అడ్డగోలు వ్యాపారం!
ABN , First Publish Date - 2021-07-09T03:43:52+05:30 IST
అడ్డగోలు వ్యాపారం!

ఖమ్మం జిల్లాలో రియల్‌దందా
దరఖాస్తు చేయడం.. వెంచర్ వేయడం
అనుమతులు రాకముందే ప్లాట్ల అమ్మకాలు
ఖమ్మం, జూలై 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ‘సుడా’ అనుమతి, డీటీసీపీ లేఅవుట్ అనుమతి పొందిన తర్వాతే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి, ప్లాట్లు అమ్ముకోవాలి. కానీ ఖమ్మం జిల్లాలో ఈ నిబంధనలు పాటించకుండానే కొంద రు అడ్డగోలుగా రియల్ వ్యాపారం చేస్తున్నట్టు తెలు స్తోంది. అనధికారికంగా వెంచర్లు వేసి అనుమతులు తీసుకోకుండానే గప్‌చుప్‌గా ప్లాట్ల అమ్మకాలు సాగిస్తు న్నారు. ప్రధాన రహదారుల పక్కనే జోరుగా రియల్ దందా సాగుతుండగా.. ఫిర్యాదులు వస్తేనే తప్ప అధికార యంత్రాంగం స్పందించని పరిస్థితి కనిపిస్తోంది. హైదరా బాద్ తర్వాత ఖమ్మం నగరం, చుట్టుపక్కల గ్రామాల్లో దశాబ్దంన్నర కాలంగా రియల్ మార్కెట్ మూడుపూలు ఆరు కాయలుగా విలసిల్లుతోంది. ఏపీ రాజధాని విషయం లో అయోమయం ఏర్పడటం, అమరావతిలో రియల్ రంగం కుదేలవడంతో.. అందరి దృష్టి ఖమ్మం జిల్లాపై పడింది. దీంతో జిల్లాలోని రియల్టర్లే కాకుండా ఇతర ప్రాం తాల నుంచి కూడా వ్యాపారులు జిల్లాలో వ్యవసాయ భూములను కొనుగోలు చేసి వెంచర్లు వేస్తున్నారు. వాస్తవానికి రెండున్నర ఎకరాలలోపు వెంచర్‌కు ఖమ్మం డీటీసీపీలో అప్రూవల్ తీసుకోవాలి. ఐదు ఎకరాలవరకు అయితే వరంగల్‌లో తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువైతే హైదరాబాద్‌లో అనుమతి తీసుకోవాలి. అయితే జిల్లాలో కొందరు రైతుల నుంచి భూములు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. మొదట డీటీసీపీ అప్రూవల్ కోసం దరఖాస్తులు చేసి.. దాన్ని చూపి అనుమతివచ్చినట్టుగా చెబుతూ వెంచర్లు వేసి ప్లాట్ల విక్రయాలు సాగిస్తున్నారు. ఈ తరహా వెంచర్లు ఖమ్మంరూరల్, కూసుమంచి, రఘునాఽథపాలెం, ముదిగొండ, చింతకాని, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కొణిజర్ల, మధిర, వైరా, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, బోనకల్, తల్లాడ తదితర మండలాల్లో వెలుస్తున్నాయి. అనుమతులు కోసం దరఖాస్తులు చేయడం, ఆ వెంటనే వెంచర్లు వేసి బ్రోచర్లు ముద్రించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి.. ప్లాట్లు బుక్ చేస్తున్నారు. కొన్ని చివరిలో అనుమతులు వచ్చి రిజిస్ర్టేషన్లవుతుండగా అనమతులు రానివిపెండింగ్‌లోనే ఉంటున్నాయి. వాస్తవానికి వ్యవసాయ భూములు కొనుగోలు చేసినప్పడు దానికి భూ బదలాయింపు అనుమతి తీసుకోవడం, ఆ తర్వాత లే అవుట్ వేసి పట్టణ, గ్రామ ప్రణాళిక అధికారి, ‘సుడా’ నుంచి అనుమతి పొందాలి. పూర్తిస్థాయి అనుమతలు వచ్చిన తర్వాతే ప్లాట్లు అమ్మాలి.
సొమ్ము చేసుకుని.. తిరకాసు వస్తే వదిలేయడం..
అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా వెంచర్లు వేసి సొమ్ము చేసుకుంటున్న కొందరు వ్యాపారులు.. ఏదైనా తిరకాసు వస్తే మాత్రం మధ్యలో వదిలేస్తున్నారు. దీంతో ప్లాట్లు కొన్న వారు అగచాట్లు పడుతున్నారు. జిల్లాలో పదేళ్లక్రితం రఘునాఽథపాలెం, కొణిజర్ల, ఖమ్మంరూరల్ తదితర మండలాల్లో అనధికారికంగా వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయించిన తర్వాత మళ్లీ ఆ భూములును వేరేవారికి రిజిస్ర్టేషన్లు చేసి పలువురు రియల్ వ్యాపారులు దందాకు పాల్పడ్డారు. గతంలో వేసిన వెంచర్లలో ఏకంగా రోడ్లను కూడా అమ్ముకున్న వారున్నారు. ఒకే భూముని పలువురికి రిజిస్ర్టేషన్లు చేయడం, కొందరు అమ్మిన ప్లాట్లు దున్ని పెన్షింగ్ వేయడం లాంటివి జరుగుతున్నాయి. ఈ క్రమంలో కలెక్టరేట్ వద్ద బాధితులు ధర్నాలు చేయడం, కోర్టు, పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కుతున్న వారున్నారు. ఎక్కడేమైనా కానీ కొందరు రియల్ వ్యాపారులు మాత్రం తమ దందాను సాగిస్తూనే ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకటి, రెండు చోట్ల మినహా అంతా 1/70చట్టం అమల్లో ఉండడంతో గిరిజనేతలు ఎవరు ప్లాట్లుకొనుగోలు చేయలేని పరిస్థితి. దీంతో సింగరేణి, హెవీవాటర్, ఐటీసీబీపీఎల్, కేటీపీఎస్, తదితర పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు తము సంపాదించుకున్నసొమ్మును ఖమ్మంలోనే రియల్ వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నారు. భవిష్యత్‌లో పదవీవిరమణ అయిన తర్వాత ఖమ్మంలో ఇల్లు నిర్మించుకోంవచ్చన్న భావనతో ఖమ్మంలో భూములు కొంటున్నారు. అనుమతులున్నాయని నమ్మి ప్లాటు కొని చివరకు వివాదంలో పడినప్పుడు అవస్థలు ఎదుర్కొంటున్నారు. భద్రాద్రి జిల్లాతోపాటు పొరుగున ఉన్న సూర్యాపేట, మహబూబాబాద్‌తో ఏపీలోని కృష్ణా జిల్లావాసులు ఖమ్మం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని భూములు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడిజిల్లాలోని ఎన్‌ఆర్‌ఐలు కూడా రియల్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఖమ్మాన్ని అనువైన ప్రాంతంగా భావిస్తుండటంతో ప్రతినెలా వంద కోట్లకుపైగా రియల్ వ్యాపారం జరుగుతోంది.
నోటీసులు ఇస్తున్నాం..
వి.ప్రభాకరరావు, ఖమ్మం డీపీవో
జిల్లాలో అనుమతిలేనిరియల్ వెంచర్లపై చర్యలు తీసుకుంటున్నాం. అన్నీ గ్రామ పంచాయతీల కార్యదర్శులకు ఇప్పటికే ఆదేశాలిచ్చాం. అనుమతిలేని వెంచర్ల వివరాలు సేకరించి వారికి నోటీసులు జారీచేస్తున్నాం. వెంచర్ యజమాని ఎవరైనా పూర్తిస్థాయి అనుమతులు వచ్చాకే ప్లాట్లు అమ్మాలి. అనధికారికంగా అమ్మితే చర్యలు తీసుకుంటాం. ప్లాట్ల కొనుగోలుదారులు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. అన్ని అనుమతులు న్నప్పుడే కొనుగోలు చేయాలి.