జల్‌, జమీన్‌, జంగిల్‌పై హక్కుమాదే

ABN , First Publish Date - 2021-08-10T05:33:53+05:30 IST

జల్‌, జమీన్‌, జంగిల్‌పై హక్కుమాదే

జల్‌, జమీన్‌, జంగిల్‌పై హక్కుమాదే
ఎన్డీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిర్వహించిన పోడుపోరు

కొత్తగూడెంలో కదం తొక్కిన ఆదివాసీలు, నిరుపేదలు 

వేలాదిమందితో ర్యాలీ.. కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

ముగిసిన ఎన్డీ పోడు పోరు యాత్ర

కొత్తగూడెం కలెక్టరేట్‌ ఆగస్టు 9: జల్‌, జమీన్‌, జంగిల్‌పై హక్కు తమదేనని ఆదవాసీలు, నిరుపేదలు జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో సోమవారం  కదం తొక్కారు. పాల్వంచ నవభారత్‌ నుంచి కొత్తగూడెం కలెక్టరేట్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తమ హక్కులకు భంగం కలిగిస్తే ఖబర్దార్‌ అంటూ ప్రభుత్వంపై హెచ్చరికలు జారీ చేశారు. అటవీహక్కుల చట్టం అమలు, ఫారెస్టు అధికారులు నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని, అడవిపై అధికారం గిరిజనులదేనంటూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకెఎంఎస్‌) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీన అశ్వారావుపేటలో ప్రారంభమైన పోడుపోరుయాత్ర సోమవారం కొత్తగూడెంలో ముగిసింది. ఈ పాదయాత్రలో సుమారు మూడువేల మంది గిరిజనులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద జరిగిన సభలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కొదండరామ్‌, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమెక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వం హరితహారం పేరుతో ఆదివాసులపై యుద్ధం చేస్తోందని ఆరోపించారు. అమాయక జీవులపై చట్టవిరుద్దంగా యుద్ధం చేసినవారు చరిత్రలో అనవాళ్లు లేకుండా పోతారని హెచ్చరించారు. ఆదివాసీ చట్టాలను పటిష్ఠంటా అమలు చేయాలని, ఆదివాసీలు అడుగుతుంటే ప్రభుత్వం వారిపై చట్టదిక్కరణకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. కార్పొరేట్‌ సంస్థలకు ఈ భూములను కట్టబెట్టేందుకే ఈ దారుణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 70వేల ఎకరాలను గిరిజనుల నుంచి గుంజుకున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పీసా చట్టం, 5వ షెడ్యూల్‌, అటవీహక్కుల చట్టం పటిష్టంగా అమలు చేయాలని లేని పక్షంలో అమరవీరుల స్ఫూర్తితో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఆదివాసీల హక్కుల అమలు కోసం చేపట్టిన పోడపోరుయాత్ర వేలాదిమంది గిరిజనులు, మహిళలతో పదికిలోమీటర్ల వరకు సాగింది. పాదయాత్రకు  అగ్రభాగంలో న్యూడెమోక్రసీ కళాకారులు నిర్వహించిన ఆటపాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి న్యూడెమెక్రసీ జిల్లా కార్యదర్శి కిచ్చెల రంగారెడ్డి అధ్యక్షత హించగా, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, ఎంఎల్‌ పార్టీ నాయకులు రాయల చంద్రశేఖర్‌, గుమ్మడి నర్సయ్య, ఎన్‌ రాజు, ఆరుణ, మాచర్ల సత్యం ఆజాద్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-08-10T05:33:53+05:30 IST