దుర్గమ్మా పాహిమాం

ABN , First Publish Date - 2021-10-08T05:00:47+05:30 IST

దుర్గమ్మ.. పాహిమాం..పాహిమాం అంటూ అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం నియోజకవర్గాలవ్యాప్తంగా దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. కరోనా నేపధ్యంలో గతేడాది ఉత్సవాలు అంతంత మాత్రంగానే నిర్వహించారు.

దుర్గమ్మా పాహిమాం
అశ్వారావుపేటలో దుర్గమ్మకు పూజలు నిర్వహిస్తున్న భక్తులు

ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం

మండపాలలో కొలువుదీరిన అమ్మవార్లు

శ్రీంగాపురంలో అడిషనల్‌ కలెక్టర్‌, భద్రాచలంలో ఏఎస్పీ పూజలు

అశ్వారావుపేట రూరల్‌/ దమ్మపేట/ దుమ్ముగూడెం/ మణుగూరు/ భద్రాచలం/ కరకగూడెం/ బూర్గంపాడు అక్టోబరు 7: దుర్గమ్మ.. పాహిమాం..పాహిమాం అంటూ అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం నియోజకవర్గాలవ్యాప్తంగా దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. కరోనా నేపధ్యంలో గతేడాది ఉత్సవాలు అంతంత మాత్రంగానే నిర్వహించారు. కరోనా తగ్గుముఖం పట్టటంతో ఈసారి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. మండల వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అమ్మవారి విగ్రహాలను అధిక సంఖ్యలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమిచ్చేందుకు అందంగా అలంకరించిన మండపాల్లో కొలువుదీరారు. గిరిజన గ్రామాల్లో వేడుకలను అత్యంత ఆనందోత్సాహాల మధ్య ప్రారంభించుకున్నారు. అశ్వారావుపేటలోని జంగారెడ్డిగూడెం రోడ్‌లో గల శ్రీషిర్డీసాయిబాబా మందిరంలో ఉదయం 8గంటలకు అమ్మవారిని ప్రతిష్టించి విఘ్నేఽశ్వర పూజ, పుణ్యహవాచనం, పంచగన్యప్రాసన, దీక్షాధారణ, అఖండ దీపారాధన, నవగ్రహారాధన, నవదుర్గల ఆవాహన, కలశస్థాపన, నీరాజన మంత్రపుష్పాలతో పాటు పలు రకాల పూజలను నిర్వహించారు. మొదటిరోజు అమ్మవారు స్వర్ణకవచదుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. నారంవారిగూడెంలోని విజయదుర్గాదేవి ఆలయంలో మహిళలు సామూహిక కుంకుమ పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు బండి పుల్లారావు దంపతులు ప్రత్యేక పూజలు జరిపారు. జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు శ్రీరంగాపురంలోని ఆలయంలో జరుగుతున్న పూజల్లో పాల్గొన్నారు. 

దమ్మపేట, గణేష్‌పాడు గాయత్రిమాత ఆలయం, శ్రీవిజయాదుర్గ అమ్మవారి ఆలయంలో గురువారం దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు గురువారం అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నిర్మాణదాతలు గారపాటి సూర్యనారాయణ, అనురాధ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా ఉత్సవాలలో బాగంగా పలువురు భక్తులు మాలధారణ చేశారు. గాయత్రిమాత ఆలయంలో గురూజి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పార్కలగండిలో  దసరా ఉత్సవాలలో బాగంగా దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సర్పంచ్‌ కొర్సా సాగర్‌ బాబు దంపతులు దుర్గాదేవికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

గురువారం భద్రాచలంలోని వివిధ మండపాల్లో అమ్మవార్లు కొలువుదీరారు. పట్టణంలోని ఆర్టీసీ ఇన్‌గేటు సమీపంలో ఉన్న కనకదుర్గా ఆలయంలో స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భద్రాచలం ఏఎస్‌పీ డాక్టర్‌ జి. వినీత్‌ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో జి.వేణుగోపాల్‌గుప్తా, అర్చకులు ఎస్‌.విశ్వనాఽథం ఏఎస్‌పీకి ఘన స్వాగతం పలికారు. అంబాసత్రం, వాసవీమాత ఆలయం, లలితా పరమేశ్వరి ఆలయాల్లో అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. 

దుమ్ముగూడెంలో గంగోలు కాళికామాత ఆలయంతోపాటు, లక్ష్మీనగరం, సీతారాంపురం, పర్ణశాల, దుమ్ముగూడెంలో దసరా నవరాత్రులను గురువారం ఘనంగా ప్రారం భించారు. ఈ సందర్భంగా కనకదుర్గ అమ్మవారికి అత్యంత వైభవోపేతంగా పూజలు జరిపించారు. బాలాత్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శన మిచ్చారు. కార్యక్రమాల్లో అర్చకులు ఆరుట్ల రాజగోపాలాచార్యులు, రాఘవాచార్యులు శాస్త్రోపేక్తంగా పూజలు నిర్వహించారు. 

విజయ దశమిని పురస్కరించుకుని మణుగూరు మండలంలోని గుట్టమల్లారంలో పంచముఖ వేదగాయత్రీ దేవి ఆలయంలో అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభించారు. ఈ నవరాత్రోవాలు 15 వరకు నిర్వహిస్తామని ఆలయ వ్యవస్ధాపకులు దయానిధి వసంతాచార్యులు తెలిపారు. 12న సామూహిక అక్షరాభ్యాసాలు, 13న చండీహోమం నిర్వహిస్తామన్నారు.

కరకగూడెం మండలంలోని రాళ్లవాగులో దుర్మమ్మను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఆలయ పూజారి నరసింహాచార్యులు ప్రత్యేక పూజలు చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నవీన్‌, లింగస్వామి, అవినాష్‌, కిరణ్‌, పృథ్వీరాజ్‌, శ్రీధర్‌, మోహంత్‌క పాల్గొన్నారు.

బూర్గంపాడు మండల పరిధిలోని సాకేతపురి వర్తక సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం దసరా ఉత్సవాల్లో భాగంగా విఘ్నేశ్వరపూజ, కలశస్ధాపన, విగ్రహప్రతిష్ట జరిపించి భక్తులకు తీర్థప్రపసాదాలు ఆందజేశారు. సారపాక బసప్పక్యాంపులో జరిగిన ఉత్సవాల్లో ఐటీసీ హెచ్‌ఆర్‌ జీఎం శ్యామ్‌కిరణ్‌ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో రమేష్‌, చెంగలరావు, కిషోర్‌, రత్నారెడ్డి, శేషిరెడ్డి, శంకర్‌రెడ్డి, రామారావు, ఆశోక్‌రెడ్డి సాకేతపురి వర్తకసంఘం ఉత్సవకమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యం, కామేశ్వరరావు, లక్ష్మీనారయణ, మురళీ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-08T05:00:47+05:30 IST