ఫోర్జరీ సంతకాలతో బిల్డింగ్‌కు అనుమతి

ABN , First Publish Date - 2021-11-28T06:37:18+05:30 IST

ఫోర్జరీ సంతకాలతో బిల్డింగ్‌కు అనుమతి

ఫోర్జరీ సంతకాలతో బిల్డింగ్‌కు అనుమతి
సత్తుపల్లి మునిసిపాలిటీ భవనం

సత్తుపల్లి మునిసిపాలిటీలో ఓ దళారీ నిర్వాకం

కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు

సత్తుపల్లిరూరల్‌, నవంబరు 27: ఫోర్జరీ సంతకాలతో భవన నిర్మాణాలకు అనుమతులు పొందిన సంఘటనపై ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. సత్తుపల్లి మునిసిపాలిటీ పరిధిలో నకిలీ సంతకాలు, స్టాంపుల సహాయంతో భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన క్రమంలో ఓ దరఖాస్తుకు సంబంధించి తన సంతకాలు, స్టాంపులు దుర్వినియోగమైనట్లుగా భా వించిన మునిసిపల్‌ కమిషనర్‌ కే.సుజాత శనివారం మధ్యాహ్నం సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతంలో పోలీసులు ఓ వ్యక్తిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఎన్‌వీఆర్‌ కాంప్లెక్స్‌లో మనోజ్‌ కన్సల్‌టెంట్‌ పేరుతో బాణావత్‌ మనోజ్‌ అనే వ్యక్తి ఇళ్లు, ప్లాట్లకు అనుమతులు, ఇంటి నెంబర్లు తదితర అంశాలపై మునిసిపాలిటీ పరిధిలో ప్రైవేటుగా పనిచేస్తుంటాడు. గతేడాది శ్రీనివాసా టాకీస్‌ రోడ్‌కు చెందిన ఓ వ్యక్తి మొదటి అంతస్తు నిర్మాణానికి మునిసిపాలిటీలో ధరఖాస్తు చేసుకున్నారు. కన్సల్‌టెంట్‌ మనోజ్‌ మునిసిపాలిటీ నుంచి కమిషనర్‌ కే.సుజాత సంతకం, కార్యాలయ స్టాంపులతో తెలుగు భాషలో టైప్‌ చేసిన అనుమతి పత్రాన్ని అందజేశాడు. నిర్మాణం అనంతరం ఇంటి నెంబర్‌ కోసం ప్రస్తుతం ఇంటి యజమాని మునిసిపాలిటీలో దరఖాస్తు చేసుకోగా అనుమానం వచ్చిన కమిషనర్‌ తన సంతకం ఫోర్జరీ అయినట్లు గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణలో రబ్బర్‌ స్టాంప్‌ నిర్వహకుడు, కన్సల్‌టెంట్‌ నిర్వహకులను పోలీసులు విచారించారు. మనోజ్‌ కన్సల్‌టెంట్‌ నిర్వహకుడు నకిలీ స్టాంపులు, సంతకాలతో ఉదంతానికి పాల్పడటంతో అతడిపై కేసు నమోదు చేశారు. సీఐ ఏ.రమాకాంత్‌ పర్యవేక్షణలో ఎస్‌ఐ బీ.రామునాయక్‌ కేసు దర్యాప్తు చేపట్టారు. అయితే మునిసిపాలిటీకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలైనా రాత పూర్వకంగా కాకుండా ఆన్‌లైన్‌ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోగా అనుమతి పత్రాలు మ్యానువల్‌గా ఉండటంతో తన సంతకం ఫోర్జరీ అయినట్లు అనుమానం వచ్చినట్లు కమిషనర్‌ కే.సుజాత తెలిపారు. 2019 కొత్త చట్టం ప్రకారం ఇంటి నెంబర్‌, పేరు మార్పులు, భవనం అనుమతులు మాత్రమే ఇచ్చే అవకాశం ఉండటంతో ఈ నకిలీ సంతకాలు, కార్యాలయ స్టాంపులతో రూ.ఎన్ని లక్షల్లో స్వాహా అయ్యాయో విచారణలో తేలనుంది.

Updated Date - 2021-11-28T06:37:18+05:30 IST