పొలానికి నీరు కడుతుండగా విద్యుదాఘాతం

ABN , First Publish Date - 2021-11-27T04:34:51+05:30 IST

పొలానికి నీరు పెడుతున్న క్రమంలో విద్యుతాఘాతంతో ఓ మహిళారైతు మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పింజరమడుగు గ్రామంలో శుక్రవారం జరిగింది.

పొలానికి నీరు కడుతుండగా విద్యుదాఘాతం

 ఎర్త్‌వైర్‌ తగిలి మహిళా రైతు మృతి  

  కామేపల్లి మండలంలో ఘటన

కామేపల్లి, నవంబరు 26 : పొలానికి నీరు పెడుతున్న క్రమంలో విద్యుతాఘాతంతో ఓ మహిళారైతు మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పింజరమడుగు గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన ఆళ్లకుంట రమాదేవి(44) తమ పొలంలో వేసిన మిరపతోటకు శుక్రవారం ఉదయం నీరు పెట్టేందుకు వెళ్లింది. అయితే విద్యుత్‌ స్తంభం మెయిన్‌ తీగలు తెగి ఎర్త్‌ వైర్‌ ఆనుకోగా.. దానిని గుర్తించని రమాదేవి నీరు పెడుతూ ఆ ఎర్త్‌వైరును పట్టుకుంది. దీంతో విద్యుత్‌ సరఫరా అయ్యి రమాదేవి అక్కడిక్కడే మృతి చెందింది. ఆమెకు భర్త, కూతురు, కుమారుడు ఉన్నారు. కామేపల్లి ఎస్‌ఐ లక్ష్మీభార్గవి సంఘటనాస్థలాన్ని వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి, పంచానామా నిర్వహించారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే రమాదేవి ప్రాణం పోయిందని కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించడంతో కారేపల్లి సీఐ ఆరీఫ్‌ అలి విద్యుత్‌ అధికారులు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆమె కుటుంబానికి విద్యుత్‌ శాఖ తరుపున రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనలో విద్యుత్‌ డీఈ, ఏడీ, ఏఈ, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-11-27T04:34:51+05:30 IST