కదులుతున్న డొంక

ABN , First Publish Date - 2021-10-07T06:14:26+05:30 IST

కదులుతున్న డొంక

కదులుతున్న డొంక
డీఆర్‌డీఏ కార్యాలయం

ఢిల్లీ పోలీసుల రాకతో ఆర్‌ఎంకే రుణాల వ్యవహారంపై తీవ్ర చర్చ

నేడు తొమ్మిది మండలాల ఏపీఎంలతో ఖమ్మం డీఆర్‌డీవో విచారణ

ఖమ్మం సంక్షేమ విభాగం, అక్టోబరు 6: ఉమ్మడి జిల్లాలోని మహిళ స్వయం సహాయక సంఘాలకు 2006-07లో మంజూరైన రాష్ట్రీయ మహిళ కోష్‌ రుణాల తిరిగి చెల్లింపుల డొంక కదులుతోంది. గత మండల సమాఖ్యలకు ఢిల్లీ పోలీసులు కోర్టు రిమాండ్‌తో తిరుమలాయపాలెం రావడంతో 15ఏళ్ల క్రితం మూలనపడిన ఈ వ్యవహారం మరోసారి చర్చ నీయాంశమైంది. తిరుమలాయపాలెంతో పాటు ఖమ్మం జిల్లాలో మరో 8మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు మండలాలు.. మొత్తం 14మండలాల్లో గతంలో మంజూరు జరిగిన రుణాలపై విచారణ మొదలైనట్టు తెలుస్తోంది. 

ఖమ్మం జిల్లాలో నేడు విచారణ

తిరుమలాయపాలెం మండలంలో గతంలో పనిచేసిన మండల సమా ఖ్య అధ్యక్షురాలు, కోశాధికారికి ఢిల్లీ కోర్టు నుంచి రిమాండ్‌ నోటీసులతో పోలీసులు రావటంతో ఆ దిశగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి మెరుగు విద్యాచందన విచారణ ప్రారంభించారు. బుధవారం ప్రాథమిక సమాచారం సేకరించారు. వీరితో పాటు గురువారం సత్తుపల్లి, చింత కాని, కామేపల్లి, తిరుమలాపాలెం, ముదిగొండ, వేంసూరు, మదిర, బోన కల్లు, ఖమ్మంరూరల్‌ మండలాల ఏపీఎంలతో ఖమ్మం డీఆర్‌డీవో విచా రణ నిర్వహించనున్నారు.ఈ మేరకు 2006-07లో రాష్ట్రీయ మహిళా కోష్‌ రుణాలు తీసుకున్న వారి జాబితా, ఎంతకాలం తిరిగి చెల్లించారు, ఇంకా చెల్లించాల్సిన అసలు రుణాలు, వడ్డీలు, తదితర వివరాలతో ఆయా మండలాల కు ఖమ్మం డీఆర్‌డీఏ నుంచి నమూనాలను పంపారు. పూర్తి స్థాయి సమాచారంతో రావాలని డీఆర్‌డీవో విద్యాచందన ఆదేశించారు.

రుణాల మాఫీ జరుగుతాయనే..

2006-07లో మంజూరైన రాష్ట్రీయ మహిళ కోష్‌ రూ.1వడ్డీ రుణాలను 2008వ సంవత్సరం నుంచి సక్రమంగా తిరిగి చెల్లింపులు జరిగాయి.  ఈ క్రమంలోనే 2017వరకు కొన్ని మండల సమాఖ్యలు షెడ్యూల్‌ ప్రకారం రుణాలను చెల్లించారు. అయితే ఆ తర్వాత వచ్చిన సాధారణ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు జరిగిన రుణాలు మాఫీ జరుగుతా యని ప్రచారం జరగడంతో కొన్ని మహిళా సమాఖ్యలు గ్రామ సమాఖ్యల నుంచి సేకరించిన రుణాలచెల్లింపులను మండల సమాఖ్యలు తిరిగి చెల్లించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ రుణాలు మాఫీ జరిగితే అప్పటివరకు సేకరించిన రుణాలడబ్బులను దుర్వినియోగం చేసే ఆలోచన చేసినట్టు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖలో చర్చ జరుగుతోంది. 

జిల్లా అధికారుల నిర్లక్ష్యంతో ఢిల్లీ కోర్టు రిమాండ్‌ వరకు

మహిళా స్వయం సహాయక సంఘాలు ఎలాంటి రుణాలను తీసుకున్న వాటిని సక్రమంగా రికవరీ చేసేందుకు గ్రామ మహిళ స్వయం సహాయక సంఘాల నుంచి డీఆర్‌డీఏ వరకు అధికారులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రామ సమాఖ్యల నుంచి జిల్లా సమాఖ్యల వరకు బాధ్యులను కేటాయిస్తారు. ఎక్కడైనా ఓ మహిళ సభ్యురాలు ఒక నెల డబ్బులు చెల్లించకుంటే ఆ గ్రామ సమాఖ్యల సభ్యులు పెద్ద రాద్దాంతమే చేస్తారు. దీంతో సభ్యులు తప్పనిసరిగా తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు ఆర్థిక ప్రణాళికలు చేసుకుంటారు. అయితే 2017నుంచి రాష్ట్రీయ మహిళ కోష్‌ రుణాలు తిరిగి చెల్లింపులు నిర్వహించకపోవటంతో పలుమార్లు ఆ విభాగం నుంచి మండల సమాఖ్యలకు నోటీసులు వచ్చాయి. అయితే ఆ నోటీసులను మాత్రం ఎందుకు గోప్యంగా ఉంచారనే విషయం తెలియాల్సి ఉంది. రుణాల తిరిగి చెల్లింపులపై జిల్లా స్థాయిలోని సెర్ప్‌ విభాగం అధికారులు సరైన కార్యాచరణ లేకపోవడంతో ఎంతో ఆదర్శంగా మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేసిన మహిళలు ఢిల్లీ కోర్టు ఎదుట ఆర్థిక నిందితులుగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళా స్వయం సహాయక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - 2021-10-07T06:14:26+05:30 IST