ప్రమాదకరంగా హైలెవల్‌ వంతెన!

ABN , First Publish Date - 2021-10-30T05:03:48+05:30 IST

నవ్విపోదురుకాక మాకేంటి సిగ్గు... ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎంతమంది క్షతగాత్రులైనా, ప్రాణాలు పోయినా, ఆస్తులు ధ్వంసమైనా మాకేంటి అన్నట్లుగా వ్యవహరిస్తుంది నేషనల్‌ హైవే అథార్టీ అధికారుల తీరు.

ప్రమాదకరంగా హైలెవల్‌ వంతెన!
దిమ్మెసహా ధ్వంసమైన రెయిలింగ్‌

 ధ్వంసమైన రెయిలింగ్‌

 ప్రాణాంతకంగా ప్రయాణాలు

 ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోని నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు

వైరా, అక్టోబరు 29: నవ్విపోదురుకాక మాకేంటి సిగ్గు... ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎంతమంది క్షతగాత్రులైనా, ప్రాణాలు పోయినా, ఆస్తులు ధ్వంసమైనా మాకేంటి అన్నట్లుగా వ్యవహరిస్తుంది నేషనల్‌ హైవే అథార్టీ అధికారుల తీరు. పలు రాష్ట్రాలకు కీలక జాతీయ రహదారిగా ఉన్నప్పటికీ ప్రయాణాల భద్రత విషయంలో అత్యంత ఉదాసీనంగా వ్యవహరిస్తుందనే తీవ్ర విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ నేషనల్‌ హైవేలో వైరా-పినపాక మధ్య వైరా నదిపై ఉన్న హైలెవల్‌ వంతెన మృత్యుకుహరంగా ఉంది. ఇక్కడ కనీస భద్రతా ఏర్పాట్లు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణ, గుజరాత్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, చత్తీ్‌సఘడ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల వాహనాల రాకపోకలకు ఈ జాతీయ రహదారి అత్యంత కీలకంగా ఉంది. 

నిత్యం 50వేల వాహనాల రాకపోకలు

నిత్యం 50వేలకుపైగా భారీ ఇతర అన్నిరకాల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అలాంటి కీలకమైన ప్రధాన రహదారిలోని వైరా నదిపై హైలెవల్‌ వంతెన శిథిలావస్థకు చేరుకొని ప్రమాదకరంగా ఉంది. ఈ వంతెనను నిర్మించి పట్టుమని 30ఏళ్లు కూడా కాలేదు. 1991 ప్రాంతంలో అప్పటి సీఎం నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1993-94 ప్రాంతంలో దీని నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చింది. ఆసమయంలో వాహనాల రాకపోకల సంఖ్య ఐదారువేలలోపు మాత్రమే ఉండేది. ఇప్పుడు 50వేల పైచిలుకు వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ వంతెనకు ఒకవైపు దిమ్మెసహా రెయిలింగ్‌ పూర్తిగా ధ్వంసమైంది. అప్రోచ్‌ రోడ్డు నుంచి వంతెన పైకి వాహనాలు వెళ్లే సమయంలో ప్రమాదకరమైన మూలమలుపు ఉంది. దాంతో వాహనాలు వంతెన ముందుభాగంలో దిమ్మె, రెయిలింగ్‌ను ఢీకొని ప్రమాదాలకు గురవుతున్నాయి. రెయిలింగ్‌ భాగమంతా ధ్వంసమైంది. వంతెనకు మరోవైపు రెయిలింగ్‌ కూడా వాహనాలు ఢీకొని కొంతభాగం ధ్వంసమైంది. ఇవి ధ్వంసమై రెండేళ్లు దాటినా ఇంతవరకు కనీసం మరమ్మతులు లేవు. వంతెన పైభాగంలో గుంతలేర్పడి వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తరచూ ప్రమాదాలు జరగటం వలన అనేకమంది గాయపడటం, వాహనాలు దెబ్బతిని ఆస్తినష్టం సంభవించటం జరుగుతుంది. గంటలతరబడి వేలాది వాహనాల రాకపోకలు స్తంభించిపోతున్నాయి. నేషనల్‌ హైవే అథార్టీ, పోలీసు, రవాణాశాఖ అధికారులు అనేకసార్లు ముమ్మర తనిఖీలు చేసి రక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించినప్పటికీ ఇంతవరకు అతీగతీ లేదు. వెంటనే ఈ వంతెన వద్ద భద్రతకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని వాహనచోదకులు కోరుతున్నారు.


Updated Date - 2021-10-30T05:03:48+05:30 IST