కొవిడ్ రోగులకు పోలీసుల బాసట
ABN , First Publish Date - 2021-05-09T05:01:54+05:30 IST
విపత్కర పరిస్థితిలో కొవిడ్ రోగులకు సరైన వైద్యసమాచారం అందించేందుకు పోలీస్‌శాఖ నడుంబిగించింది. వారికి కావాల్సిన వైద్య ఇతర సహాయం తక్షణం అందించాలని భావిచింది.

జిల్లా హాస్పటల్లో హెల్ఫ్‌డెస్క్
ప్రారంభించిన సీపీ విష్ణు వారియర్
ఖమ్మంసంక్షేమవిభాగం, మే8: విపత్కర పరిస్థితిలో కొవిడ్ రోగులకు సరైన వైద్యసమాచారం అందించేందుకు పోలీస్‌శాఖ నడుంబిగించింది. వారికి కావాల్సిన వైద్య ఇతర సహాయం తక్షణం అందించాలని భావిచింది. ఈ నేపథ్యంలో హెల్ఫ్డెస్క్ను ఏర్పాటు చేసింది. ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను పోలీసు కమిషనర్ విష్ణు యస్ వారియర్ శనివారం ప్రారంభించారు. ఇక్కడ పోలీసులు, వైద్యసిబ్బంది అందుబాటు లో ఉంటారని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి హాస్పటల్‌కు వచ్చిన వారికి పగలు రాత్రి కావాల్సిన సహాయం అందించాలని ఆదేశించారు. కొవిడ్ రోగులు సరైన వైద్యసేవల కోసం ఎవ్వర్ని సంప్రదించాలో సరైన సమాచారం ఈ డెస్క్ ద్వారా అందిస్తామన్నారు. కరోనా వైరస్ అతివేగంగా వ్యాపిస్తున్న సమయం లో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ హాస్పటల్‌కు వచ్చే వారికి కొవిడ్ రోగుల కోసం కొవిడ్ 19హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. కొవిడ్ నిభందనలు పాటిస్తూ మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని పోలీసు కమిషనర్ విష్ణు యస్ వారియర్ సూచించారు. ఈ కార్య క్రమంలో అదనపు డీసీపీ శాంతి భద్రతలు సుభాష్ చంద్రబోష్, హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచి ఏసీపీ ప్రసన్నకుమార్, సీఐలు కరుణాకర్, వెంకన్నబాబు సిబ్బంది పాల్గొన్నారు.
ఖమ్మం కలెక్టరేట్లో కొవిడ్ కాల్‌సెంటర్ ఏర్పాటు
అత్యవసర సేవలకు డయల్ 1077కు చేయండి: కలెక్టర్ కర్ణన్
ఖమ్మం కలెక్టరేట్ : కొవిడ్ సోకిన వారు, అత్యవసర సేవలను పొందేందుకు ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో కాల్‌సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సేవల కోసం 1077 నెంబర్‌కు డయల్ చేయాలని కలెక్టర్ ఆర్వీకర్ణన్ తెలిపారు. 24గంటల పాటు పనిచేసే ఈ సెంటర్ ద్వారా కొవిడ్ సోకిన వారికి కావాల్సిన ప్రభుత్వ సేవల వివరాలు, ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఖాళీ పడకల వివరాలు, ఆక్సీజన్ లభ్యత వివరాలు రెమిడెసివర్ ఇంజెక్షన్ల లభ్యత వివరాలు అంబులెన్స్ వివరాలు తెలుసుకునేందుకు ఈ సెంటర్ ఉపయోగపడుతుందని కలెక్టర్ చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.