీ చేశారు. ఆయన వరంగల్‌లోనే వేతనం తీసుకుంటున్నారు. 

ఐదోజోన్‌లో వరంగల్‌ ఏడీఎఫ్‌గా ఉన్న సతీష్‌ను ఆరోజోన్‌లోని సంగారెడ్డికి బదిలీ చేశారు. 

ఆరో జోన్‌లోని నిజామాబాద్‌లో ఏడీఎఫ్‌గా ఉన్న రాజనర్సయ్యను జోన్‌ ఐదులోని జగిత్యాలకు అక్కడి నుంచి కొంతకాలం తర్వాత కరీంనగర్‌కు బదిలీ చేశారు. ఆయన నిజామాబాద్‌లోనే వేతనం తీసుకుంటున్నారు. 

ఆరో జోన్‌ పరిధిలో ఉన్న వనపర్తిలో డీఎఫ్‌వోగా పనిచేస్తున్న ఏ.రెహ్మాన్‌ను అదే జోన్‌లోని యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీ చేశారు. ఆయన వనపర్తిలోనే వేతనం తీసుకుంటున్నారు. 

తమకున్న అధికారాలను అడ్డగోలుగా ఉపయోగిస్తూ వర్క్‌ అరేంజ్‌ ఆర్డర్లతో బదిలీలైన వారు ప్రస్తుతం మల్టీజోన్ల విధానంలో జరుగుతున్న బదిలీల్లోనైనా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2021-12-19T06:08:47+05:30 IST