ఆన్‌లైన్‌లో పంటల నమోదు

ABN , First Publish Date - 2021-12-10T04:52:20+05:30 IST

ఈ యాసంగి సాగు సీజన్‌ నుంచి ప్రభుత్వం నూతన పంటల నమోదు ప్రక్రియను చేపట్టింది. వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) స్వయంగా భూముల వద్దకు వెళ్లి పరిశీలించి ట్యాబ్‌లో వివరాలు పొందుపరుస్తారు.

ఆన్‌లైన్‌లో పంటల నమోదు
పంటలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న ఏఈవో(ఫైల్‌)

 9వేల ఎకరాల్లో పూర్తి

 క్షేత్రస్థాయికి వెళుతున్న ఏఈవోలు

ఖమ్మంవ్యవసాయం, డిసెంబరు9: ఈ యాసంగి సాగు సీజన్‌ నుంచి ప్రభుత్వం నూతన పంటల నమోదు ప్రక్రియను చేపట్టింది. వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) స్వయంగా భూముల వద్దకు వెళ్లి పరిశీలించి ట్యాబ్‌లో వివరాలు పొందుపరుస్తారు. ఇప్పటి వరకు  జిల్లాలో 9వేల ఎకరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ధరణి పోర్టల్‌ ఆధారంగా, గ్రామ మ్యాప్‌ సూచికలను పరిగణనలోకి తీసుకుంటారు. సర్వే  నంబరు ఆధారంగా రైతు పేరు, ఆగ్రామం, సాగు చేసిన పంట, విస్తీర్ణం తదితర అంశాలను నమోదు చేస్తారు. సంబంధిత మండల, డివిజన్‌, నోడల్‌, జిల్లా అధికారికి రాష్ట్ర  వ్యవసాయ శాఖ రూపొందించిన పోర్టల్‌కు ఆన్‌లైన్‌లో అనుసంధానం చేస్తారు. ఈ మేరకు ప్రతి బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖకు పు రోగతి వివరాలను పంపించాలి. జిల్లాలో ప్రతి యాసంగి సీజన్‌లో నీటి వనరుల ఆధారంగా 3.20లక్షల ఎకరాల్లో వాణిజ్య, 1.30 లక్షల ఎకరాల్లోఉద్యాన పంటలు సాగవుతుంటాయి. వీటన్నింటి వివరాలను ఉద్యాన అధికారుల సహకారంతో వ్యవసాయశాఖ నమోదు చేస్తోంది.  ఇటీవల వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి హన్మంతు కొడింబా కూసుమంచి, కొణిజర్ల మండలాల్లో క్షేత్రాలను పరిశీలించారు.  పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు.

 కార్యాచరణ, ఫలితాలు...

క్షేత్రస్థాయి నమోదు ద్వారా మొత్తం పంటల వివరాలు స్పష్టం అవుతాయి. జిల్లాకు ఒక నోడల్‌ అధికారిని నియమించారు. సిబ్బందికి శిక్షణ, అమలుపై పర్యవేక్షణ ఉండేలా చూస్తున్నారు. నేలల ఆధారంగా వాడాల్సిన ఎరువులను రైతులకు వివరిస్తారు. నీటి యాజమాన్యంతో పాటు తెగుళ్ల నివారణకు నిపుణులు, శాస్త్రవేత్తలు ఫోన్‌లో సూచనలిస్తారు. కోతల సమయానుకూలంగా కొనుగోళ్లకు తగిన చర్యలు తీసుకుంటారు. వరికి బదులు ప్రత్యామ్మాయంగా పంటలు వేసేలా ఈ విధానం మరింత  ఉపయుక్తం అవుతుందని భావిస్తున్నారు.

రైతులను చైతన్యపరుస్తున్నాం

 ఎం.విజయనిర్మల, జిల్లా వ్యవసాయాధికారి

 ఆన్‌లైన్‌లో పంటలను నమోదు చేయడం వల్ల చాలా లాభాలున్నాయి. ఎరువుల వాడకం దగ్గరనుంచి పంటల బీమా వరకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ విధానం పంటల సాగులో కీలక భూమిక పోషిస్తుంది. ఏఈవోలు నిర్లక్ష్యం చేస్తే వెంటనే గుర్తిస్తాం. ఇప్పటి వరకు 9వేల ఎకరాల్లో ప్రక్రియను నిర్వహించాం.రైతులను చైతన్యపరిచి, ఆధునిక సాగులో వారికి అవగాహన కల్పిస్తున్నాం. 


Updated Date - 2021-12-10T04:52:20+05:30 IST