వసూళ్ల పండుగ

ABN , First Publish Date - 2021-11-01T04:45:01+05:30 IST

వసూళ్ల పండుగ

వసూళ్ల పండుగ
ఇటీవల ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ మైదానంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తున్న ఏసీపీ ఆంజనేయులు

అధికారుల పేరిట దీపావళి మామూళ్లు

అనుమతులు కావాలంటే డబ్బు చెల్లించాల్సిందే

సమావేశం ఏర్పాటు చేసి మరీ బహిరంగంగా హుకుం

ప్రతి సంవత్సరం ఇదే తంతు.. 

పట్టించుకోని అధికారులు

ఖమ్మం, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): ‘‘మేమింతే.. మారమంతే.. ఎవరు ఏం చేస్తే మాకేంటి. మా పని మేం చేసుకుంటూ పోతాం.. మీ దుకాణానికి లైసెన్స్‌ కావాలంటే నగదు చెల్లించాల్సిందే’’. ఇదీ దీపావళి బాణసంచా దుకాణాల ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుతం జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలో జరుగుతున్న వసూళ్ల తీరు. దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారుల నుంచి లైసెన్స్‌ ఫీజు ఇంత, నోటరీకి ఇంత, దుకాణం ఏర్పాటు చేసేందుకు కొంత, అధికారులకు మామూళ్లు ఇవ్వడానికి మరికొంత.. వెరసి మొత్తం రౌండ్‌ ఫిగర్‌ చెప్పి మరీ వసూళ్లకు పాల్పడు తున్నారు కొందరు వ్యక్తులు.. ఆ సొమ్ము చెల్లించని వారికి దుకాణాల లైసెన్స్‌ రాదని బెదిరింపులకు పాల్పడి మరీ వసూళ్లకు పాల్పడటం సదరు వ్యక్తులకు పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా గతంలో ఆయా వసూళ్లకు పాల్పడిన వారే ఈ సంవత్సరం కూడా అదే తరహాలో వసూళ్లు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఈ ఏడాది ప్రత్యేకంగా అసోసియేషన్‌ ఏర్పాటు  

దసరా మరుసటిరోజు నుంచే దీపావళి పండుగ హడావుడి ప్రారంభమవుతుంది. అప్పటినుంచే వ్యాపారులు ఏర్పాట్లు ప్రారంభించారు. మరో నాలుగు రోజుల్లోనే దీపావళి ఉండగా దుకాణాలు నిర్వహించే వ్యాపారులు ఆయా దుకాణాలకు సంబంధించి షెడ్ల ఏర్పాటుకు కావాల్సిన పనులు దాదాపు పూర్తి చేసుకున్నారు. నేడో, రేపో దుకాణాలను కేటాయించేందుకు డ్రా కూడా తీయనున్నారు. అయితే గత సంవత్సరం వరకు దీపావళి బాణసంచా వ్యాపారులకు ప్రత్యేకంగా అసోసియేషన్‌ ఏమీలేదు. ఎవరో ఒకరిపేరుమీద మైదానం అనుమతి పొందేవారు. కానీ సంవత్సరం మాత్రం బాణసంచా వ్యాపారుల పేరిట ప్రత్యేకంగా ఓ అసోసియేషన్‌ ఏర్పాటు చేశారు. 

అధికారుల పేరిట అక్రమ వసూళ్లు 

టపాసుల వ్యాపారుల నుంచి అసోసియేషన్‌లోని కొందరు వ్యక్తులు అధికారులకు మామూళ్లు ముట్టజెప్పాలనే సాకుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఈ వసూళ్లను ఏటా ఒక తంతుగా సాగిస్తున్న సదరు నిర్వాహకులు ఈ సంవత్సరం కూడా మొదలుపెట్టినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఒక్కో వ్యాపారి నుంచి చలానాకు రూ.2,500, నోటరీ కోసం రూ.1,200, దుకాణం షెడ్డు ఏర్పాటు చేసేందుకు రూ.16వేలు వసూలు చేస్తుండగా అదనంగా అధికారులకు మామూళ్లు ముట్టజెప్పాలంటూ రూ.17వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రతిసంవత్సరం జిల్లా వ్యాప్తంగా 180 వరకు బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేస్తుండగా, ఒక్క ఖమ్మం నగరంలో దాదాపు 105 దుకాణాల ఏర్పాటు చేస్తారు. ఆయా షాపుల యజమానుల నుంచి మొత్తం రూ.20 లక్షల వరకు వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఉన్నతస్థాయి అధికారుల నుంచి శాఖల వారీగా పోలీస్‌, ఫైర్‌, మునిసిపాలిటీ, ఆర్డీవో కార్యాలయంతో పాటుగా మీడియా పేర్లు చెప్పి వసూలు చేసినట్టు సమాచారం. అయితే గత సంవత్సరం వరకు గుట్టుగా సాగిన ఈ వసూళ్ల వ్యవహారం ఈ సంవ త్సరం అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే బహిరంగంగా సమావేశం ఏర్పాటు చేసిమరీ రూ.17వేలు మామూళ్లగా నిర్ణయించడం గమనార్హం. అయితే ఏటా వసూలు చేస్తున్న ఆ నగదు ఎక్కడికి వెళుతుందో అర్థం కావట్లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గతంలో పోలీసు అధికారులు చివాట్లు పెట్టినా..

అయితే దీపావళి దుకాణాల మామూళ్ల వ్యవహారంలో గతంలో కొందరిని పోలీసు ఉన్నతాధికారులు పలుమార్లు పిలిపించి వార్నింగ్‌ ఇచ్చిన సందర్భాలున్నాయి. అయితే ఆయా వ్యక్తులే ప్రస్తుతం కూడా వసూళ్లకు పాల్పడుతు న్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా గతేడాది ఇవ్వాల్సిన పెండింగ్‌ మామూళ్లు కూడా ఈ సంవత్సరం ఇవ్వాలని హుకుం జారీ చేయడం గమనార్హం. ఏటా యథేచ్ఛగా ఈ దందా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వసూలు చేస్తున్న నగదు నిజంగానే అధికారులకు చేరుతోందని, అందుకనే వారు దీనిపై స్పందించడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా ఉన్నతా ధికారులు స్పందించి మామూళ్లపేరుతో వసూళ్లకు పాల్పడు తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతు న్నారు. ఇప్పటికే 28శాతం జీఎస్టీ ఎఫెక్ట్‌, లైసెన్స్‌ ఫీజులు వంటి భారీ పెట్టుబడితో సతమతమవుతున్న వ్యాపారులకు ఈ ఏడా కొత్తగా వర్షభయం పట్టుకుంది. గత రెండు రోజులుగా వాతావరణం మెత్తబడి అక్కడక్కడ వర్షం కరుస్తుండడంతో వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కువ మొత్తంలో స్టాకు తీసుకొస్తే అమ్ముడవుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ పండుగ రోజుల్లో వర్షం వస్తే తాము తీవ్రంగా నష్టపోతామని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-11-01T04:45:01+05:30 IST