ఇదేం పద్ధతి?

ABN , First Publish Date - 2021-12-26T05:27:43+05:30 IST

ఇదేం పద్ధతి?

ఇదేం పద్ధతి?
నగరంలో నిర్మిస్తున్న మోడ్రన్‌ ఫుట్‌పాత్‌

ఖమ్మం నగరపాలకంలో నిబంధనలకు పాతర

టెండర్లు, అగ్రిమెంట్లు లేకుండానే పనుల అప్పగింత

అత్యవసర పనులంటూ, కేటాయింపులు

పనులు కేటాయించిన తరువాతే టెండర్లు

టెండర్లు ఉండవు.. అగ్రిమెంట్లు ఉండవు.. కానీ పనులు మాత్రం కాంట్రాక్టర్లకు అప్పజెబుతారు. పనులు చేస్తుండగా, మళ్లీ టెండర్లు పిలుస్తారు. అత్యవసర పనులు అప్ప జెప్పామని మసిపూసి మారేడు కాయ చేస్తారు. ఇదీ ఖమ్మం నగరపాలక సంస్థలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పనుల తీరు.. 

ఖమ్మం కార్పొరేషన్‌, డిసెంబరు 25: వాస్తవంగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనప్పుడు టెండర్లను పిలవాలి. తక్కువకు కోట్‌ చేసిన వారికి పనులు అప్పగించాలి. ఒకటే టెండర్‌ వస్తే దానిని రద్దు చేసి, మళ్లీ టెండర్లు పిలవాలి. పనులకు అగ్రిమెంట్‌ చేయాలి. ఇవేవీ లేకుం డానే లక్షల రూపాయలకు సంబంధించిన పనులు కాంట్రాక్టర్లకు అప్పగి స్తున్నారు. నిబంధనలకు పాతర వేసి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు

అత్యవసర పనుల పేరుతో.. 

సదరు పనులు అత్యవసరమని చెబుతూ రూ.5లక్షలకు పైగా పనులను కూడా టెండర్‌, అగ్రిమెంట్‌ లేకుండానే కొందరు కాంట్రాక్టర్లకు అప్పగించటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నామినేషన్‌ కింద రూ.5లక్షల లోపు పనులను టెండర్లు నిర్వహించకుండానే కేటాయించ వచ్చు. కానీ రూ.20లక్షల విలువైన పనులను కూడా టెండర్‌ లేకుండా అప్పగించటం అనుమానాలకు తావిస్తోంది. ఒక ప్రాంతంలో అత్యవసరంగా మొక్కలు నాటడం, రహదారి ధ్వంసం అయ్యి, అత్యవసరంగా మరమ్మతులు చేయాల్సి రావటం వంటి పనులకు రూ.5లక్షల లోపు నిధులు మంజూరు చేస్తే రొటేషన్‌ పద్ధతిలో కాంట్రాక్టర్లకు నామినేషన్‌ పనుల కింద ఇవ్వవచ్చు. అయితే అవికూడా ఒకే కాంట్రాక్టర్‌కు ఇవ్వకూడదు. కానీ ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇలాంటి నిబంధనలు కనిపించవు. ఇష్టం వచ్చిన కాంట్రాక్టర్‌కు పనులు ఇస్తున్నారు. అయితే నగరపాలక సంస్థ కమిషనర్‌ చెప్పటంతో పనులు ఇస్తున్నామని ఇంజనీరింగ్‌ అధికారులు చెప్పటం గమనార్హం.

మోడ్రన్‌ ఫుట్‌పాత్‌ల నిర్మాణంలో..

నగరంలో ఐటీ హబ్‌ సెంటర్‌నుంచి జెడ్పీసెంటర్‌ వరకు ప్రయోగాత్మకంగా మోడ్రన్‌ ఫుట్‌పాత్‌లను నిర్మిస్తున్నారు. అందులో భాగంగా గ్రిల్స్‌ ఏర్పాటుకు రూ.18లక్షలు కేటాయించారు అయితే సదరు పనిని అత్యవసర పనికింద చూపించి టెండర్‌ లేకుండానే ఒక కాంట్రాక్టర్‌కు అప్పగించారు. కాగా ఫుట్‌పాత్‌ నిర్మాణాలకు మరో రూ.68లక్షలు కేటాయించారు. ఇదీ అత్యవసర పని కిందే చూపించను న్నట్లు తెలుస్తోంది. లేకుంటే ఏ కాంట్రాక్టర్‌ టెండర్లు దాఖలు చేయ కుండా సదరు కాంట్రాక్టర్‌కే పనులు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే సదరు కాంట్రాక్టర్‌కే టెండర్‌ దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ట్యాంక్‌బండ్‌పై సీసీ కెమెరాల ఏర్పాటులోనూ టెండర్లు పిలవకుండానే అత్యవసరపని కింద చూపించారు. తరువాత పనులు చేసిన వారికే టెండర్లు దక్కేలా చేశారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా పనులు కేటాయించటంతో వాటి నాణ్యత విషయంలో పలు అనుమానాలు కలుగుతున్నాయి.

Updated Date - 2021-12-26T05:27:43+05:30 IST