ఇంటికి తాళం వేసిన డీసీసీబీ అధికారులు
ABN , First Publish Date - 2021-02-26T05:32:55+05:30 IST
మండలంలోని గరికపాడు గ్రామంలో జేఎల్‌జీ పెండింగ్ రుణాల వసూళ్లకు వెళ్లిన డీసీసీబీ అధికారులు ఏకంగా ఒక ఇంటికి తాళం వేసి సీలు వేశారు.

జేఎల్‌జీ పెండింగ్ రుణాలతో చర్యలు
వైరా, ఫిబ్రవరి25: మండలంలోని గరికపాడు గ్రామంలో జేఎల్‌జీ పెండింగ్ రుణాల వసూళ్లకు వెళ్లిన డీసీసీబీ అధికారులు ఏకంగా ఒక ఇంటికి తాళం వేసి సీలు వేశారు. బుధవారం రాత్రి ఈతంతు గరిక పాడులో మేరుగు రూబేన్, మేరుగు చందు ఇంటి వద్ద జరిగింది. జేఎల్‌జీలో భాగంగా వీరు తీసుకున్న రుణం రూ. 12600 బకాయిగా ఉంది. ఇటీవల జిల్లాలోని అన్ని డీసీసీబీ బ్రాంచ్‌ల పరిధిలో జేఎల్‌జీ పెండింగ్ రుణాల వసూళ్లు చేపట్టారు. కొన్నిచోట్ల ఆస్తుల జప్తు కూడా చేస్తున్నారు. దానిలో భాగంగానే బుధవారం వైరా డీసీసీబీ అధికారులు, సిబ్బంది, పోలీసులు గన్నవరం, గరికపాడు గ్రామాల్లో జేఎల్‌జీ పెండింగ్ రుణాలు వసూలు చేశారు. గరికపాడులో రూబేన్, చందు ఇంటికి తాళం వేసి సీలు వేశారు. డీసీసీబీ బ్యాంకు అలాగే పోలీసు అనుమతి లేకుండా సీలు వేసిన తాళాన్ని తీయకూడదని స్పష్టం చేశారు. దాంతో బాధితులు గురువారం వైరా డీసీసీబీకి చేరుకొని ఈ విషయమై అధికారులను ప్రశ్నించారు. కేవలం రూ.12,600బకాయి కోసం ఇంటికి తాళం వేసి సీటు వేయటాన్ని ప్రశ్నించారు. ఇంటికి తాళం వేయటం వలన తాము రాత్రంతా బంధువుల ఇళ్లలో పడుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంట్లో ఎవరూ లేనందునే తాళంతో సీలు వేశాం
నాగరాణి, డీసీసీబీ మేనేజర్, వైరా
రుణాల వసూళ్ల సమయంలో మేరుగు రూబేన్, చందు ఇంటి వద్ద ఎవరూ లేరు. వారిని సంప్రదిం చేందుకు ప్రయత్నించాం. అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో కోర్టు నుంచి తాము పొందిన జప్తు నోటీసు ప్రకారం చట్టానికి లోబడి ఇంటికి తాళంతో సీలు వేశామని వివరించారు. ఆతలుపుకు జప్తు నోటీసు అంటించామని చెప్పారు. ఇంట్లో ఎవరూ లేనందునే సీలు వేశామని స్పష్టం చేశారు.