ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరం

ABN , First Publish Date - 2021-12-08T04:22:51+05:30 IST

యాసంగిలో వరి సాగు వద్దు. ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరమని కలెక్టర్‌ అనుదీప్‌ సూచించారు.

ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరం
పంట మార్పిడి సదస్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనుదీప్‌

యాసంగిలో వరి సాగు చేయొద్దు

కూరగాయలు, పప్పు ధాన్యాలతో ఎక్కువ ఆదాయం

రైతులకు కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌ పిలుపు

పినపాక, డిసెంబరు 7: యాసంగిలో వరి సాగు వద్దు. ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరమని కలెక్టర్‌ అనుదీప్‌ సూచించారు. మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పోట్లపల్లిలో నిర్వహించిన పంట మార్పిడి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి చేసుకోవడం వల్ల భూసారం పెరుగుతుందన్నారు. ధాన్యం కొనుగోళ్లను భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నిలిపివేసినందున, యాసంగి పంటగా వరిని సాగు చేయొద్దని రైతులకు సూచించారు. యాసంగిలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలుగా వాణిజ్య, కూరగాయ పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. ముఖ్యంగా వాణిజ్య పంటలు ద్వారా తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ ఆదాయం పొందవచ్చన్నారు. సమావేశమనంతరం పాతరెడ్డిపాలెంలోని బృహత్‌ పల్లెప్రకృతి వనాన్ని సందర్శించారు. అనంతరం ఏడూళ్లబయ్యారం గ్రామంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను పరిశీలించి వంద శాతం టీకాలను పూర్తి చేయాలని ఆదేశించారు. పినపాక తహసీల్దార్‌ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కలెక్టర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ బి.విక్రమ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి అభిమన్యుడు, జిల్లా ఉద్యానవనాధికారి మరియన్న, ఏడీఏ బి.తాతారావు, పోట్లపల్లి సర్పంచ్‌ తోలెం కల్యాణి, ఎంపీడీవో పి.శ్రీనివాసులు, ఏఈ ఈ.వెంకటేశ్వర్లు, పినపాక మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శివకుమార్‌, ఏఈవో రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T04:22:51+05:30 IST