త్వరలోనే బాలిక ఆచూకీ కనుగొంటాం

ABN , First Publish Date - 2021-01-13T05:03:14+05:30 IST

క్షుద్రపూజల నేపథ్యంలో అదృశ్యమైన పదహారేళ్ల బాలిక ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని, త్వరలోనే ఆ బాలిక ఆచూకీ కనుగొంటామని వైరా ఏసీపీ కె.సత్యనారాయణ స్పష్టం చేశారు.

త్వరలోనే బాలిక ఆచూకీ కనుగొంటాం

మేనత్త, పూజారిని అదుపులోకి తీసుకున్నాం

వైరా ఏసీపీ సత్యనారాయణ

ఎర్రుపాలెం, జనవరి 12: క్షుద్రపూజల నేపథ్యంలో అదృశ్యమైన పదహారేళ్ల బాలిక ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని, త్వరలోనే ఆ బాలిక ఆచూకీ కనుగొంటామని వైరా ఏసీపీ కె.సత్యనారాయణ స్పష్టం చేశారు. మంగళవారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతనెల 17న ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల గ్రామంలో గద్దె నర్సింహారావు ఇంట్లో బాలిక మేనత్త గద్దే రోశమ్మ, పూజారి శివయ్య, మాంత్రీకుడు ప్రకాష్‌శర్మ క్షుద్రపూజలు పూజలు నిర్వహించారని తెలిపారు. ఈ క్రమంలో 16ఏళ్ల బాలికను ఆ పూజల్లో కూర్చోబెట్టారని, బాలిక అదృ శ్యం కావడానికి కారణమైన మేనత్త రోశమ్మ, పూజారి శివయ్యను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. బాలికను కిడ్నాప్‌ చేసిన మాంత్రికుడు ప్రకాష్‌శర్మ ఆచూకీ కోసం విచారిస్తున్నామన్నారు. సెల్‌ఫోన్‌, సాంకేతిక పరిజ్ఞానంపై ఉన్న పట్టుతో ప్రకాష్‌శర్మ తన సిగ్నల్స్‌ దొరకకుండా జాగ్రత్తపడుతున్నాడని వివరించారు. దీన్ని తాము సవాల్‌గా తీసుకొని కేసును పలు కోణాల్లో విచారించి చేధించి బాలిక ఆచూకీ కనుగొంటామని స్పష్టం చేశారు. బాలిక విషయంలో వస్తున్న వార్తలతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చెందవదన్నారు. ఈ సమావేశంలో సీఐ మురళీ, ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-01-13T05:03:14+05:30 IST