మృతదేహాల తరలింపులో జాప్యం!

ABN , First Publish Date - 2021-05-21T04:47:12+05:30 IST

మృతదేహాల తరలింపులో జాప్యం!

మృతదేహాల తరలింపులో జాప్యం!

కొవిడ్‌ వార్డులో పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడంతో సమస్య

భద్రాద్రి ఏరియా ఆసుపత్రిలో ఇదీ పరిస్థితి

భద్రాచలం, మే 20 : భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో కరోనాతో వైద్యంతో చికిత్సపొందుతూ.. కన్నుమూసిన వారి మృతదేహాలను తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు వార్డుల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడమే కారణమని తెలుస్తోంది. భద్రాచలం ఏరియా వైద్యశాలలో 140మంది కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు గాను ఆక్సిజన్‌ బెడ్లను ఏర్పాటు చేశారు. ఈక్రమంలో ఎవరైనా చనిపోతే.. వారి మృతదేహాలను తరలించడంలో ఆలస్యమవుతుండటం, గంటల తరబడి మృతదేహాలను చూడలేక అక్కడ చికిత్సపొందుతున్న వారు, వారి వెంట ఉండే కుటుంబీకులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల క్రితం కూడా ఇదే తరహా సమస్య ఎదురైనట్టు తెలుస్తుండగా.. బుధవారం రాత్రి ఓ మృతదేహాన్ని తరలించని విషయాన్ని ఓ బాధితుడు వీడియోతీసి సోషల్‌మీడియాలో పెట్టగా అది కాస్తా వైరల్‌ అయ్యింది. జిల్లా అధికార యంత్రాంగం స్పందించి తాత్కాలిక సిబ్బందిని నియమిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయమై భద్రాచలం ఏరియా వైద్యశాల డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామకృష్ణను సంప్రదించగా సిబ్బంది పూర్తిస్థాయిలో లేకపోవడం వల్లే మృతదేహాలను తరించడంలో జాప్యం జరుగుతోందన్నారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, పరిస్థితి విషమించి కొందరు మృతి చెందుతున్నారని, కానీ ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చ్యలు తీసుకుంటున్నామన్నారు.

Updated Date - 2021-05-21T04:47:12+05:30 IST