బల్దియాలో బరితెగింపు!

ABN , First Publish Date - 2021-11-22T05:07:04+05:30 IST

ఓ వైపు ఖమ్మం నగరం వేగంగా విస్తరిస్తోంటే.. మరో వైపు దానికి తగ్గట్టుగానే అక్రమ నిర్మాణాలూ పెరిగిపోతున్నాయి. కార్పొరేషన్‌ నుంచి అనుమతులు పొందుతున్న వారిలో కొందరు అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా భవంతుల నిర్మాణాలు చేస్తున్నారు. అనుమతుల్లో ఒకలా.. క్షేత్రస్థాయిలో మరోనా ఉంటున్నా

బల్దియాలో బరితెగింపు!
వైరారోడ్డులోని ఓ భవనం సెల్లార్‌లోనూ షట్టర్లు వేసి ఉన్న దృశ్యం.

అనుమతుల్లో ఒకటి... చేసేది మరొకటి

పేపర్లో ఒక ఫ్లోర్‌.. నిర్మించేది నాలుగు ఫ్లోర్లు

నివాసాలకు బదులు షాపింగ్‌ కాంప్లెక్స్‌లు

తొలగించినా మళ్లీ అదేవిధంగా నిర్మాణాలు

నోటీసులతోనే సరిపెడుతున్న కార్పొరేషన్‌ అధికారులు

ఖమ్మం, నవంబరు21 (ఆంధ్రజ్యోతి): ఓ వైపు ఖమ్మం నగరం వేగంగా విస్తరిస్తోంటే.. మరో వైపు దానికి తగ్గట్టుగానే అక్రమ నిర్మాణాలూ పెరిగిపోతున్నాయి. కార్పొరేషన్‌ నుంచి అనుమతులు పొందుతున్న వారిలో కొందరు అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా భవంతుల నిర్మాణాలు చేస్తున్నారు. అనుమతుల్లో ఒకలా.. క్షేత్రస్థాయిలో మరోనా ఉంటున్నా.. అధికారులు నోటీసులు జారీ చేసినా.. పలుమార్లు అక్రమ నిర్మాణాలు కూల్చివేసినా.. అవేమీ పట్టనట్టుగా యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతూనే ఉన్నారు. అయితే ఆయా అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులే వారికి వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అనుమతుల్లో ఒకటి... చేసేది మరొకటి..

నగరపాలకంలో అనుమతులు పొందే సదరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వ్యక్తులు అనుమతుల్లో ఒకటి చూపి.. నిర్మాణాలు మాత్రం ఇష్టారీతిగా చేస్తున్నారు. అపార్ట్‌మెంటు నిర్మించేందుకు అనుమతులు పొందుతున్న కొందరు వ్యక్తులు అందులో ఏకంగా కమర్షియల్‌ కాంప్లెక్సులనే నిర్మిస్తుండగా... మరికొందరు స్టిల్‌ ఫ్లోర్‌ పార్కింగ్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి అంతస్తు అంటూ బిల్డింగ్‌ నిర్మించుకునేందుకుగాను మున్సిపల్‌ శాఖ నుంచి అనుమతులు పొంది ఏకంగా నాలుగైదు ఫ్లోర్లు నిర్మాణాలు చేపడతున్నారు.. అంతేనా ఇంకొందరు అయితే పైన పెంట్‌హౌజ్‌ల పేరుతో పెద్ద పెద్ద నిర్మాణాలే చేపడుతున్నారు. అంతేకాదు నగరంలోని పలు భవనాలు నిర్మించే స్థలాలు వివాదంలో ఉన్నా గతంలో మున్సిపల్‌ శాఖ వారు అనుమతులు మంజూరు చేయడంతో కోర్టు నుంచి మొట్టికాయలు వేయించుకున్న సంఘటనలున్నాయి. వాస్తవానికి భవన నిర్మాణానికి సంబంధించి అనుమతులు మంజూరు చేసేముందు ఆ భవనం నిర్మిస్తున్న స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లతోపాటు, సర్వే,  విచారణ జరిపి అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ అలాంటివేమీ లేకుండానే కోర్టులో వివాదంలో ఉన్న సదరు స్థలంలో భవనానికి అనుమతులు మంజూరు చేసిన సంఘటనలు లేకపోలేదు. అయితే దరఖాస్తులో పేర్కొన్న విధంగా భవన నిర్మాణాలు జరగనప్పటకీ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులిచ్చిన తర్వాత కనీసం ఆయా నిర్మాణాలు వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదన్న విమర్శలున్నాయి. నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఇంటి నెంబర్ల కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో మాత్రమే ఆయా బిల్డింగుల దగ్గరకు తమ కిందిస్థాయి వారిని పంపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన సదరు వ్యక్తుల నుంచి భారీగానే మామూళ్లు అందుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నివాసాలకు అనుమతులు పొంది షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించి, ఇతరులకు కమర్షియల్‌గా వాడుకునేందుకు ఇస్తున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. 

సెల్లార్లలోనూ షట్టర్ల ఏర్పాటు..

నగరమైనా, పట్టణమైనా వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రులు, ఫంక్షనహాళ్లు లాంటి వాటివద్ద కచ్చితంగా పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ప్రధాన రహదారులైన వైరా రోడ్డు, బోనకల్లు రోడ్డు, ఇల్లెందు రోడ్డు లాంటి ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. భవనాల యజమానులు అనుమతులు తీసుకునే సమయంలో ఆయా సెల్లార్లను పార్కింగ్‌ కోసం చూపించి ఆ తర్వాత వాటిని కూడా వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నారు. దీంతో సంబంధిత భవనాల వద్ద ఏర్పాటు చేసిన వాణిజ్య సముదాయాల్లో వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు పార్కింగ్‌ స్థలం లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. ఫలితంగా రోడ్ల విస్తరణ జరిగినా ట్రాఫిక్‌ ఇబ్బందులు మాత్రం తొలగడం లేదు. అయితే ఆయా విషయాలను అధికారులు ఎందుకు గుర్తించడం లేదన్న ప్రశ్నలు జనం నుంచి ఎదురవుతున్నాయి. అధికారులు పార్కింగ్‌ విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టకపోగా.. రోడ్డు పక్కన వాహనం నిలిపితే పోలీసులు చలానాలు విధిస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై గతంలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టిన అధికారులు సుమారు 80కి పైగా సెల్లార్లలో షట్టర్లు ఏర్పాటు చేసిన భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు. అయితే ఆ తర్వాత వాటిని కనీసం పట్టించుకోలేదన్న వాదన వినిపిస్తోంది. 

అధికారుల నిర్లక్ష్యమే కారణమా.?

ఖమ్మం నగరంలో అక్రమ నిర్మాణాలు రోజురోజుకు పెరగడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు తీసుకున్న ప్రకారం బిల్డింగ్‌లు నిర్మిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఎవరికి వారు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్న అభిప్రాయాలున్నాయి. ఇలా ఒకరిని చూసి మరొకరు ఇష్టారీతిన ఇళ్ల నిర్మాణాలు చేయడంతో నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు కోకొల్లలుగా పెరిగిపోయాయనే విషయం స్పష్టమవుతోంది. చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా అది క్షేత్ర స్థాయిలో కనిపించని పరిస్థితులున్నాయి. అంతేకాదు కొందరి అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణాల అనుమతుల విషయంలో అధికారులకు ముడుపులు భారీగానే అందుతున్నాయని, ఆ కారణంగానే వారు నోటీసులతోనే సరిపెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అనుమతులు ఒక విధంగా పొంది అంతకు మించిన అక్రమంగా నిర్మించిన భవంతులను గుర్తించిన అధికారులు కేవలం ఒక భవంతినే కూల్చి మిగతా వారికి నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకొన్నారన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నగరంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-11-22T05:07:04+05:30 IST