‘పోడు’కు పట్టాలు సాధించే వరకు పోరాటం

ABN , First Publish Date - 2021-08-11T05:10:03+05:30 IST

ఆదివాసీ గిరిజనులు ఎన్నో ఏళ్లుగా అడవుల్లో సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు సాధించే వరకు తమ పోరాటం ఆగదని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహయ కార్యదర్శి పోటు రంగారావు పేర్కొన్నారు.

‘పోడు’కు పట్టాలు సాధించే వరకు పోరాటం
ఖమ్మంలో పాదయాత్ర నిర్వహిస్తున్న ఎన్డీ నాయకులు,పోడు సాగుదారులు

కందకాలు, హరితహరం మెక్కలు వేయడం అపాలి

సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు

ఖమ్మంలో పోడు పరిరక్షణ పాద యాత్ర

కదంతొక్కిన గిరిజనులు.. ఎరుపుమయమైన నగరం

ఖమ్మం మయూరిసెంటర్‌,ఆగస్టు 10: ఆదివాసీ గిరిజనులు ఎన్నో ఏళ్లుగా అడవుల్లో సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు సాధించే వరకు తమ పోరాటం ఆగదని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహయ కార్యదర్శి పోటు రంగారావు పేర్కొన్నారు. పోడు భూముల సమస్యల పరిష్కారం, పోడురైతులకు పట్టాలు ఇవ్వాలన్న డిమాండ్లతో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం నుంచి కలెక్టరేట్‌ వరకు న్యూడెమోక్రసీ, ఏఐకెఎంఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం పోడుపరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం కలెక్టరేట్‌ వద్ద ధర్నాచౌక్‌లో జరిగిన సభలో పోటు రంగారావు మాట్లాడుతూ పోడు చేసుకుంటున్న భూముల్లో ప్రభుత్వం హరితాహారం పేరుతో అక్రమంగా మొక్కలు నాటుతూ, గిరిజనులపై అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. ఈ చర్యలను తీవ్రంగా తిప్పి కొట్టి.. పోడు సాగుదారులకు అండగా ఉంటామన్నారు. అడవిలో పుట్టి పెరిగిన వారికి ఆ భూములకు హక్కులు కల్పించాల్సింది పోయి ఆక్రమణదారులంటు వారిని జైళ్లకు పంపడం దారుణమన్నారు. సత్తుపల్లి మండలం రేగళ్లపాడులో 25ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను దున్నకుండా ఫారెస్టు ఆదికారులు అడ్డుకుంటున్నారని, గిరిజన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్‌లో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్లో పత్తి పంటను ధ్వంసచేయడమే కాకుండా, నిర్బంధాలకు గురి చేస్తున్నారు. ఆదివాసీలు చేసిన సుదీర్ఘ పోరాటాల వల్లే 2006లో ఆటవీ హక్కుల చట్టం వచ్చిందని, ఆ చట్టం ప్రకారం ప్రతీ ఆదివాసి కుటుంబానికి పదెకరాలకు హక్కులు కల్పించాలన్నారు. కానీ ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఓపెన్‌కాస్టులు వివిధ రకాల గనులు, రోడ్ల వెడల్పు తదితర పనుల పేరుతో లక్షల ఎకరాల అడవులు విధ్వంసానికి అనుమతులిస్తున్న ప్రభుత్వాలు తరతరాలుగా ఇవే భూములను నమ్ముకున్న పేదలపై దౌర్జాన్యం చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ఆదివాసీలకు మూడెకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్‌ హమీ అమలు చేయాలని, అడవుల రక్షణపెంపునకు ఆదివాసీలపై దాడులు ఆపాలని డిమాండ్‌ చేశారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఏఐకెఎంఎస్‌ జాతీయ నాయకులు రాయల చంద్రశేఖర్‌, ఎన్డీ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వర్లు, ఆవుల అశొక్‌, జి.రామయ్య, అర్జున్‌రావు, సీవై పుల్లయ్య, శిరోమణి, ఘాన్సీ, మంగతాయి, అజాద్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. పోడు సమస్యపై పాదయాత్ర నిర్వహించిన ఎన్డీ నాయకులకు తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టు యూనియన్‌ (టీయూడబ్ల్యూజే) నాయకులు సంఘీభావం తెలిపారు.

Updated Date - 2021-08-11T05:10:03+05:30 IST