ఐదుగురితో మొదలై.. అంచెలంచెలుగా ఎదిగి

ABN , First Publish Date - 2021-10-10T05:45:15+05:30 IST

ఐదుగురితో మొదలై.. అంచెలంచెలుగా ఎదిగి

ఐదుగురితో మొదలై.. అంచెలంచెలుగా ఎదిగి
మంత్రి ప్రారంభించనున్న ఖమ్మం ఐఎంఏ భవనం

అభివృద్ధి పథంలో ఐఎంఏ ఖమ్మం విభాగం

ప్రస్తుతం సభ్యులుగా 450మంది వైద్యులు

సెంట్రల్‌ కమిటీలోనూ ఖమ్మానికి స్థానం

నేడు మంత్రి అజయ్‌ చేతులమీదుగా నూతన భవనం ప్రారంభం

ఖమ్మం కలెక్టరేట్‌, అక్టోబరు 9: ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఏర్పాటై ఆరుదశాబ్ధాలు పూర్తిచేసుకుంది. నాడు ఐదుగురు సభ్యులతో ప్రారంభమైన ఖమ్మం ఐఎంఏ నేడు 450మంది సభ్యులతో అంచెలంచెలుగా ఎదిగింది. సెంట్రల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కూడా ఖమ్మానికి స్థానం దక్కింది. ఆరుదశాబ్దాలుగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ధీటుగా నేడు నూతన భవనంలోకి అడుగిడుతోంది. 1960లో ఖమ్మంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రాంభమైంది. నాడు ఐదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఇందులో 450మంది వైద్యులు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ త ర్వాత ఖమ్మం నగరం గత పదేళ్లుగా వైద్యంరంగంలో మరింత అభివృద్ధి చెందుతోంది. జిల్లాలో 600 ఆసుపత్రులు ఉన్నాయి.  కార్డియాక్‌, యూరాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రో, సర్జికల్‌ గాస్ర్టో, అన్నిరకాల సర్జరీలు, అన్నిరకాల అత్యవసర వైద్యసేవలకు ఖమ్మం చిరునామాగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌కు కూడా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఐఎంఏ అధ్యక్షుడిగా పనిచేసిన డాక్టర్‌ జయచంద్రారెడ్డి సెంట్రల్‌ ఐఎంఏ అధ్యక్షుడిగా కొనసాగారు. ఖమ్మానికి చెందిన మరో వైద్యుడు డాక్టర్‌ రాధాకృష్షమూర్తి ఖమ్మం పార్లమెంట్‌ సభ్యుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఖమ్మంలో సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ పీఎన్‌వీ ప్రసాద్‌ రాష్ట్ర ఆర్థోపెడిక్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మానసిక వైద్యుల అసోసియేషన్‌ అధ్యక్షుడిగా డాక్టర్‌ ఆర్‌ సతీష్‌బాబు ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఎంతో మంది వైద్యులు ప్రముఖంగా వివిధ విభాగాలలో నిష్ణాతులు ఖమ్మంలో పేదలకు, అత్యవసర సేవలను అందిస్తూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌కు మంచి పేరుతీసుకొస్తున్నారు. తలసేమియా చిన్నారులకు రక్తదానంతో పాటు ప్రభుత్వ పిలుపు మేరకు వివిధ సాంఘిక కార్యక్రమాలకు, ప్రకృతి వైపరిత్యాలకు వైద్యులుగా స్పందిస్తూ పేదలకు సేవ చేస్తోంది ఐఎంఏ. కరోనా కష్టకాలంలో ఖమ్మం ఐఎంఏ వైద్యులు ప్రజలు విశేష సేవలందించారు.  దాంతో కరోనా నియంత్రణలో ఖమ్మం రాష్ట్రంలో అగ్రభాగాన నిలిచింది.

నేడు నూతన భవనం ప్రారంభం

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఐఎంఏ ట్రస్ట్‌కు నూతన భవనాన్ని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆదివారం ఉదయం 10గంటలకు ప్రార ంభించనున్నారు. డాక్టర్‌ యలమంచిలి రాధాకృష్ణమూర్తి పేరుతో నిర్మించిన ఆడిటోరియం, గైనకాలజిస్ట్‌ అసోసియేషన్‌ హాల్‌ను మంత్రి ప్రారంభించ నున్నారు. డాక్టర్ల అకడమిక్‌ కార్యక్రమాల నిర్వహణకు గైనకాలజిస్ట్‌ హాల్‌ను స్పెషాలిటీ డాక్టర్ల కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసినట్లు ట్రస్టు కార్యదర్శి డాక్టర్‌ రవీంద్రనాధ్‌ తెలిపారు. నూనత భవనం ప్రారంభోత్సవంలో ఖమ్మం జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, పాల్గొంటారని ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్‌ శోభాదేవి, డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌, ఐఎంఏ ట్రస్ట్‌ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్‌ ఆంధ్రజ్యోతి, డాక్టర్‌ రవీంద్రనాథ్‌ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - 2021-10-10T05:45:15+05:30 IST