న‘మీన’ శిక్షణ

ABN , First Publish Date - 2021-02-02T05:23:14+05:30 IST

రాష్ట్రప్రభుత్వం మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని సైతం ప్రారంభించింది.

న‘మీన’ శిక్షణ
కేజ్‌కల్చర్‌ విధానాన్ని పరిశీలిస్తున్న విద్యార్థులు

 పాలేరు మత్స్యపరిశోధనా కేంద్రంలో  వనపర్తి జిల్లా పెబ్బేరు  కళాశాల విద్యారులకు ప్రాక్టికల్స్‌

 వివిధ అంశాల్లో 90 రోజుల పాటు కొనసాగనున్న ట్రైనింగ్‌

కూసుమంచి, ఫిబ్రవరి 1: రాష్ట్రప్రభుత్వం మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని సైతం ప్రారంభించింది. పెరుగుతున్న జనాభాకు అనుగునంగా చేపల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని వివిధ జిల్లాలోని ప్రధాన జలాశయాలలో చేపల ఉత్పత్తి పెంచి కొరత తీర్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలో చెరువుల ద్వారా చేపల పెంపకం చేస్తున్నవారికి, చేపల పెంపకం ప్రారంభించాలని ఆశించేవారికి చేపల పెంపకం మీద పూర్తి అవగాహన కల్పించాలనే ఉద్ధేశంతో పాలేరులోని మత్స్య పరిశోధనాస్ధానంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్న సంగతి తెలిసిందే. యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్‌పై ఔత్సాహికులకు వృత్తినైపుణ్య శిక్షణ ఇస్తున్నారు.

పబ్బేరు మత్స్య కళాశాల విద్యార్థులకు 90 రోజుల శిక్షణ

రాష్ట్రంలోని ఏకైక మత్స్య కళాశాల వనపర్తి జిల్లా పెబ్బేరులో ఉంది. నాలుగు సంవత్సరాలక్రితం ఏర్పాటుచేశారు. నాలుగు సంవత్సరాల కోర్సు పూర్తయిన మొదటి బ్యాచ్‌ విద్యార్థులు ప్రాక్టికల్స్‌ నిమిత్తం 90 రోజుల శిక్షణలో భాగంగా ఇక్కడకు వచ్చారు. మరో వారం రోజుల్లో శిక్షణ పూర్తికానుంది. చేపలు పట్టడం దగ్గరి నుంచి వాటిని పెంపకం, నిల్వ, మార్కెటింగ్‌ నైపుణ్యాల దాక ప్రతి అంశంలోను విద్యార్థులు మెళకువలు సాధించనున్నారు. చేపపిల్లల ఉత్పత్తి, పెంపకం, చేపలకు సంక్రమించే వ్యాధులు, వాటి నివారణ, నీటియాజమాన్య పద్ధతులు, దాణా తయారీ వంటి అంశాలతో పాటు జలాశయంలోని కేజ్‌కల్చర్‌ (పంజరవల) విధానంలో చేపల పెంపకం, ఆధునిక పద్దతులలో చేపల వ్యాపారం, తదితర అంశాలలో సీనియర్‌ సైంటిస్ట్‌ విద్యాసాగర్‌రెడ్డి ఆధ్వర్యంలోని మత్స్యశాఖ కేవీకే శాస్త్రవేత్తలు, అధికారులు సవివరంగా తెలియజేశారు. అంతేకాకుండా మత్స్యకారులకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, చేపల పెంపకం కోసం బ్యాంకులు అందిస్తున్న రాయితీలపై సలహాలు ఇస్తున్నారు.  పాలేరు మత్స్య పరిశోధనాకేంద్రంలో పెబ్బేరు మత్స్యకళాశాల విద్యారులకు 90 రోజులుగా ఇస్తున్న శిక్షణ త్వరలో ముగుస్తుంది. ఈశిక్షణ ద్వారా విద్యార్ధులు చేపల పెంపకానికి, మత్స్యకారులకు సలహాలు సూచనలు ఇవ్వడానికి, ఉపయోగపడుతుంది. 

మత్స్యశిక్షణ చాలా బాగుంది: ప్రసన్నలక్ష్మి, యాదాద్రి జిల్లా

పాలేరు మత్స్యపరిశోధనాకేంద్రంలో ఇస్తున్న శిక్షణ చాలా బాగుంది. ఇక్కడ చేపల ఉత్పత్తిపై అనేక అంశాలు ప్రయోగాత్మకంగా నేర్చుకున్నా. నేర్చుకున్న అంశాలను మత్స్యకారులకు అందించేందుకు కృషి చేస్తా. భవిష్యత్తులో మత్స్యఅభివృద్ధికి నావంతు తోడ్పడుతా.

మత్స్యకారులకు అవగాహన కల్పిస్తా: ఎ. ప్రీతి, నల్లగొండ

చేపపిల్లల ఉత్పత్తి, పద్ధతులు, పెంపకంలో మెళకువలువ్యాధి నిర్ధారణ, కేజ్‌కల్చర్‌, వలల తయారీ గురించి క్షుణ్నంగా తెలుసుకున్నాను. రాష్ట్రంలో గల జలవనరులను ఉపయోగించి మత్స్యసంపదను అభివృద్ధి చేసేలా నలుగురికి ఉపయోగపడేలా ప్రయత్నిస్తాను

 ఉద్యోగావకాశాలు కల్పించాలి: డి.మానస, నల్లగొండ

మత్స్య ఉత్పత్తిపై శిక్షణ తీసుకున్నందున మాకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగావకాశాలు కల్పించాలి. రాష్ట్రంలోని జనాభా అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన చేపల ఉత్పత్తికి నా వంతు కృషిచేస్తా. దీనితో పలువురికి ఆర్థిక తోడ్పాటు లభించనుంది.

Updated Date - 2021-02-02T05:23:14+05:30 IST