అక్రమ వ్యాపారంలో అమాయకులు

ABN , First Publish Date - 2021-06-22T05:02:34+05:30 IST

తెలియకుండానే ఉచ్చులోకి..

అక్రమ వ్యాపారంలో అమాయకులు
నకిలీ విత్తన ప్యాకెట్లను చూపుతున్న సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌ (ఫైల్‌)

నకిలీ విత్తన దందాలో చిక్కుకుంటున్న నిరక్షరాస్యులు

కమీషన్‌ కోసం తెలియకుండానే ఉచ్చులోకి రైతులు

కేసుల ఊబిలోకి గ్రామీణ ప్రాంత అన్నదాతలు 

మరోసారి రూ.కోటికి పైగా పట్టుబడిన విత్తనాలు


ఖమ్మం: ఆరుగాలం కష్టించి.. పంట పండించి, విక్రయించుకునే క్రమంలో అన్నదాతలు నష్టపోతూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు వ్యాపారుల చేతిలో అన్నదాత నష్టపోవడం చూస్తున్నాం. ప్రస్తుతం దానికి భిన్నంగా తోటి అన్నదాత చేతుల్లో మరో రైతు నష్టపోయే దుస్థితి దాపురించింది. కొందరు అక్రమార్కుల మోసపూరిత మాటలకు ఆకర్షితులవుతున్న అమాయక రైతులు.. తోటి రైతులను అగాథంలోకి నెడుతున్నారు. ఇటీవల నకిలీ విత్తన దందాపై దృష్టిసారించిన ప్రభుత్వం పోలీసు, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించడంతో ఉమ్మడి జిల్లాలో విత్తనదందా వెలుగులోకి వచ్చింది. ఈ దందాలో పలువురిపై కేసులు నమోదవగా.. అందులో అభంశుభం తెలియని రైతులు కూడా ఉండటం గమనార్హం. 


గ్రామాల్లో విక్రయించడం కోసం.. 

అన్ని అనుమతులు పొందిన డీలర్‌ దగ్గరే విత్తనాలను కొనండి అంటూ పదే పదే వ్యవసాయ, పోలీసు అధికారులు రైతులకు సూచనలు జారీ చేస్తున్నారు. వారి సూచనలకు తగ్గట్టుగానే రైతులు కూడా తాము మోసపోకూడదన్న ఉద్దేశంతో తమకు దగ్గరలోని, తెలిసిన డీలర్‌ దగ్గర విత్తనాలు కొనేందుకు సిద్ధమవుతున్నారు. కానీ అను మతులు లేని, నకిలీ విత్తనాలను దుకాణాల్లో విక్రయిస్తే అధికారులకు సులభంగా పట్టుబడే అవకాశం ఉండటంతో అక్రమార్కులు నేరుగా గ్రామీణ ప్రాంతాల్లో దందా దుకాణాన్ని తెరుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అమాయకులను లక్ష్యంగా చేసుకుని.. కొందరు అమాయక రైతులకు కమీషన్ల ఆశ చూపి.. వారి ద్వారా ఆ గ్రామంలోని పరిచయస్తులు, ఇతర రైతులకు విత్తనాలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అధికారులు దాడులు చేయడంతో ఇలాంటి అక్రమ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. 


కమీషన్‌ కోసం ఆరాటం.. పోలీసులతో పోరాటం..

కంపెనీ నుంచి ప్రతినిధి, మేనేజర్‌ ఇలా ఎవరో ఒకరు గ్రామీణ ప్రాంతా ల్లోని కొందరు రైతుల వద్దకు వచ్చి తమ కంపెనీ గురించి మాయ మాట లు చెప్పి విత్తనాలు విక్రయిం చడం జరుగుతోంది. అంతటితో ఆగ కుండా.. తమ కంపెనీ గురించి పరిచయం ఉన్న వారికి చెప్పండని, అలా అమ్మిస్తే కమీషన్‌ వస్తుందంటూ సదరు అమాయక రైతులకు చెబు తుండటంతో.. వారు కూడా ఆకర్షితుల వుతున్నారు. కొన్ని కంపెనీలైతే ఇతర రైతులకు ఎక్కువ మొత్తంలో విత్తనాలను అమ్మిపెడితే వారి పొలంలో వేసుకోవాల్సిన పంటకు సరిపడా విత్తనాలు ఉచితంగా ఇస్తామంటుండటం, దాంతో పాటు 20శాతం నుంచి 30శాతం కమీషన్‌ కూడా వస్తుందని చెబుతుండంతో కొందరు రైతులు ఆశపడుతున్నారు. దాంతో సదరు కంపెనీ ఏజెంట్లను తమకు పరిచయం ఉన్న రైతుల వద్దకు తీసుకెళ్లి.. విత్తనాల విక్రయానికి అండగా నిలిచి.. తెలియకుండానే తోటి రైతులు నష్టపో వడానికి కారకులవుతున్నారు. ఈ క్రమంలో తాము ప్రమోట్‌ చేసిన విత్తనాలకు అనుమ తులు లేకపోవడం, నకిలీవి కావడం లాం టివి జరగడంతో కేసుల్లో ఇరుక్కుం టున్నా రు. ఇటీవల పోలీసు శాఖ జరిపిన దాడుల్లో పట్టుబడి కేసులు నమోదైన వారిలో ఇలా పలువురు రైతులు ఉన్నారు. వారిలో కొందరికయితే తాము ప్రమోట్‌ చేసిన కంపెనీ పేరు పూర్తిగా చెప్పడం కూడా రావ డం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కానీ పట్టుబడిన తర్వాత లబోదిబోమంటూ తమకు ఏమి తెలియదని, తాము కూడా మోసపోయామనడం గమనార్హం.

 

మరోసారి రూ.కోటికి పైగా పట్టుబడిన విత్తనాలు

ఉమ్మడి జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో భారీమొత్తంలో నకిలీ, అనుమతి లేని విత్తనాలు బయటపడుతున్నాయి. ఇటీవల కాలంలో సుమారు రూ.2కోట్ల వరకు విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ఎనిమిది చోట్ల కేసులు నమోదు చేసి సుమారు 44మంది నిందితులను పేర్కొనగా.. అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ లోని సాయిలక్ష్మీ ఎజెన్సీ నుంచి రూ. 40.32 లక్షల విలువచేసే 2016 విత్తన ప్యాకెట్లను, వరంగల్‌లోని పరమేశ్వరీ అగ్రో ఏజెన్సీ నుంచి రూ. 66.60 లక్షల విలువ చేసే  3380 ప్యాకెట్లను, మహబూబాబాద్‌లోని ద్వారకా హైబ్రిడ్‌ సీడ్స్‌ ఏజెన్సీ నుంచి రూ. 36.80 లక్షల విలువ చేసే 1840 ప్యాకెట్లను సీజ్‌ చేశారు. దీనితోపాటుగా ఖమ్మం నగరంలో టాస్క్‌ఫోర్స్‌, వ్యవసాయశాఖ అధికారులు దాడులు నిర్వహించి లైసెన్సు లేకుండా మిర్చి, పత్తి విత్తనాలను విక్రయిస్తున్న భాస్కర్‌ సీడ్స్‌ ఏజెన్సీ నుంచి రూ. 26 లక్షల విలువ చేసే 4875 మిర్చి, పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రఘునాథపాలెం మండలం పంగిడిలో అనుమతి లేకుండా విక్రయిస్తున్న రూ. 8 లక్షల విలువ చేసే 1920 మిర్చి, 64 ప్యాకెట్ల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లి శివారులోని ఓ మామిడితోటలో అనుమతులు లేకుండా విత్తనాలు తయారు చేస్తున్న కేంద్రంపై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు చేసి 240 కిలోల విత్తనాల తయారీ ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. బోనకల్లు మండలంలో ఇంట్లోనే అనుమతి లేని ఓంకార్‌ సీడ్‌ టెక్‌ విత్తనాలు విక్రయిస్తున్నట్టు తెలుసుకున్న అధికారులు తనిఖీలు నిర్వహించి రూ.3లక్షల విలువైన మిర్చి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయా దాడులకు సంబంధించి ఎన్కూరు, ఖమ్మం రూరల్‌, ఖమ్మం త్రీటౌన్‌, బోనకల్లు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. వాటితోపాటుగా ఇటీవల కాలంలో జిల్లావ్యాప్తంగా మరో రూ. కోటి విలువ చేసే విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అందుకు సంబంధించి విచారణ జరుగుతున్నట్టు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో దానికి సంబంధించిన వివరాలు కూడా అధికారులు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-06-22T05:02:34+05:30 IST