ఇంకుడుగుంతలలో మింగుడెంత..?

ABN , First Publish Date - 2021-11-22T05:24:50+05:30 IST

ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రతి ఇంటిలో ఈ ఇంకుడు గుంతలను నిర్మించి భవిష్యత్‌ తరాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలనేది ప్రభుత్వ ఆలోచన.

ఇంకుడుగుంతలలో మింగుడెంత..?
పూర్తైనట్టు రికార్డుల్లో ఉన్న ఇంటి ముందు దింపిన మెటల్‌, వరలు

 ఇప్పుడే ఇంకుడు గుంతల నిర్మాణాలెందుకు..

నేడు మండల పరిషత్‌లో ఇన్నర్‌ఫోరం

సత్తుపల్లిరూరల్‌, నవంబరు 21: ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రతి ఇంటిలో ఈ ఇంకుడు గుంతలను నిర్మించి భవిష్యత్‌ తరాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలనేది ప్రభుత్వ ఆలోచన. భూగర్భజలాలను పెంచేందుకు నిర్మించే ఇంకుడుగుంతల నిర్మాణంలో ప్రభుత్వ లక్ష్యం నెరవేరనట్లుగా ఉంది. కేవలం కాగితాల్లోనే లెక్కలు ఉన్నాయని, క్షేత్రస్థాయిలో లేవని లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా ఈజీఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టే ఈ పథకం పక్కదారి పడుతుందనే వాదన మండల వ్యాప్తంగా వినిపిస్తుంది.


ఇప్పుడు హడావిడి ఎందుకు ?


సామాజిక తనిఖీ బృందం తనిఖీలు ఆదివారంతో ముగిశాయి. సోమవారం మండల పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించే ఇన్నర్‌ ఫోరంలో ఈ బృందం నివేదిక ప్రకారం సమావేశం సాగనుంది. శనివారం ఎంపీడీవో సుభాషిణీ తుంబూరు గ్రామంలో పర్యటించి ఇంకుడుగుంతల నిర్మాణాలపై గత, తాజా సెక్రటరీలతో మాట్లాడి రికార్డులను పరిశీలించారు. ఈజీఎస్‌ పనులపై తుంబూరులో సామాజిక తనిఖీ బృందం గ్రామంలో పర్యటించగా పలు వీధుల్లో ఒకే ఇంటివద్ద కూలీలతో సంతకాలు తీసుకున్నట్లు లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. శానిటేషన్‌ పనుల కింద మండలంలో ఇంకుడు గుంతల నిర్మాణాలలో సగం వరకు గుత్తేదారులు భాగస్వాములవ్వగా మిగతావాటిని ప్రజాప్రతినిధులు, లబ్దిదారులు నిర్మించుకున్నట్లు ఈజీఎస్‌ ఏపీవో ఎం.బాబు చెబుతున్నారు.


నిబంధనలు పాటిస్తున్నారా...?


తుంబూరు గ్రామంలో ఇంకుడుగుంతల నిర్మాణంలో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ ఇంటివద్ద హడావుడిగా నిర్మిస్తుండగా చిన్నారులు ఉన్నారనే కనీస జాగ్రత్తలు కూడా పాటించలేదని, వరలపై మూతలు వేయలేదని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకుడు గుంతలు ఇప్పటికి ఇప్పుడే ఎందుకు నిర్మించారు, బిల్లులు లబ్దిదారులకు తెలియకుండా ఎందుకు డ్రా చేశారు, వందల సంఖ్యలో తప్పులు ఎలా దొర్లాయనే ప్రశ్నలకు సమాధానం అధికారులే చెప్పాల్సి ఉంది. కాగా తుంబూరులో ఇంకుడు గుంతల నిర్మాణాలపై ఇన్నర్‌ ఫోరం అనంతరం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు ఎంపీడీవో చిట్యాల సుభాషణీ వివరణ ఇచ్చారు.


Updated Date - 2021-11-22T05:24:50+05:30 IST