యాసంగిలో వరికి ప్రత్యామ్నాయం చూడాలి

ABN , First Publish Date - 2021-11-28T06:38:41+05:30 IST

యాసంగిలో వరికి ప్రత్యామ్నాయం చూడాలి

యాసంగిలో వరికి ప్రత్యామ్నాయం చూడాలి
వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, జిల్లా అధికారులు

రైతులకు అవగాహన కల్పించాలి

వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశం

ఖమ్మం కలెక్టరేట్‌, నవంబరు 27: యాసంగిలో పారాబాయిల్డ్‌ బియ్యాన్ని కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) స్పష్టం చేసిందని, దీంతో రాష్ట్రంలో రైతులు యాసంగిలో వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని, ఈ దిశగా కలెక్టర్లు, అధికార యంత్రాంగం రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్‌ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్లు, పోలీస్‌కమిషనర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఎఫ్‌సీఐ వచ్చే యాసంగిలో రాష్ట్రం నుంచి ఒక్క గింజ కూడా పారాబాయిల్డ్‌ రైస్‌ను తీసుకోబోమని తేల్చిచెప్పిందని, దాంతో పారాబాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేయబోమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులు యాసంగిలో వరి సాగు చేయకుండా భూసారానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేసే విధంగా ప్రతి రైతువేధికల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. వానాకాలం ధాన్యం కొనుగోలుకుగాను అన్ని కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, ఽధాన్యం సేకరణలో రైతులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి ఒక సీనియర్‌ అధికారిని నియమించాలని సూచించారు. సరిహద్దుల్లో ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్ర కోనుగోలు కేంద్రాలకు అక్రమంగా ధాన్యం రాకుండా  చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ అన్ని జిల్లాల్లో పూర్తిస్తాయిలో జరగాలని మెదటి డోస్‌ తీసుకున్నవారి కాలపరిమితిని పరిశీలించి రెండో డోస్‌ కూడా అందించాలన్నారు. ఇంకా అసలు తీసుకోని వారిని గుర్తించి టీకాలు వేయాలని ఆయన సూచించారు. కోవిడ్‌తో మరణించిన వారికి ప్రభుత్వం అందిస్తున్న పరిహారం కోసం అందిన దరఖాస్తులను వెంటనే పరిశీలన చేసి మంజూరి కోసం చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను సీఎస్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కోనుగోలు కేంద్రాల గురించి వివరించారు. జిల్లాకు సరిహద్దుల్లో కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఖమ్మం జిల్లా కోనుగోలు కేంద్రాలు అక్రమ ధాన్యం రవాణాను నివారించేందుకు ఇప్పటికే ఎనిమిది ప్రాంతాలను గుర్తించి చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యాసంగి సాగుపై క్లష్టర్‌ స్థాయిలో రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ గౌతమ్‌ వివరించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో సీపీ విష్ణుఎస్‌ వారియర్‌, అదనపు కలెక్టర్‌ ఎన్‌ మధుసూదన్‌, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేందర్‌, సివిల్‌సప్లయీస్‌ జిల్లా మేనేజర్‌ సోములు, డీఆర్డీవో విద్యాచందన, జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయనిర్మల, జిల్లా మార్కెటింగ్‌ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-28T06:38:41+05:30 IST