నవంబరు రెండో వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు
ABN , First Publish Date - 2021-10-29T05:38:08+05:30 IST
నవంబరు రెండో వారం నుంచి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు చేపడతామని జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సోములు పేర్కొన్నారు.
4.50 వేలమెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం
160 కేంద్రాల ఏర్పాటు
జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్
ఖమ్మంకలెక్టరేట్, అక్టోబరు28: నవంబరు రెండో వారం నుంచి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు చేపడతామని జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సోములు పేర్కొన్నారు. జిల్లాలో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహాకార పరపతి సంఘాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 160 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఐకేపీ ద్వారా (డీఆర్డీఏ) 40కొనుగోలు కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ద్వారా 100 , డీసీఎంఎస్15, ఏఎంసీ ద్వారా 5 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న ట్లు చెప్పారు. ఇప్పటికే కలెక్టర్ వీపీ గౌతమ్ ధాన్యం సేకరణపై సమీక్షించి లక్ష్యాలను నిర్ధేశించారు.
4.50 మెట్రిక్ టన్నుల సేకరణ
జిల్లాలో ఖరీఫ్‌లో 2.30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారుల అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగుబడులు కూడా అధికంగానే వచ్చే ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. జిల్లాలో వేంసూరు, సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి లాంటి సరిహద్దు ప్రాంతాలతో పాటు కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం అర్భన్, రూరల్ మండలాల్లోనూ అధికంగా దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా సుమారు 5.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనాలు వేస్తున్నారు. దీనికోసం రైతులకు ధాన్యం విక్రయాల్లో ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలను జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పౌరసరఫరాల సంస్థ సన్నాహాలు
జిల్లాలో ఈ ఏడాది 4లక్షల50వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలన్నది పౌరసరఫరాల సంస్థ లక్ష్యం.. దీనికోసం 160కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రవాణాపైనా ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఏటా ధాన్యం రవాణాలో తీవ్ర ఇబ్బందులతో ఇటు రైతులు, అటు అధికారులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ వీపీ గౌతమ్ ఈ సారి ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లాలో 8 సెకార్లుగా విభజించారు. ఒక్కో సెక్టారుకు 50 వాభనాల చొప్పున 400 లారీలను ధాన్యం రవాణా మిల్లర్లకు చేరవేసేలా చర్యలు తీసుకుం టున్నారు. ఏరోజు ధాన్యాన్ని ఆరోజే మిల్లర్లకు తరలించ నున్నారు. ఈ సారి ప్రభుత్వం రైతుల ధాన్యానికి మద్దతు ధరను పెంచడంతో ఏ గ్రేడ్ రకానికి రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 గా నిర్ణయించారు. 17శాతం తేమ మించకుండా ఉన్న ధాన్యాన్ని మాత్రమే ఈ కేంద్రాల్లో కొనుగోలు చేస్తారు.
రైతు ఖాతాకే నగదు
సోములు, జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్
జిల్లాలో 160 కొనుగోలు కేంద్రాలకు వైరా,సత్తుపల్లి, ముత్తగూడెం, మధిర మార్కెట్ గోదాముల్లో ఽధాన్యాన్ని నిల్వ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కొత్త గన్నీ సంచుల కొనుగోలుకు ప్రతిపాదనలు పంపించాం. త్వరలో జిల్లాకు చేరుకోనున్నాయి. కొనుగోలు ధాన్యాన్ని మిల్లర్లకు సరఫరా చేసేందుకు టెండర్లు కూడా పూర్తిచేశాం. రైతుల వివరాలన్నీ ఆన్‌లైన్‌లోనే నిక్షిప్తం చేస్తున్నాం. 48గంటల్లో నేరుగా రైతుఖాతాకే నగదు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు అవగాహన కల్పించడంకోసం కరపత్రాలు, గోడపోస్టర్ల ద్వారా జిల్లాఅంతటా ప్రచారం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం.