‘ప్రత్యామ్నాయం’ సాధ్యమయ్యేనా..?

ABN , First Publish Date - 2021-10-26T05:28:26+05:30 IST

వచ్చే యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని వ్యవసాయశాఖ అధికారులు ఊరూరా రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

‘ప్రత్యామ్నాయం’ సాధ్యమయ్యేనా..?
వానాకాలం సాగులో ఉన్న వరి పంట

 యాసంగిలో వరి వద్దని ప్రభుత్వ ఆదేశం

 ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని వ్యవసాయాధికారుల ప్రచారం

 సాధ్యాసాధ్యాలపై మల్లగుల్లాలు

 అన్నదాతల్లో అనాసక్తి

వైరా, అక్టోబరు 25: వచ్చే యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని వ్యవసాయశాఖ అధికారులు ఊరూరా రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మండలంలోని భూముల సారాన్ని బట్టి ప్రత్యామ్నాయ పంటల సాగు సాధ్యం కష్టతరమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో దాదాపు 70శాతం వరి సాగుకు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. కేవలం 30శాతానికి లోపు మాత్రమే ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుకు అనుకూలమని రైతులతోపాటు పరోక్షంగా వ్యవసాయశాఖ అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. మండలంలో అనేక సాగునీటి వనరుల కింద దాదాపు 30వేల ఎకరాలు సాగుభూములుగా ఉన్నాయి. వైరా రిజర్వాయర్‌ కుడి, ఎడమకాల్వల కింద అధికారికంగా 14వేల ఎకరాలు, అనధికారిగా 20వేల ఎకరాలు వరి సాగులో ఉంది. ఎన్నెస్పీ ఆయకట్టులో దాదాపు 5800ఎకరాలు, ఎత్తిపోతలు, కరెంట్‌ మోటార్లు, చెరువులు, కుంటల కింద మరో 2,3వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. వైరా రిజర్వాయర్‌ కుడి, ఎడమ కాల్వల కింద దాదాపు 80శాతం బాడవ భూములుగానే ఉన్నాయి. ఈభూముల్లో వరి సాగు మినహా ఇతర పంటల సాగుకు ఏమాత్రం అనుకూలం కాదని రైతులు చెపుతున్నారు. గత ఏడాది మాత్రమే రిజర్వాయర్‌ ఆయకట్టులో వానాకాలం, యాసంగి వరి పంటలు సాగుచేశారు. అంతకముందు నాలుగైదేళ్లు వరుసగా వానాకాలం పంటకు బదులు యాసంగి ఒక్క పంట మాత్రమే వేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, సాగునీటి లభ్యత లేకపోవడం వలన వానాకాలం పంటలకు దూరంగా ఉన్నారు. గత ఏడాది మాత్రం అన్నీ అనుకూలించటంతో వానాకాలం, యాసంగి సాగుచేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ఊరూరా ధాన్యం కొనుగోలు చేసింది. ఈ ఏడాది కూడా సాగునీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో వానాకాలం వరిసాగుచేశారు. ప్రస్తుతం సాగర్‌లో నీటి లభ్యత పుష్కలంగా ఉన్నప్పటికీ వరి సాగుకు ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఆపంటకు బదులు ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఆమేరకు వ్యవసాయశాఖ అధికారులు గ్రామస్థాయిల్లో రైతు సదస్సులు నిర్వహించి యాసంగిలో వరిసాగుచేయవద్దని స్పష్టం చేస్తున్నారు. 


వ్యవసాయశాఖ సూచిస్తున్న ప్రత్యామ్నాయ పంటలు ఇవే..


వరికి బదులు మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, మినుములు, జనుములు, పెసర, పిల్లిపెసర, వేరుశనగ, మంచి శనగ తదితర ఆరుతడి పంటలను సాగుచేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే 20శాతం భూముల్లో మాత్రమే మొక్కజొన్న, మినుము ఇతర ఆరుతడి పంటలను సాగుచేసుకొనే అవకాశముంది. మిగిలిన 80శాతం భూములు ఈ పంటల సాగుకు అనుకూలంగా లేవు. బాడవ భూములుగా ఉన్నాయి. వరి సాగుకు మాత్రమే భూములు పనికొస్తాయి.


వరికోత మిషన్లు లేనప్పుడు..


వరికోత మిషన్లు రంగంలోకి రాకముందు వైరా రిజర్వాయర్‌ ఆయకట్టులో వానాకాలం వరిసాగు తర్వాత యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయంగా మినుము, జనుము, పిల్లిపెసర ఇతర పంటలు సాగుచేసేవారు. కూలీలతో వరికోయించిన సమయంలో మాత్రం ఏమాత్రం ఖర్చు లేకుండానే రైతులు ఈ పంటలు వేసుకున్నారు. కూలీలతో వరికోసే ఒకట్రెండురోజుల ముందు జనుములు, మినుముల విత్తనాలను మొక్కకట్టుకొని ఆతర్వాత నేరుగా మాగాణి భూముల్లో చల్లుకొనేవారు. ఆతర్వాత వరి కోసి వారంనుంచి పదిరోజులు ఆవిత్తనాలపై ఆరబెట్టేవారు. ఆపంట మొక్క వచ్చే దశలో వరి పనలు కట్టి గూళ్లు వేసి ఆతర్వాత నూర్పిడిలు చేసేవారు. యాసంగిలో కొంతమేరకు మినుము, జనుము పంటలు రైతు చేతికొచ్చేవి. జనుమును పశుగ్రాసంగా రైతులు ఉపయోగించేవారు. ఇప్పుడు వరికోత మిషన్లు వచ్చిన తర్వాత ఈ పంటల సాగు లేకుండాపోయింది. తేమ మీద ఉన్న భూముల్లో మిషన్లు తిరుగాల్సి ఉన్నందున విత్తనాలు చల్లినా అవి మొలకెత్తే పరిస్థితి లేకుండాపోయింది. పంట నూర్పిడిలలో కూడా మార్పులు వచ్చాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో యాసంగిలో వరిసాగు మాత్రమే చేసుకోవాల్సిన పరిస్థితి అనివార్యమైంది.


ఎన్నెస్పీ, ఇతర నీటి వనరుల పరిధిలో..


ఎన్నెస్పీ ఆయకట్టులో మాత్రం 50శాతానికిపైగా ప్రత్యామ్నాయ పంటలకు అవకాశముంది. అయితే ఆయకట్టులో ఎక్కువగా మిర్చి, పత్తి ఇతర రకాల వాణిజ్య పంటలను ఇప్పటికే రైతులు సాగుచేసుకొని ఉన్నారు. కొంతమేర మాత్రమే మాగాణి భూములున్నాయి. ఎత్తిపోతలు ఇతర సాగునీటి వనరుల కింద కూడా ఎక్కువగా వరిసాగుకు అనుకూలమైన భూములు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఇతర పంటల సాగుచేసే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు కష్టతరమని రైతులు స్పష్టం చేస్తున్నారు.


Updated Date - 2021-10-26T05:28:26+05:30 IST