యువతపై కొవిడ్‌ పంజా.. రెండోదశలో భారీగా పెరుగుతున్న బాధితులు

ABN , First Publish Date - 2021-04-21T06:08:16+05:30 IST

కరోనా మొదటి దశలో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు ఎక్కువగా వైరస్‌ తీవ్రతకు గురయ్యారు. కానీ రెండోదశలో వైరస్‌ తన రూపుమార్చుకుని.. యువతపై పంజా విసురుతోంది.

యువతపై కొవిడ్‌ పంజా.. రెండోదశలో భారీగా పెరుగుతున్న బాధితులు
ఖమ్మంలో మొబైల్‌ కరోనా పరీక్ష కేంద్ర వద్ద ఎక్కువగా ఉన్న యువతీ యువకులు

నిర్ధారణకు వస్తున్న వారిలో 85శాతం 40ఏళ్లలోపు వారే

వారిలో 60శాతం మందికి పాజిటివ్‌ 

బాధితుల్లో కనిపిస్తున్న విదేశీ వైరస్‌ ఆనవాళ్లు 

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు తీవ్ర ఆస్వస్థత

ఖమ్మం సంక్షేమ విభాగం, ఏప్రిల్‌ 20: కరోనా మొదటి దశలో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు ఎక్కువగా వైరస్‌ తీవ్రతకు గురయ్యారు. కానీ రెండోదశలో వైరస్‌ తన రూపుమార్చుకుని.. యువతపై పంజా విసురుతోంది. ఆరోగ్యంగా, దృఢంగా ఉన్న 40ఏళ్ల లోపు వారినీ కుంగదీస్తోంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో జరుగుతున్న కరోనా నిర్ధారణ పరీక్షల్లో 85శాతం పరీక్షలకు వచ్చిన 40ఏళ్లలోపు వారే ఉంటున్నారు. గతంలో 40ఏళ్లలోపు వారికి పాజిటివ్‌ వచ్చినా దాని తీవ్రత అంతగా కనిపించేది కాదు. కానీ ప్రస్తుతం కరోనా లక్షణాలతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులున్న వారు తీవ్ర ఆస్వస్థతకు గురవుతున్నారని ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు గుర్తించారు.

85శాతం 45ఏళ్లలోపు వారు పరీక్షలకు.. 

నిత్యం ఖమ్మంజిల్లాలో వైద్యఆరోగ్యశాఖ పరిధిలోని 33పీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రి, రెండు మొబైల్‌ వాహనాల ద్వారా సరాసరి 3వేల నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ పరీక్షలకు వచ్చే వారిలో 85శాతం మంది 40ఏళ్ల వయసు వారే ఉన్నట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. నిత్యం 1000 వరకు పాజిటివ్‌లు నమోదవుతుండగా వాటిలో 600కు  పైగా పాజిటివ్‌లు 40ఏళ్ల లోపు వారే ఉంటున్నారు. ఇక తొలి విడత కరోనా వ్యాప్తి సమయంలో 40ఏళ్లలోపు వారికి చాలా తక్కువ స్థాయిలో లక్షణాలు బయటపడ్డాయి. రెండో విడతలో మాత్రం వ్యాధి నిరోధకశక్తి ఎక్కువగా ఉండే యువత ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే బాధితులుగా మారుతున్నారు. 40ఏళ్లలోపు వారిలో రక్తపోటు, మధుమేహం, పక్షవాతం లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరుతున్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా ఆసుపత్రిలోని కరోనా ఐసోలేషన్‌వార్డులో 115మంది పాజిటీవ్‌ వచ్చిన వారు ఉండగా వారిలో 60శాతం మంది 40ఏళ్లలోపు వారు ఉండటం పట్ల ఆసుపత్రి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

‘విదేశీ’ వైరస్‌ల ప్రభావం..

ఖమ్మం జిల్లా వాసులకు విదేశాలతో సంబంధాలు ఎక్కువగానే ఉంటాయి. విద్యా, ఉద్యోగం, కుటుంబసభ్యుల కోసం విదేశాలకు వెళ్లివస్తున్న వారిలో, అలా విదేశాల నుంచి వచ్చిన వారిని కలుస్తున్న వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన వారు ఎక్కువగా ఉంటున్నారని ఓ అంచనా. హైదరాబాద్‌ తర్వాత అత్యధికంగా ఖమ్మం జిల్లాకు చెందిన వారికే విదేశాలతో ఎక్కువ సంబంధాలు ఉంటాయని చెబుతుంటారు. తొలి దశ కరోనా వ్యాప్తి సమయంలో ఒకే విధమైన పాజిటివ్‌లు నమోదవగా వాటిని చైనా కరోనా వైరస్‌గా గుర్తించి వైద్యసేవలు అందించారు. కానీ ప్రస్తుత రెండోదశలో పలు రకాల వైరస్‌లు జిల్లాకు వ్యాపించినట్లు జిల్లా ఆసుపత్రిలోని కరోనా ఐసోలేషన్‌ వార్డులో వైద్యసేవలు అందిస్తున్న ప్రభుత్వ వైద్యులు గుర్తించారు. ముఖ్యంగా  ఆఫ్రికన్‌, యూకే స్టెయిన్‌ వైరస్‌ ప్రభావం జిల్లాలో ఎక్కువగా కనిపిస్తున్నట్టు వైద్యఆరోగ్యశాఖలో చర్చ జరుగుతోంది. కానీ వీటిపై సరైన ఆధారాలు లేవని జిల్లా అధికారులు చెబుతున్నారు. 

రెండోదశలో వయసుతో సంబంధం లేదు

డాక్టర్‌ బొల్లికొండ శ్రీనివాసరావు, ఖమ్మం జిల్లా ఆసుపత్రి ఆర్‌ఎంవో

రెండోదశ కరోనా వైరస్‌ వయసుతో సంబంధం లేకుండా వ్యాపిస్తోంది. విద్యార్థులు, 40ఏళ్లలోపు వారు కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. గతంలో కంటే వైరస్‌ వ్యాప్తి, శక్తి పెరిగినట్టు తెలుస్తొంది. గతంలో ఒకే రకమైన వైరస్‌, లక్షణాలతో బాధితులు వచ్చేవారు. కానీ ఇప్పుడు కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. విదేశీ కరోనా వైరస్‌ ప్రభావం కూడా జిల్లాలో అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. 40ఏళ్లలోపు వయసుండి దీర్ఘకాలిక వాఽ్యధులున్న వారు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నామని అనుకోవద్దు. కరోనా విషయంలో అశ్రద్ధ చేయొద్దు.


Updated Date - 2021-04-21T06:08:16+05:30 IST