9రోజులు.. 400కాల్స్..! సత్ఫలితాలిస్తున్న కొవిడ్ సహాయక కేంద్రం
ABN , First Publish Date - 2021-05-21T04:37:05+05:30 IST
9రోజులు.. 400కాల్స్..! సత్ఫలితాలిస్తున్న కొవిడ్ సహాయక కేంద్రం

బాధితుల నుంచి వెల్లువెత్తుతున్న ఫోన్‌కాల్స్
24గంటల సేవలతో భరోసానిస్తున్న సిబ్బంది
వైద్య పర అంశాలకు వైద్యులు, సైకియాటిస్ట్ అవసరమని అభిప్రాయాలు
ఖమ్మం కలెక్టరేట్, మే 20: మాకు రెమిడెసివర్ ఇంజక్షన్లు కావాలి.... ఎవరిని సంప్రదించాలి... !
వారం రోజులుగా జలుబు, దగ్గు వస్తోంది.. కరోనా లక్షణాలేమోనని భయంగా ఉంది... ఎక్కడ పరీక్షలు చేయించుకోవాలి?
ఊపిరి పీల్చుకోలేక పోతున్నాం... ఆస్పత్రిలో చేరాలంటే ఎక్కడికి వెళ్లాలి.. ఏ ఆసుపత్రిలో బెడ్లు ఖాళీగా ఉన్నాయి?
ఇలా ఖమ్మం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కొవిడ్ సహాయక కేంద్రానికి గత తొమ్మిది రోజుల్లో 400ఫోన్‌కాల్స్ వచ్చాయి. కోవిడ్ బాధితులు.. వారి బంధువులు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు.....అయితే అక్కడ ఉన్న సిబ్బంది వారి పరిధిలో సమాధానం చెబుతున్నా.. బాధితుల బాధను.. వారి మనోవేదనను తీర్చేందుకు ప్రత్యేకంగా ఓ వైద్యుడు.. మరో సైకియాటిస్ట్ అందుబాటులో ఉంటే మరింత ఊరట కలిగే ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. కొవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 12 నుంచి లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోనూ లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేసేలా చర్యలు తీసుకున్న అధికారులు.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కలెక్టర్ ఆర్వీకర్ణన్ ఆదేశాలతో కలెక్టరేట్‌లో ప్రజల కోసం కొవిడ్ సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 1077 నెంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కేంద్రంలో తొమ్మిది మంది సిబ్బంది.. మూడు షిఫ్టుల్లో 24గంటల పాటు నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారు. మూడు ఫోన్ల ద్వారా జిల్లాలోని కొవిడ్ బాధితులు, వారి బంధువులకు సమాచారాన్ని అందిస్తున్నారు. అయితే ఈకేంద్రం ప్రారంభమైన ఈనెల 12వ తేదీ నుంచి గురువారం ఉదయం వరకు మొత్తం 400 కాల్స్ వచ్చాయి. వీటిలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కోసం కాల్స్ చేసినవారే సుమారు 250మంది బాధితులు ఉన్నారు. ఇక మిగిలిన వారిలో కొవిడ్ పరీక్షల కోసమని, ఆసుపత్రుల్లో చేరేందుకని, మరికొందరు అంబులెన్స్‌ల కోసమని.. చేసిన వారున్నారు. ఈక్రమంలో సిబ్బంది కూడా తమ పరిధిలో సంయమనంగా సమాధానమిస్తున్నారు. అయితే వ్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ఫీజుల వసూలు, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల బ్లాక్ మార్కెట్ విషయాలపై మాత్రం పోలీస్‌కంట్రోల్‌రూం 100కు గానీ, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి, టాస్క్‌ఫోర్స్ పోలీసులకు గానీ రిఫర్ చేస్తున్నారు. ఈ క్రమంలో కాల్‌సెంటర్ పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే కాల్‌సెంటర్‌కు ఫోన్ చేస్తున్న కొందరు బాధితులు వైద్యపరమైన విషయాలు అడుగుతుండడంతో.. సిబ్బంది సమాధానం చెప్పలేక పోతున్నారు. కొందరైతే బోరున విలపిస్తున్నారు. ఇలాంటి వారికి భరోసా కల్పించేందుకు ప్రత్యేకంగా ఒక వైద్యుణ్ని, ఓ సైకియాటిస్ట్‌ను కాల్‌సెంటర్‌లో నియమించగలిగితే బాధితులకు మరింత భరోసా కల్పించినట్టు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.